ఆఫ్గన్ విలువ ఆంధ్రప్రదేశ్ కు లేదా?

32

తాజాగా ట్రంప్ మనకు ఒక మేలు చేశారు.  ఇరుగు పొరుగు దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్ని ఎగతాళి చేశారు. దేశవ్యాప్తంగా రాద్ధాంతం రేగింది. అంతర్జాతీయ యవనికపై ఈ ఎగతాళి మాటల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ దురహంకార స్వరాన్ని తిప్పికొట్టడానికి కేంద్రప్రభుత్వం తగురీతిలో స్పందిస్తోంది. అయితే… రెండో పార్శ్వం నుంచి చూసినప్పుడు… ఈ ఎగతాళి మాటల ద్వారా.. ట్రంప్ మనకు ఒక మేలు చేశారని తెలుస్తుంది. ఆర్తిలో ఉన్న వారికి మనదేశం ఎంత సాయం చేస్తున్నదో, యావత్ దేశం తెలుసుకునే అవకాశం ఇలా వచ్చింది. సామాన్యులకు సాధారణంగా అందుబాటులో ఉండని అధికారిక నివేదికలు, చట్టసభల చర్చల్లో మాత్రమే తెలుస్తూ ఉండే గణాంక వివరాలు ఇప్పుడు… ట్రంప్ ఎగతాళిని తిప్పికొట్టే ప్రయత్నంలో సామాన్య ప్రజలకు అందుతున్నాయి. ఇప్పటిదాకా 21వేల కోట్లకుపైగా సాయం చేశామని తెలుసుకుని ప్రతి భారతీయుడు గర్వించవచ్చు.

 

పార్ట్-1 :

ఆఫ్గనిస్తాన్ లో గ్రంథాలయానికి తమ దేశం సాయం చేస్తున్నట్లుగా మోడీ చెప్పారని… అదికూడా ఒక సాయమేనా అంటూ, దానిని ఎంత మంది వాడుతారో కూడా తనకు తెలియదని ట్రంప్ అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా, భారత్ ను ట్రంప్ ఎగతాళి చేశాడని అంతా ఆక్రోశిస్తున్నారు. వాస్తవంలో ఆఫ్గనిస్తాన్ కోసం భారత్ ఎంత సాయం చేసిందో లెక్కలు తీస్తున్నారు. 2001 సెప్టెంబరు 11న అమెరికా దళాలు, తాలిబన్ల పాలనను అంతమొందించిన నాటినుంచి.. ఇప్పటిదాకా ఆ దేశ పునర్నిర్మాణం కోసం భారత్ మూడు బిలియన్ డాలర్లు (21 వేల కోట్లు) అందజేసినట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ ను తప్పు పడుతున్నాయి. ఆయన ఎగతాళి మాటలకు, గణాంక వివరాలతో ససాక్ష్యమైన ఇలాంటి జవాబు తప్పక అవసరం. అయితే ఇక్కడ మనం మరొక కోణం పరిశీలించాల్సి ఉంది.

ఇప్పటిదాకా 18 ఏళ్లలో ఆఫ్గనిస్తాన్ కు భారత్ కేవలం గ్రంథాలయం మాత్రమే అందించిందని.. అమెరికా అధినేత ఒక అభిప్రాయంతో ఉంటే గనుక… ఆ తప్పును ట్రంప్ ఖాతాలో వేయడం అవివేకమే అవుతుంది. ట్రంప్ మాటలను గమనించినప్పుడు…  ‘గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు మోడీ తరచూ నాతో చెబుతుంటారు..’ అని వ్యాఖ్యానించారు. మోడీ తనతో చెప్పే మాటల ఆధారంగా ఏర్పడిన అభిప్రాయాన్నే ఆయన ఇవాళ బయటపెట్టారు. అలాంటప్పుడు మనం దేని గురించి బాధపడాలి? ట్రంప్ మన సాయాన్ని ఎగతాళి చేసినందుకా? మనం చేసిన మొత్తం సాయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకెళ్లలేకపోయిన ప్రధాని నరేంద్రమోడీ చేతగాని తనానికా? దేనిగురించి బాధపడాలి?

చాలా సంకుచితంగా ఆలోచించే సామాన్యమైన రాజకీయ బుద్ధులు ఉన్న నరేంద్రమోడీ.. బహుశా ఆఫ్గనిస్తాన్ కు భారత్ ఇన్నాళ్లుగా చేసిన మొత్తం సాయం ప్రస్తావన తెస్తే, కీర్తి కాంగ్రెస్ కు దక్కుతుందని సంకోచించి ఉండవచ్చు. గ్రంథాలయానికి సాయం బహుశా ఆయన ప్రభుత్వం చేపట్టినది అయి ఉండొచ్చు. కారణం ఏదైనా సరే.. మనం చేసిన పూర్తి సాయం ట్రంప్ ఎరికలో లేకపోవడం వల్లనే ఇలాంటి హేళనకు గురికావాల్సి వచ్చింది. ఇప్పుడు లెక్కలు చెప్పుకుని, స్వోత్కర్షలతో పరువు కాపాడుకోవాల్సి వస్తోంది.

 

పార్ట్ 2 :

మనదేశం, అభాగ్యస్థితిలో ఉన్న పొరుగుదేశానికి 18ఏళ్లలో 21 వేల కోట్ల రూపాయలు సాయం చేసిందంటే… ఆ దేశం నిలదొక్కుకోవడానికి అండగా నిలిచిందంటే.. అది మనందరమూ గర్వించాల్సిన విషయం. ‘దేశం అందించిన సాయం’ అంటే ఆ మొత్తంలో, సింధువులో బిందువులాగా, ఈదేశంలోని ప్రతి సామాన్యుడి చెమటబొట్టు కూడా ఏదో ఒక తీరుగా ఉండే ఉంటుంది. అందుకే మనందరమూ గర్వించవచ్చు. కానీ, ఈ గర్వం నీడలో.. ఒక బాధ తొంగిచూస్తోంది. పొరుగు దేశానికి అంత సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో అంతర్భాగం అయిన ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సాయం చేయడానికి, రాష్ట్రం గౌరవప్రదంగా నిలదొక్కుకునేలా చేయూత ఇవ్వడానికి ఎందుకు కపట నాటకాలు ఆడుతోంది? అనేది అర్థం కాని సంగతి.

తాలిబన్ పాలన అంతమొందిన నాటికి ఆఫ్గనిస్తాన్ పరిస్థితితో పోలిస్తే.. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మౌలిక సదుపాయాల పరంగా భిన్నంగా ఏం లేదు. రాజధాని కూడా లేని, వనరులే తప్ప సంపద లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాష్ట్ర విభజన చేసిన చట్ట ప్రకారం హక్కుభుక్తంగా ఈ రాష్ట్రానికి దక్కవలసినవి కొన్ని ఉన్నాయి. చట్టంతో నిమిత్తం లేకుండా.. కేంద్రంలో అధికారంలోకి రావడానికి మోడీ ప్రకటించిన వరాలు, చేసిన ప్రమాణాల రూపేణా మరికొన్ని ఉన్నాయి. వాటిలో కేంద్రం నెరవేర్చినవి ఎన్ని? ఎంత మొత్తం? అనివార్యంగా ఇవ్వక తప్పనివి కాకుండా… మాట ఇచ్చిన మేర ఇవ్వడానికి మోడీ ఏకొంతైనా చొరవ చూపించారా? అనేది సందేహమే.

ఈ 18 ఏళ్లలో ఆఫ్గనిస్తాన్ కు సుమారు 21 వేల కోట్లు (మూడు బిలియన్ డాలర్లు) కేంద్రం సాయం చేసింది. ఇందులో ఒక్క రూపాయి కూడా మనం చట్టబద్ధంగా వారికి ఇవ్వవలసిన మొత్తం కాదు. కేవలం భారత్ ఔదార్యం కిందనే లెక్క. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టబద్ధంగా, హక్కుగా దక్కవలసినవి తప్ప.. ఏమీ ఇవ్వలేదు. ఈ అయిదేళ్లలో రెవిన్యూలోటు, రాజధాని సాయం, కేంద్ర విద్యాసంస్థలకు గ్రాంట్లు.. ఇలాంటి సకలం లెక్కవేసినా, కేంద్రం ప్రకటనల ప్రకారం గణించినా, ఇరవై వేల కోట్లు కూడా ఉండవు.

పరాయిదేశం, స్వదేశీ రాష్ట్రం అనే వ్యత్యాసాలను పక్కన పెట్టి ఆలోచిద్దాం. 6.5 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి 3.1 కోట్ల జనాభాను కలిగి ఉండేది ఆఫ్గనిస్తాన్. 1.6 లక్షల చదరపు కిలోమీటర్లలో సుమారు 5 కోట్ల జనాభాను కలిగి ఉండేది ఆంధ్రప్రదేశ్. జనసాంద్రత విషయంలో వారికంటె మనరాష్ట్రం ఆరు రెట్లు ఎక్కువ. తలసరి జీడీపీ గమనించినా కూడా.. ఆఫ్గనిస్తాన్ లో అది 2024 డాలర్లుగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల డాలర్లు మాత్రమే. ఈ లెక్కలను పోల్చిచూసినప్పుడు.. సాయం పొందగల అర్హత ఆఫ్గనిస్తాన్ కంటె ఆంధ్రప్రదేశ్ కే చాలా ఎక్కువ ఉన్నదని మనకు అర్థమవుతుంది. కానీ, మోడీ నేతృత్వంలోని కేంద్రం మనకు ఏం చేస్తోంది?

ఆఫ్గన్ లోని హెరాట్ ప్రావిన్స్ లో సల్మా డ్యామ్ గా పేరున్నదాని నిర్మాణానికి భారత్ భారీగా సాయం అందించింది. ఎంతగా అంటే.. ఏకంగా దీని పేరు మార్చి ‘ఆఫ్గనిస్తాన్-భారత్ ఫ్రెండ్షిప్ డ్యామ్’ అని పేరు పెట్టారు. విద్యుత్తు అవసరాలకోసం పొరుగుదేశాల మీద ఆధారపడే దుస్థితిని తప్పించేలా హారి నది మీద నిర్మించిన అతిపెద్ద డ్యామ్ ఇది. దీని వలన 1.85 లక్షల ఎకరాల వరకు సాగవుతాయి.  2016లో ఈ డ్యామ్ ను ప్రధాని మోడీ, ఆఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో కలిసి ఆవిష్కరించారు. ఈ డ్యామ్ నిర్మాణం కోసం భారత్ ఏకంగా 2025 కోట్ల రూపాయలు (290 మిలియన్ డాలర్లు) ఖర్చు పెట్టింది. ఇదంతా సగంలో ఆగిపోయి ఉన్న డ్యామ్ నిర్మాణం పూర్తి కావడానికి భారత్ అందించిన సాయం మాత్రమే. అలాంటి నేపథ్యంలో రెండు లక్షల ఎకరాల సాగుకు ఆధరవు అయిన పోలవరం డ్యామ్ కు, బడ్జెట్ లో ముష్టి వేసినట్లుగా నిధులు విదిలించడం ఎందుకో అర్థం కాదు.

మరో అంశాన్ని కూడా గమనించాలి. ఆఫ్గనిస్తాన్ పార్లమెంటు ‘మిలి షురా’ ను భారత్ 628 కోట్ల రూపాయలు (90మిలియన్ డాలర్లు) ఖర్చుతో నిర్మించింది. పరాయిదేశంలో కేవలం ఒక భవనం నిర్మాణానికి 628 కోట్లు ఇచ్చిన కేంద్రం, చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కోర్ కేపిటల్ భవనాలన్నింటి నిర్మాణానికి కాగల ఖర్చు తన బాధ్యత కాగా… 2500 కోట్లకు మించి ఇవ్వలేం అంటూ ఎలా మాట్లాడుతుందో అర్థం కాదు. కోర్ కేపిటల్ లో కనీసం ‘మిలీ షురా’ వంటి అసెంబ్లీతోపాటు, సెక్రటేరియట్, హైకోర్టు తదితర పరిపాలన, తత్సంబంధ భవనాలు అన్నీ ఉండాలి. పొరుగుదేశంలో ఒక భవనానికి అంతసొమ్ము ఇచ్చాక.. స్వదేశీరాష్ట్రంలో అన్ని భవనాలకూ, వాటి మౌలిక సదుపాయాలకు కలిపి.. 2500 కోట్లు మాత్రమే అనడం.. వివక్షతో కూడిన హేయమైన నిర్ణయం కాక మరేమిటి?

అలాగే, ఆఫ్గనిస్తాన్ లోని డెలారామ్- జరంజ్ రహదారి నిర్మాణానికి భారత్ పూర్తిస్థాయిలో నిధులు సాయం చేసింది. డెలారామ్ నుంచి ఇరాన్ సరిహద్దులో ఉండే జరంజ్ ను ఇది అనుసంధానిస్తుంది. 218 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి భారత్ 942 కోట్లు (135 మిలియన్ డాలర్లు) ఖర్చు పెట్టింది. ఆ దామాషాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేంద్రం ఏం చేస్తోంది?

ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే.. ఆఫ్గన్ కు ప్రతిసాయం.. ఔదార్యంతో చేసినది మాత్రమే. అదే ఆంధ్రప్రదేశ్ కు బాధ్యతగా చేయాల్సినవి కూడా నెరవేర్చకుండా కేంద్రం వివక్ష చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యాన్ని, నాటి పరిస్థితుల్ని బట్టి చూస్తే.. విభజన చట్టంలో లేకపోయినా.. ఔదార్యంతో మరింత నిధులు ఇచ్చి ఉండాల్సిందని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే కాదు… కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటినుంచి.. తెలంగాణ ప్రభుత్వం,  నాయకులు పదేపదే అడుగుతున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలనే డిమాండ్ ను కేంద్రం చెవినవేసుకున్నట్లుగా కూడా కనిపించ లేదు. ఆఫ్గన్ ‘మిలీ షురా’ ప్రారంభానికి వెళ్లిన మోడీ.. ఆ దేశంలో ‘మరో 116 చిన్న చిన్న అభివృద్ధి ప్రాజెక్టులకు సాయం చేస్తామని, యువత నైపుణ్యాభివృద్ధికి ఇతోధికంగా సహకరి’స్తామని  మాట ఇచ్చారు. అదే మోడీ.. అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఏం చెప్పారు? ఏం చేశారు? తలచుకోవడమే సిగ్గుచేటు. అక్కడ సాయం చేయడంలోని పోకడ  కీర్తి కాంక్ష, ఇక్కడ సాయం నిరాకరించడంలో, అవసరానికి తగ్గట్టు ఇవ్వకపోవడంలోని పోకడ రాజకీయం. తమ పార్టీకి ఆదరణ లేని రాష్ట్రానికి రూపాయి విదిలించాలంటే.. వారి మనసు అంగీకరిస్తున్నట్లు లేదు.

స్వదేశంలోని ప్రజల ఆశలు, ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ, పరాయిదేశాలకు ఎగబడి సాయం అందిస్తున్న మోడీ సర్కార్ పోకడలు చూసినప్పుడు… ‘పంచదార కన్న పరదార రుచిరా’ అన్న ముళ్లపూడి వారి మొరటు మాట గుర్తుకు వస్తే తప్పేముంది! అమ్మకు అన్నం పెట్టకుండా పిన్నమ్మకు పరమాన్నం పెట్టే బాపతు నరేంద్ర మోడీ అంటే అందులో ఆక్షేపణ ఏముంటుంది? స్వదేశంలో ఆర్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బాగోగుల గురించి పట్టించుకోకుండా వెకిలి చేతలు, వెటకారపు ప్రకటనలతో రోజులు వెళ్లబుచ్చుతూ…. మోడీ నేతృత్వంలోని కేంద్రం ఎందుకిలాంటి దుర్మార్గానికి పాల్పడుతోంది? స్వదేశీ కాకుల్ని కొట్టి విదేశీ గద్దలకు పెట్టే ఇలాంటి పోకడలతో అంతర్జాతీయ యవనిక మీద కీర్తి దక్కుతుందని మోడీ అనుకుంటుండవచ్చు గాక.. ఇక్కడి ప్రజల ఆర్తారావాలు, మరచిపోలేని గుణపాఠం చెబుతాయని తెలుసుకోవాలి.

 

– కె.ఎ. మునిసురేష్ పిళ్లె