ఖర్మలో బండి‘ఱ’

66

అరె.. ఎంత తేడా కొట్టేసింది చెప్మా!

‘ఖర్మ’ అంటే ప్రారబ్ధం కాదు! ‘పట్టుబట్టలూ లేదా పౌరుషమూ’ నట!

నిఘంటువు నిర్దాక్షిణ్యంగా చెప్పేసింది.

అవేవీ లేకుండానే, ఖర్మ ఉన్నదే బతుకులో!

తప్పుడు అర్థమే సరైనదని అనుకుంటూ నిత్య వ్యవహారంలో వాడేస్తున్నామే…!

 

నిఘంటువుల్ని క్షమించి, కాస్త సవరించాలి.. జనవ్యవహారంలో నిలిచినదే జీవభాష

మృత అర్థాలనూ, వ్యర్థ భాష్యాలనూ పాతర వేయండి

మీ వ్యుత్పత్త్యార్థాలూ, భాషాప్రమాణాలూ కట్టిపెట్టండి

ఖర్మంటే ప్రారబ్ధమే, ఒప్పుకోండి!

 

లేకుంటే, కోటానుకోట్ల దుఃఖభోగులం మేం

కించపడి, ఏతత్ కర్మానుసారంగా… క్రమానుగతంగా మూర్ఛిలుతాం!

ఆర్తితో మేం ప్రతిపాదిస్తున్న, మా బతుకులకు మేమే ఆపాదిస్తున్న

ఖర్మను, మా కోసం ఒప్పుకోండి!

 

‘కర్మ’ అంటే ‘పని’- అలాగే కానీ,

‘ఖర్మ’ అంటే ‘బతుకు కాలిపోవడం’- అనునది

ఇంతవరకూ… సర్వజనామోదితం, నిఘంటు వినా!

ఇక ఇప్పుడు- ఖర్మ లో బండి ‘ఱ’ పెట్టండి

చిన్నమయ్య వారితో రెండు వీరతాళ్లు వేయిస్తాం!

‘ఖఱ్మ’ అనే నవీన పదసృష్టి చేయండి.. ఆ అవసరాన్ని గుర్తెరగండి… ఎందుకంటే,

బతుకులు ఇప్పుడు మరింత ఘోరంగా తగలడిపోతున్నాయి.