చాగంటి ప్రసాద్ కథా సంపుటి ‘పరిష్వంగం’కు ముందుమాట
కథాశాస్త్రం నాకు తెలియదు. కథల రూపసౌందర్యాలు వస్తు గుణ విశేషాలను విడివిడిగా తూకం వేసి, లక్షణ విభాగం చేసి వాటి మంచి చెడులను చర్చించగల నేర్పు అస్సలు లేదు. నాకు తెలిసినదెల్లా కథల ప్రవాహంలో కొట్టుకుపోవడం మాత్రమే. కథలను ఇష్టపడడం మాత్రమే. కథలను చదువుతూ అవి పంచగల అనుభూతి సౌందర్యాన్ని ఆస్వాదించడం మాత్రమే. అవి పొందుపరచుకున్న అనుభవసారాన్ని సంగ్రహించడం మాత్రమే.
మంచి కథను చదివినప్పుడు సమ్మోహితుడుని కావడం, పేలవమైన కథ చదివినప్పుడు చిరాకుతో కూడిన నవ్వులో మునగడం.. ఒక మోస్తరుగా ఉన్న కథ చదివినప్పుడు మరోలా ఉండి ఉంటే ఇది మహా గొప్ప కథ అయ్యేదే అని మధనపడిపోవడం అలవాటైపోయింది. నన్ను పలుమార్లు అలాంటి మోహంలో ముంచేసిన కథా సంపుటి ఇప్పుడు మీ చేతిలో ఉంది.
‘దేవుడు’ ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడనే ప్రశ్న వివేకానందుడిని తొలిచేసినట్టుగా మనందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. స్వాముల్ని ఆశ్రయిస్తాం.. పుస్తకాల్ని చదువుతుంటాం. సందేహ నివృత్తి మాత్రం జరగదు! చాగంటి ప్రసాద్, పరమహంస కంటె చాలా తేలిగ్గా దేవుడిని చూపించేస్తారు. దేవుడు తాను చూస్తున్న గుడులు, విగ్రహాల్లో ఉంటాడో లేదోనని సందేహించే మిత్రుడికి.. మూర్తికట్టి మరీ చూపిస్తాడు. నిష్కల్మషమైన ప్రేమలో, అభిమానంలో, విశ్వాసంలో, నమ్మకంలో, త్యాగంలో దేవుడున్నాడనే సత్యాన్ని బోధపరుస్తాడు.
‘మడత పెట్టిన పేజీలు’ కథ ఓ అద్భుతం. ఈ కథ చదవకపోతే కథా ప్రియులు చాలా కోల్పోయినట్టే అని నా నమ్మకం. చిన్నచూపు చూడబడుతున్న మహిళ గురించి ఎన్ని కథలు చదివి ఉంటాం? మెట్టినింట గృహిణిని చులకనగా చూడడం, లక్ష్యపెట్టకపోవడం అంశంగా ఎన్నివేల కథలు వచ్చి ఉంటాయి? అవన్నీ కూడా అలాంటి దుర్మార్గాన్ని నిరసించే ఉంటాయి. అంతిమంగా చులకన చేసిన వారిలో పరివర్తననే అవి బోధిస్తుంటాయి. ఇది కూడా అందుకు భిన్నమైన కథేమీ కాదు. కౌసల్య అంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ గౌరవం లేదు. ప్రేమ లాంటివి ఉన్నాయేమో వ్యక్తంగా- మనకు మాత్రమే కాదు, ఆమెకు కూడా కనిపించవు. ఇలా రాసుకుంటూ వెళుతున్నప్పుడు.. ఖచ్చితంగా వారిలో పరివర్తన రావడమే కథకు ముగింపు అని మనం ఊహించగలం! కానీ, ఆ కథను నడిపిన తీరు.. ఒక వేదనను వ్యక్తావ్యక్తంగా మలిచిన తీరు గొప్పగా ఉంటుంది. కుటుంబ బంధాలను పదిలంగా కాపాడుకోవడానికి, మన కుటుంబ సభ్యులకు ఇవ్వవలసిన విలువను ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకుంటూ ఉండడానికి.. ఆ దిశగా మన బుద్ధిని ఆలోచనలను ఎప్పటికప్పుడు నిర్మలీకరించుకుంటూ ఉండడానికి.. తరచుగా చదువుకుంటూ ఉండగల కథ ఇది. రచయిత ఖాతాలోని క్లాసిక్స్‌లో ఒకటిగా నిలవదగిన కథ!
‘అద్దం నవ్వింది’లో ఒక విలక్షణమైన మాధవి మనకు పరిచయం అవుతుంది. సాధారణ పాత్రల్లాగా పరిచయమై అసాధారణంగా కథను ముందుకు తీసుకువెళుతుంది. నమ్మిన విలువల నుంచి పక్కకు తప్పుకునే, ఒక మెట్టు దిగజారే సందర్భం జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురు కావొచ్చు. అలాంటి సందర్భాల్లో వారిని తిరిగి దారిలోకి తెచ్చే ఒక శక్తి ఉండాలి. మామూలుగా ఈ పని దేవుడు చేయాలి. తత్సములైన ఆత్మీయులు చేయాలి. దైవం కళత్ర రూపేణా అని చెప్పదలచుకున్నట్టుగా ఈ కథ సాగుతుంది.
చాగంటి ప్రసాద్ మధ్యతరగతి రచయిత. మధ్యతరగతిని ప్రేమించే రచయిత. మధ్యతరగతి జీవితాలలో ఉండే సమస్త ఈతిబాధలను లోతుగా పరిశీలించిన రచయిత. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే సకల అనుబంధాల సంక్లిష్టతలను ఆకళించుకున్న రచయిత. మన బతుకుల్లోని వైచిత్రులు, వైరుధ్యాలు అన్నీ ఆయన కథల్లో మనకు పుష్కలంగా కనిపిస్తాయి. కుటుంబ బంధాల పట్ల అనిర్వచనీయమైన గౌరవం ఉన్న ఈ రచయిత.. తాను ఎరిగిన బంధాల రూపాలను ఆదర్శాలుగా కథలలో ప్రతిష్ఠించడానికి, తద్భవమైన ఆలోచనను పాఠకులలో పాదుగొల్పడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు.
వర్తమానాన్ని చూసుకుని, ఏ సమాజంలో అయితే కుటుంబ వ్యవస్థలోని విలువలు పలుచన అవుతున్నాయని, తండ్రీ కొడుకుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని మనం తరచూ మధనపడుతూ ఉంటామో ఆ సమాజానికి ఎంతో అవసరమైన వివేక చింతనతో కూడిన కథలు ఇందులో ఉన్నాయి. ప్రత్యేకించి తండ్రీ కొడుకుల అనుబంధం చుట్టూ పరిభ్రమించేవే కొన్ని కథలు కాగా, ప్రధాన కథాంశం ఏదైనప్పటికీ కూడా- ‘తండ్రీ కొడుకుల అనుబంధం’ ఆ అంశాన్ని నడిపిన ఒక సూత్రంగా లేదా, కథాగమనంలో ఒక భాగంగా అమరినవి మరికొన్ని.
భ్రమణ జీవి అయిన చాగంటి ప్రసాద్ విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉంటారు. ఆ పర్యటనల్లో తనకు తారసిల్లిన ప్రతి వైవిధ్యానికీ కథల్లో చోటు కల్పించడానికి ప్రయత్నించారు. అది మనకు స్పష్టంగా తెలిసివస్తుంది. భిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకోవడం కథకు ఖచ్చితంగా బలం అవుతుంది. కోనసీమ ప్రాంతాల అందాల్లో, సర్పవరం పూలతోటల్లో విహరింపజేస్తూనే.. హఠాత్తుగా ఆయన మిమ్మల్ని రాజస్తాన్ తీసుకువెళ్లి.. అక్కడి పుష్కర్ క్షేత్రాన్ని సాకల్యంగా దర్శింపజేస్తారంటే అతిశయం కాదు. ‘ఎడారినావ’ అలాంటి ప్రయత్నమే. అలాగే ఆశావహ దృక్పథానికి చాగంటి ప్రసాద్ కథలు ఒక ప్రతీక! ‘ఐడియా టేబుల్’ ఎంతో స్ఫూర్తిదాయకమైన కథ. నైరాశ్యంలో మునిగిపోయే యువతరంతో పాఠంలాగా చదివించవలసిన కథ. ‘మిస్సమ్మ’లో ఎన్టీరామారావుతో ఎల్వీ ప్రసాద్ అనిపించినట్టు.. ‘ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుందనే’ జీవన సిద్ధాంతానికి ఈ కథ నవతరం ఉదాహరణ. చదువు అబ్బలేదనే నైరాశ్యంలో కూరుకుపోకుండా.. నిలకడగా ఒక పనిని నమ్ముకోవడంలో, అందులో కొంత సృజనను జోడించడంతో ఎంత ఎత్తులకు ఎదగవచ్చునో ‘అబ్బులుగారి కొబ్బరి తోట’ చెబుతుంది.
మీరు స్వయంగా పొందగల అనుభూతులకు అడ్డుపడుతూ ప్రతి కథనూ పరామర్శించడం నా లక్ష్యం కాదు. అందుకని ఈ కథల్లోంచి నా స్మృతులను తిరగతోడుకోవడాన్ని ఇక్కడితో ఆపుతాను.
ఢిల్లీ నుంచి వచ్చిన వర్తకుడు షుకురల్లీ ఖాను, వేసారి, విసిరికొట్టగా సీసా బద్ధలై తడిచిన పెద్దాపురం కోటగోడలు ఇప్పటికీ గులాబీ అత్తరు పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయని అంటారు శ్రీపాద వారు. సర్పవరం పూలతోటల సోయగాన్ని, వైవిధ్యభరితమైన సుగంధాలను పులుముకున్న కథలు చాగంటి ప్రసాద్ వి. ఈ కథలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన పరిమళంలో మిమ్మల్ని ముంచుతాయి. అన్నీ కూడా పరస్పర భిన్నమైన అందమైన పరిమళాలు. అన్ని రకాల గుమ్మెక్కించే అత్తరుల మాదిరిగానే కొన్ని కథలు మట్టి పరిమళాన్నీ, చెమట సుగంధాన్నీ కూడా మీకు తెలియజెప్తాయి. మీ చేతిలో ఉన్న ఈ కథల గుత్తు- ఒక అత్తరు సీసా! మీరెరిగిన ఏ అత్తరు సీసా అయినా ఒకే రకం పరిమళాన్ని అందిస్తుంది. ఇది సర్పవరం పూలతోటల నుంచి పుట్టిన ప్రత్యేకమైన అత్తరు సీసా! ఇంద్రజాల మహేంద్రజాలం నేర్చిన అత్తరు పరిమళాలు యివి. కథను బట్టి, చదువుతున్న వేళ మీ మనఃస్థితిని బట్టి.. మిమ్ములను రకరకాల పరిమళాలలో తేలియాడజేస్తాయి.
రచయితను వృత్తిగత జీవితం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని నేను నమ్ముతాను. మధురాంతకం రాజారాం గారి కథలను చదువుతున్నప్పుడు.. టీచరుగా ఉద్యోగంలో స్థిరపడి ఉంటే ఎంత బాగుండేదో కదా.. ఇన్ని వందల జీవితాలను, గ్రామాలను దగ్గరినుంచి పరిశీలించి, మధించి.. కథగా రూపుకట్టే భాగ్యం దక్కేది కదా అని అసూయ పుడుతుంది. బ్యాంకు ఉద్యోగం కూడా అందుకు భిన్నమైనది కాదు. పేద, మధ్యతరగతి మాత్రమే కాదు, సంపన్న వర్గాల్లో ఉండగల వైచిత్రులన్నీ కూడా వీరికి అనుభవంలోకి వస్తుంటాయి. ఆ అనుభవ సారం ఆయన కథల్లో మనకు కనిపిస్తుంది. వేలకొలది జీవితాలను, అందులోని ఎత్తుపల్లాలను, ఈతిబాధలను దగ్గరినుంచి గమనించగల బ్యాంకు ఉద్యోగాన్ని పరిపూర్ణంగా నిర్వహించిన ఆయన ఎన్నింటికి అక్షరరూపం ఇచ్చారో తెలియదు. కానీ కథల్లో కనిపించే జీవితపు లోతులు అంత ఆషామాషీగా ఊహల్లోంచి పుట్టినవి కాదనే సత్యం బోధపడుతుంది.
చాగంటి ప్రసాద్ ఒక క్రమపద్ధతిలో తనను తాను ఉన్నతీకరించుకుంటున్న మంచి రచయిత. ఉత్తమ శ్రేణికి చెందిన రచయితగా ఆవిష్కరింప చేసుకోవడానికి, తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన ప్రయత్నంలో ఆయన ఉన్నారు. క్లాసిక్స్ గా నిలబడ గల కథలను అందించి శిఖరాలపై సగర్వంగా నిల్చుకునేందుకు తగిన విధంగా ఆయన సోపానాలను నిర్మించుకుంటున్నారు. ఆయన ప్రయత్నానికి మనందరం ప్రోత్సాహం అందించాలి. ఆయన కథలను చదవడం, అందులోని బాధానందాలను అనుభూతించడం.. ఆ స్పందనలను ఆయనకు తెలియజేయడమే మన విధి. కథా ప్రియులుగా కర్తవ్యం కూడా. నిజానికి చాగంటి ప్రసాద్ కథలపొదిలో దాచిన అస్త్రాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి మీకు కితకితలు పెడతాయి. నవ్విస్తాయి. హాయిగొలుపుతాయి. మరో ప్రయత్నంగా అవి మీ ముందుకు వస్తాయి.
చాగంటి ప్రసాద్ వరుసకు నాకు అన్నయ్య అవుతారు. అటువంటి అవినా‘బావ’ సంబంధం ఒకటి మా మధ్య ఉన్నది. ఆ ఆత్మీయతతోనే.. నాకు ముందుగా నాలుగు మాటలు చెప్పవలసిన పనిని అప్పగించారు తప్ప, మరో రకమైన అర్హత ఉందనుకోను. అన్నయ్య కథల్ని అనుభూతిస్తూ దానిని మీతో పంచుకునే ప్రయత్నంలో అతిశయంగా చెప్పానని అనిపిస్తే, అది మా అనుబంధం వల్ల అని మాత్రం అనుకోకండి. అలాగని.. ఏవైనా కథల పట్ల అసంతృప్తిని ప్రకటించి ఉంటే, విస్మరించి ఉంటే అది నా అజ్ఞానచిహ్నంగా మన్నించండి.
ఇక అన్నయ్య సృజించిన ఈ చిన్ని కథల ప్రపంచంలోకి కాలు పెట్టండి. అక్కడక్కడా మీలో కొత్త ఆలోచన పుడుతుంది.. గుండె చిక్కబడుతుంది.. తడి అవుతుంది.. ఆ తడి ఉబుకుతుంది.. కనులు చెలమలు అవుతాయి.. ఏ ఉద్వేగాన్నీ తొక్కిపెట్టకండి. స్వేచ్ఛగా మీలోంచి బయటకు వ్యక్తం కానివ్వండి. మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేయనివ్వండి. మీ ఉద్వేగాలు, స్పందనలే అన్నయ్య సృజనకు సార్థకత!
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె