గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత

43

హైదరాబాదు మణికొండలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం

(కార్యక్రమం ఏర్పాటుచేసిన ప్రభోదిత స్వచ్ఛంద సంస్థ సారథి శ్రీమతి జయభారతి గారికి, ప్రధానోపాధ్యాయులు నాగార్జున గారికి కృతజ్ఞతలు)

గ్రంథాలయాలు అంటే  మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని పుస్తకాలను ఒక చోట చేరిస్తే దాన్ని లైబ్రరీ అంటాం. గ్రంథాలయం అంటే గ్రంథాలన్నీ ఉండే ఒక ప్రదేశం. కాబట్టి, గ్రంథాలయాల గురించి చెప్పడానికంటె ముందు.. పుస్తకం గురించి చెప్పాలి.

పుస్తకాన్ని మనం కొద్దిగా బరువైన భాషలో గ్రంథం అంటాం.. గ్రంథి అంటే ముడి… పూర్వకాలంలో తాటాకుల మీద రాసేవాళ్లు కాబట్టి.. అలా కొన్ని ఆకుల మీద రాసినవన్నీ కలిపి తాడుతో ముడివేసి కట్టేవాళ్లు. ముడి వేస్తారు కాబట్టి అది గ్రంథం అయింది. రోజులు మారే కొద్దీ తాటాకులు పోయాయి.. కట్టే తాడు పోయింది.. మధ్యలో రాగిరేకుల్లాంటి రకరకాల పదార్థాలు వచ్చాయి.. చివరగా ఇప్పుడు మనం వాడుతున్న పేపరు వచ్చింది. పుస్తకం పేపర్ ద్వారా ఇప్పుడు మనం వాడుతున్నాం. కానీ.. పుస్తకానికి గ్రంథం అనే పేరుమాత్రం అలాగే ఉండిపోయింది. పుస్తకాలన్నీ ఉండే ప్రదేశానికి గ్రంథాలయం అనే పేరు కూడా అలాగే ఉండిపోయింది. కాగితం మీద నుంచి కూడా గ్రంథం దాని రూపు మార్చుకుంటూ ఉంది.

BOOK

B          Best                              ఉత్తమమైన

O          Origin of                       మూలం

O          Organized                     ఒక పద్ధతి ప్రకారం

K          Knowledge                    జ్ఞానం

Best origin of  Organized knowledge

ఒక పద్ధతి ప్రకారం అమరిన జ్ఞానానికి అత్యుత్తమమైన మూలం.. పుస్తకం

పుస్తకం అంటే జ్ఞానం

పుస్తకం అంటే నేర్చుకోవడం

పనిచేయడం అనేది ఇవాళే మన జీవితానికి ఆఖరు అనే తరహాలో పనిచేయాలి.. నేర్చుకోవడం అనేది.. మనం ఎప్పటికీ జీవించే ఉంటాం.. అనేంత శ్రద్ధగా నేర్చుకోవాలి… ఇది మహాత్మాగాంధీ చెప్పిన మాట.

మనం నేర్చుకునే ప్రతి విషయాన్నీ అంత శ్రద్ధగా నేర్చుకోవాలి.

పుస్తకం లేని రోజుల్లో నేర్చుకోవడం ఎలా జరిగింది? వల్లె వేయడం అంటారు. అంటే చెప్పిందే చెప్పడం. ఒక విషయాన్ని కొన్ని వందలసార్లు చెప్పించేవాళ్లు. అది ఇక జీవితమంతా గుర్తుండిపోయేది. ఆ రకంగా ఒక విషయం నేర్చుకున్న తరువాత మరొక విషయానికి వెళ్లేవాళ్లు. అలా ఒక జీవితకాలంలో పరిమితంగా కొన్ని సంగతులు మాత్రమే నేర్చుకునేవాళ్లు.

వల్లె వేయడం అంటే పునశ్చరణ. మళ్లీ మళ్లీ చూసుకుంటూ ఉంటే.. మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ ఉంటే విషయం మనకు బాగా అర్థమవుతుంది. అలా మళ్లీ మళ్లీ పునశ్చరణ చేయడానికి పుస్తకం మనకు అద్భుతంగా ఉపయోగపడడం మొదలైంది.

ఇప్పుడు పుస్తకాల గురించి మరో సంగతి చెప్పుకుందాం…

మనదేశంలో ప్రపంచం గర్వించదగిన శాస్త్రవేత్తలు ఉన్నారు. అంకెల్లో 0 ను కనిపెట్టిందే మన భారతీయులు. అలాంటి అద్భుతమైన శాస్త్రవేత్తల్లో జగదీష్ చంద్రబోస్ అనే పెద్దాయన ఒకరున్నారు. ఆయన చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని చెప్పాడు. ప్రాణం ఉంటేనే చెట్టు లేకపోతే అది కర్ర కదా.. అనుకోవచ్చు మీరు. కానీ.. చెట్లు స్పందిస్తాయని.. తమ పరిసరాలను కూడా గుర్తిస్తాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించాడు. చెట్లకు హృదయం ఉంటుంది.. ఆలోచిస్తాయి.. అనే పదం మాత్రమే ఆయన చెప్పలేదు. అంతకంటె ఎక్కువగానే చెట్లు స్పందిస్తాయని అన్నారు.

నా దృష్టిలో పుస్తకానికి మనసుంటుంది. పుస్తకాన్ని మీరు ప్రేమించండి.. మీ ప్రేమకు అది స్పందిస్తుంది. మీరు ఎలాంటి మూడ్ లో ఉండి చదివితే.. పుస్తకం అదే రకంగా మీకు అర్థమవుతుంది. మీరు చదవడానికి కూర్చునేప్పుడు.. పుస్తకాన్ని ఇష్టంగా చేతిలోకి తీసుకోండి. పుస్తకాన్ని హింసించవద్దండి.. మధ్యలో కాగితాలు మడవడం, పేజీలు చించడం వంటివి చేయొద్దు. పుస్తకం మీద మీకు ప్రేమలేదని అర్థం.

మనం ప్రేమగా చూస్తే పుస్తకం కూడా ప్రేమగానే స్పందిస్తుంది. తమాషాగా అనిపిస్తుంది గానీ.. సైకాలజీ ప్రకారం ఇది నిజం. పుస్తకాలకు శుభ్రంగా అట్టలు వేసుకోండి. అవిచిరిగిపోతే మళ్లీ అట్టలు వేసుకోండి. పుస్తకంలోని కాగితాలు నలిపేయకుండా.. పిచ్చి గీతలు గీయకుండా.. శుభ్రంగా ఉంచుకోండి. పుస్తకాన్ని చేతిలోకి అందుకుంటున్నప్పుడే.. దాన్ని జాగ్రత్తగా ఇష్టంగా అందుకోవడం అనేది ప్రాక్టీసుతోనైనా అలవాటు చేసుకోండి. కొంతకాలం పుస్తకం అందుకునేప్పుడే శ్రద్ధగా ఉండడం ప్రాక్టీసు చేస్తే.. కొంతకాలానికి పుస్తకం అందుకుంటూ ఉండగానే.. ఆటోమేటిగ్గా శ్రద్ధ మీలో ప్రవేశిస్తుంది. అలాంటి అలవాటు వస్తుంది. శ్రద్ధగా ఉన్నప్పుడు మాత్రమే.. ఆ పుస్తకం మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే చదివేది మనకు బుర్రలోకి ఎక్కుతుంది.

చిన్న ఉదాహరణ చెబుతా.. మనకు సైకిలు ఉందనుకోండి. దాని మీద ఇష్టంగా రోజు శుభ్రంగా తుడిచి అప్పుడప్పుడూ ఆయిల్ వేస్తూ ఉంటే.. బాగా నడుస్తుంది. ఇబ్బంది పెట్టకుండా వెళుతుంది. దాన్ని నిర్లక్ష్యంగా చూస్తూ.. ఎప్పుడూ తుడవకుండా అలా వాడితే.. కొన్నాళ్లకు నడవడానికి మొరాయిస్తుంది. ప్రాణంలేని వస్తువులైనా సరే.. మనం ప్రేమగా వాడుకున్నప్పుడే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది.

పుస్తకం మీకు ఒక మంచి ఫ్రెండ్ తో సమానం.

ఫ్రెండ్స్ మీకు ఎలా ఉపయోగపడతారంటే మీ ముచ్చట్లన్నీ వాళ్లతో చెప్పుకుంటారు. మీకు అవసరం వచ్చినప్పుడు ఫ్రెండ్ సహాయం చేస్తుంటాడు. ఫ్రెండ్షిప్ కు డెఫినిషన్ ఇదే అనుకుంటే గనుక.. పుస్తకం నిజంగానే మీకు చాలా మంచి ఫ్రెండ్ అవుతుంది.

మీకు సంతోషం కలిగింది.. పుస్తకంతో చెప్పుకోండి…

మీకు కష్టం కలిగింది.. పుస్తకంతో చెప్పుకోండి…

మీ ఫ్రెండ్సయినా సరే.. మీరు చెప్పుకున్న సంగతుల్లో కొన్ని మర్చిపోవచ్చు. కానీ పుస్తకం మర్చిపోదు. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే.. ఎప్పుడైనా ఆ పుస్తకంలో పేజీలు తిప్పండి… మీ సంతోషాలన్నీ గుర్తువస్తాయి. మీరు మరింత ఉత్సాహంగా తయారవుతారు. మీ కష్టాలన్నీ కూడా గుర్తుకు వస్తాయి. మీరు మరింత జాగ్రత్తగా తయారవుతారు. ఆ విధంగా పుస్తకం మీకు మేలు చేస్తుంది.

సొంత గ్రంథాలయాలు అవసరం.. బయటి గ్రంథాలయాలూ అవసరం

ఇంట్లో పుస్తకాలుంటే.. ఆ లైబ్రరీ మనకు సరిపోతుందని ఎప్పటికీ అనుకోవద్దు. మీ నాలెడ్జి మరింత పెరగాలంటే.. మీ వద్ద లేని పుస్తకాలు కూడా చదవాలి. బయటి గ్రంథాలయాలకు వెళ్లడం కూడా అలవాటు చేసుకోవాలి.

విద్యార్థులు కాబట్టి.. మీకు పరిమితమైన గ్రంథాలయం సరిపోతుంది. మీ ప్రపంచం మొత్తం చదువుతోనే నిండి ఉంటుంది. చదువుకు సంబంధించిన గ్రంథాలయం ఉంటే మీకు చాలు. మీ చదువులకు సంబంధించిన చిన్న గ్రంథాలయం మీరే తయారు చేసుకోండి. సాధారణంగా పుస్తకాలకు సంబంధించి ఒక హెచ్చరిక ఉంటుంది. పుస్తకాన్ని ఎవరికైనా ఇస్తే.. ఇక అంతే అది తిరిగి రాదు. పోయినట్లే అని ఒక సామెత ఉంటుంది.

నా దృష్టిలో విద్యార్థులకు సంబంధించినంత వరకు ఈ సిద్ధాంతం పనికి రాదు. మీ క్లాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరిదగ్గర ఉంటాయి. కానీ చదువులకు సంబంధించి extra information, extra knowledge ఇచ్చే పుస్తకాలు మీకు వీలైతే సంపాదించండి. మీది గొప్ప లైబ్రరీ అవుతుంది. మీ దగ్గర ఉంటే మీ ఫ్రెండ్స్ తో కూడా పంచుకోండి. మీరు చదవండి.. వాళ్లను కూడా చదవమని చెప్పండి. ఇదేదో మీరు ఫ్రెండ్స్ కు ఫేవర్ చేసినట్లు భావించొద్దు.

చదివిన విషయాలను ఫ్రెండ్స్ తో చర్చించండి. డిస్కస్ చేస్తేనే.. మీకు అర్థమైన సంగతులు కొన్ని వాళ్లకు బోధపడుతాయి.. వాళ్లకు అర్థమైన కొత్త సంగతులు  కొన్ని మీకు కూడా తెలుస్తాయి. మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది.

కొత్తతరంలో డిజిటల్ లైబ్రరీలు

ఇప్పుడు తరం మారుతోంది. లైబ్రరీలు కూడా రూపం మార్చుకుంటున్నాయి. పుస్తకాల అల్మేరాల స్థానాన్ని బాధ్యతను కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు తీసుకుంటున్నాయి. డిజిటల్ ఫైల్స్ గా పుస్తకాలు మారుతున్నాయి. ఆమెజాన్, ఇంకా అలాంటి కొన్ని వెబ్ సైట్స్ లో డిజిటల్ పుస్తకాలు, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి దొరుకుతున్నాయి.

మీకోసం మీ అభిరుచికి టేస్టుకు తగినట్లుగా ఒక లైబ్రరీని తయారు చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎంతమాత్రమూ కాదు. ఇవాళ జ్ఞానం మనకు విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. మనం ఎంత స్వీకరించగలిగితే అంత మనకు లభిస్తుంది.

మనకు ఎంత శక్తి ఉంటే అంత తవ్వుకోవచ్చు. ఎంత ఆసక్తి ఉంటే అంతగా నేర్చుకోవచ్చు.

డిజిటల్ పాఠాలు.. పాఠాలు.. ఆడియో రూపంలో వీడియో రూపంలో కూడా తయారవుతున్నాయి. ఆడియో బుక్స్ వస్తున్నాయి. వీడియో బుక్స్ కూడా వస్తున్నాయి. మీరు నేర్చుకోదలచుకుంటే.. ఎంతైనా సరే మీకు నేర్పడానికి ఇవాళ సాంకేతికవిప్లవం మొత్తం ఎంతో సిద్ధంగా ఉంది. టెక్నాలజీ డెవలప్‌మెంట్ మొత్తం మీరు నేర్చుకోడానికి అండగా నిలుస్తుంది.

ప్రత్యేకించి.. హైస్కూలు విద్యార్థులకు ఒక చిన్న సూచన

8వ తరగతి నుంచి.. మీరు చదువుతున్న సబ్జెక్టు పుస్తకాలను క్లాసు పాసు కాగానే పారేయొద్దు. తూకానికి అమ్మవద్దు. అవి దాచి ఉంచుకోండి. విద్యార్థిజీవితం పూర్తయ్యే వరకు, అంటే మీచదువులు పూర్తిగా పూర్తయ్యే వరకు, మీరు ఉద్యోగ జీవితాల్లోకి ప్రవేశించే వరకు.. వాటిని దాచుకోండి. మీరు ఇంటర్మీడియట్ తర్వాత.. ఇంజినీరింగ్, డాక్టరు చేయడానికి ఎంసెట్ లేదా నీట్ రాసినా… అవి రెండూ వద్దనుకుని డిగ్రీ తర్వాత గ్రూపు పరీక్షలు, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసినా.. ఆ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి బేసిక్ నాలెడ్జి చాలా ముఖ్యం. ఆ వయసులో అలాంటి ఉన్నతమైన ఉద్యోగాలకు అవసరమైన పునాది లాంటి జ్ఞానం.. మీ హైస్కూలు పుస్తకాల్లోనే ఉంటుంది. పునాదులు భద్రంగా ఉంటే.. భవంతి కూడా ఎప్పటికీ బాగుంటుంరది. ఈ పుస్తకాలను అప్పుడప్పుడూ మీరు చూసుకుంటూ ఉంటే.. మీరు పెద్ద తరగతుల్లో కొత్తగా నేర్చుకునే జ్ఞానం పునాదులు అందులో మీకు కనిపిస్తాయి. నేర్చుకోవడం మీకు ఇంకాస్త సులువు అవుతుంది.

ఒక్క అంశం చెప్పి ముగిస్తాను…

క్లాసు పుస్తకాలు కాకుండా.. ఇతరత్రా వేరే పుస్తకాలు.. ఏదో ఒక పుస్తకం డైలీ పేపరు కాకుండా పుస్తకంగా ఇతర పుస్తకాలు చదివిన వాళ్లు ఎందరు చేతులు ఎత్తండి.

ఇతర పుస్తకాలు చదవాలి. తరగతి పుస్తకాలు కూడా చదవాలి. విద్యార్థులకు గ్రంథాలయాల అవసరం ఎంతో చెప్పడమే ఇవాళ్టి మన ఉద్దేశం గనుక.. నేను అంతవరకే  పరిమితం అవుతున్నాను. చదువులకు సంబంధించిన గ్రంథాలయం. మీ జ్ఞానాన్ని పెంచుతుంది. అలాగే ఇతరత్రా పుస్తకాలన్ని చదవడం మీ అభిరుచుల్ని పెంచుతుంది. మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది.

ఆల్ ది బెస్ట్