రోహిణి వంజారి కథాసంపుటి ‘నల్లసూరీడు’కు ముందుమాట
ఒక రచయిత రాసే కథలోని బాధానందాలు, కష్టసుఖాలు, మానవీయ అనుభూతులు సమస్తం, ప్రతి సందర్భంలోనూ వారి స్వీయ అనుభవాలు అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ, కనీసం దృశ్యంగా, శ్రవణంగానైనా వాటిని ఎరిగి ఉండాలి. అంతే తప్ప.. ఊహల్లో ఒక అనుభూతికి రెసిపీ సిద్ధం చేసి, తద్భవమైన వంటకాన్ని పాఠకులకు వడ్డిస్తే అంతకు మించిన నేరం మరొకటి ఉండదు. కథలోని ప్రతి భావస్పందన రచయితకు తెలిసి ఉండాలి. ఊహ అత్యంత పరిమితంగా ఉండాలి. తెలియవలసిన వాటిని కనీసం ఇతరులనుంచి విని ఉండాలి. కథద్వారా తెలియజేయవలసిన వాటిని స్వయంగా అనుభూతించి, ఎరిగి ఉండాలి. జీవితాలను, ఈతిబాధలను స్పష్టంగా చిత్రిక పడితే చాలా మంచిది.
వీటిని మించి కథలోని సమస్త భావావేశాలు, స్పందనలు అన్నీ కూడా రచయిత సొంత జీవితంలోనివి అయితే.. అంతకంటె గొప్పగా కథకు న్యాయం జరుగుతుందని అనుకోలేం. ఎలాంటి కల్తీగానీ, ప్రసార నష్టాలు గానీ, ఊహల దేవులాట గానీ లేని తుల్యమైన రూపంలో అవి పాఠకుడికి అందుతాయి. వాటిలో స్వచ్ఛత ఉంటుంది. అలాంటి కథలు పుట్టాలంటే.. రచయిత జీవితంలో ఎత్తుపల్లాలు, చీకటివెలుగులు, మలుపులు ఉండాలి. ఈ భావన ప్రకారం చూసినప్పుడు.. కొన్ని పదుల, బహుశా వందల కథలకు ముడిసరుకు కాగల భిన్నపార్శ్వాల జీవితానుభవాలు- వంజారి రోహిణి సొంతం. అందుకే ఆమె ఇలాంటి కల్తీలేని, స్వచ్ఛమైన కథలు రాయగలిగారు.
‘నల్లసూరీడు’.. సువిస్తారమైన ఆమె రచనాప్రస్థానంలో ఎంపికచేసిన కథల సంపుటి. ఇందులో ఆమె అధివాస్తవికమైన వస్తువులను ఎంచుకోలేదు. మనందరి బతుకుల్లో ఉండే బాధానందాలు, మనందరి జీవన గమనాలలోని ఎగుడుదిగుడులు, మనందరి పతనాలను నిర్దేశిస్తుండే ఈసునసూయలు, మనందరి వ్యక్తిత్వాలను లుప్తంచేసే కోపతాపాలూ, మనందరి కళ్లూ ఎరిగిన కన్నీళ్లు, వాటిని తుడుచుకోవడానికి మనందరి గుండెలూ నేర్వదగిన ధైర్యస్థైర్యాలూ ఆమె కథావస్తువులు!
కథలో చెబుతున్న అంశం బలమైనది అయినప్పుడు.. కథన సౌందర్యానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. ఆ మార్గాన్ని ఆమె ఆశ్రయించలేదు. తానెరిగిన జీవన విలువలను, తానెరిగిన మనుషులను అలా స్వచ్ఛంగా కథలలో చెప్పుకుంటూ పోయారు. ఆ స్వచ్ఛతకు ప్రతీకలుగానే కథలు తయారయ్యాయి.
ఏదైనా సరే ఒక సృజనాత్మక ప్రక్రియను ప్రధానంగా రెండు రకాలుగా పెద్దలు వర్గీకరించారు. శుద్ధ కళావాదం, నైతిక కళావాదం అనే రెండు రకాలు. ఈ రెండింటి మధ్య ఒక గొప్ప వ్యత్యాసం ఉంది. నైతిక కళావాదం అంటే ఆ కళారూపంలో విలువల ప్రకటన ఎలా సాగుతున్నది? ఆ కళారూపం ద్వారా వ్యక్తమవుతున్న నీతి ఏమిటి? అనే విషయాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. అదేసమయంలో, శుద్ధ కళావాదం విషయానికి వస్తే.. అది పూర్తిగా ఆ కళా సృజనలోని కౌశలాన్ని గమనిస్తుందే తప్ప అది తెలియజేసే నీతిని గురించి గానీ, విలువల గురించి గానీ పట్టించుకోదు.
ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక చిత్రకారుడు ఒక శృంగార సన్నివేశాన్ని తైలవర్ణచిత్రంగా చిత్రీకరిస్తే అందులో శృంగారం పాళ్లు శృతి మించి జుగుప్స చోటుచేసుకున్నదని అనుకుందాం. నైతిక కళావాదికి అది వెగటు పుట్టిస్తుంది. నీచంగా అనిపిస్తుంది. అసహ్యించుకుంటాడు. కానీ.. శుద్ధ కళావాది అలా కాదు. ఆ చిత్రంలోని సౌందర్యం తప్ప అందులో ఉన్న బూతు అతని కళ్ళకు కనపడదు. ఆ చిత్రం గీయడంలో టెక్నిక్ ఎలా ఉంది. వర్ణాల మేళవింపు ఎలా ఉంది? చిత్రకారుడి పరిణిత కౌశల విన్యాసాలు ఎలా ఉన్నాయి.. అనేది మాత్రమే గమనిస్తాడు.
కథలకు కూడా ఈ వర్గీకరణ వర్తిస్తుంది. శుద్ధకథావాదం, నైతిక కథా వాదం అని రెండు రకాలుగా మనం వీటిని వర్గీకరించుకోవాలి. రోహిణి రాసిన కథలన్నీ నైతిక కథా వాద నిర్వచనానికి లోబడేవి. సమాజానికి ఒక మంచి విషయాన్ని, నీతిని, నియమాన్ని, సకారాత్మకతను తన ప్రతి కథ ద్వారా తెలియజేయాలనే బృహత్ ప్రయత్నం కనిపిస్తుంది.
వంజారి రోహిణి ఇప్పటిదాకా సుమారు 70 కథలు రాశారు. ఎంపిక చేసిన 21 కథలను ఈ సంపుటిగా తెస్తున్నారు. రచయిత్రి కథన కౌశలం గురించి మచ్చుకు ఒక్క కథను మాత్రం ప్రస్తావిస్తాను.
వయసు మళ్లిన ఒక పెన్షనరుకు ఒకటో తేదీ రాగానే.. బ్యాంకుకు వెళ్లాలనేది చాలా పెద్ద కోరిక. ఒకటోతేదీన పెన్షను వస్తుందనేది నిజమే కానీ, పెన్షను తీసుకోడానికి ఏటీఎం అందుబాటులోకి వచ్చినా.. బ్యాంకుకు వెళ్లాలనేదే ఆయన బలమైన కోరిక. అసలు తాను నెలపొడవునా 30 రోజులు బతుకుతున్నదెల్లా.. ఒకటో తేదీకోసమే, అనగా బ్యాంకుకు వెళ్లడం కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తుంటాడు.
కథలో ఈ నేపథ్యాన్ని పాదుగొల్పిన తర్వాత.. ఇక పాఠకుడితో ఎన్ని రకాలుగా అయినా రచయిత ఆడుకోవచ్చు. అసలే ఓటీటీ ప్రపంచంలో వెటరన్ ప్రేమలు రంజింపజేస్తున్న రోజుల్లో ఆ బ్యాంకులో సదరు వృద్ధుడికి ఓ సరికొత్త ప్రేమబంధాన్ని ముడిపెట్టవచ్చు. క్రైం థ్రిల్లర్ సినిమాల రేటింగ్స్ బీభత్సంగా ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఒకటోతేదీ బ్యాంకుకు వెళ్లే ముచ్చటతో ఓ నేరప్రపంచాన్ని నిర్మించవచ్చు… ఇలా ఎన్నయినా చేయవచ్చు. కానీ ఈ కథలో ఆ ‘నాన్న కోరిక’ను దేనితో ముడిపెట్టారనేది ఖచ్చితంగా పాఠకుడిని చకితుణ్ని చేస్తుంది. ఇలాంటి కథా సంవిధానంలోనే రచయిత్రి యొక్క అంతఃచైతన్యాలు, వారి వ్యక్తిత్వంలోని నైతిక సంస్కారాలు మనకు వ్యక్తమవుతాయి.
ఆధునికత లేదా సాంకేతికత లేదా వేగమయం అవుతున్న జీవితాలు.. ఆత్మవంచనకోసం మనం ఆశ్రయించే ముసుగులు ఏమైనా కావొచ్చు. మన జీవితాల చుట్టూతా మనం గిరి గీసేసుకుంటూ, ఆ పరిధిని కూడా రోజురోజుకూ కుంచింపజేసేసుకుంటూ మనిషి పొడ ఎరగకుండానే బతుకుతున్నమాట వాస్తవం. నాలుగ్గోడల మధ్య మన బతుకుల్ని మనమే బందీగా మార్చేసుకుని జీవిస్తున్నమాట వాస్తవం. ఇలాంటి బతుకులకు చెంపపెట్టు ఈ కథ. నిష్కల్మషమూ, నిస్వార్థమూ అయిన మానవ సంబంధాల కోసం ఒక వృద్ధుడి పరితాపం ఈ కథ. నైతిక కథావాదానికి పెద్దపీట వేసే కథ ఇది.
ఒక రచయిత నైతిక సృజనలో నిమగ్నమవుతారా? శుద్ధ కథావాదానికి పరిమితమవుతారా? అనేది వారి అంతరంగ చైతన్యాన్ని బట్టి ఉంటుంది. రోహిణి కథలను మనం గమనిస్తే ఆమె పూర్తిగా నైతిక కథావాది అనే సంగతి అర్థం అవుతుంది. అందుకే ఇవాళ్టి సమాజం దారితప్పుతున్నదని ఒప్పుకునేవారికి ఈ కథలు మళ్ళీ మళ్ళీ అవసరం అవుతాయి. ఆమె కలం నుంచి మరిన్ని కథలు రావాలి. సమాజంలోని మనుషుల ఆలోచనలకు పట్టే పంకిలాన్ని ఎప్పటికప్పుడు కడిగివేయడంలో, సమాజంలో నైతికతను ప్రతిష్ఠించడంలో అవి తమ వంతు పాత్ర పోషిస్తూ ఉండాలి.
రచన కూడా ఒక రకం సేద్యమే. విత్తనాలుగా చేతికి వచ్చిన వాటిని వెదజల్లేస్తే అది పంట అయిపోదు. ఆ విత్తనాలను జాగ్రత్తగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. పొలాన్ని కూడా అనువుగా తీర్చవలసి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎంత పద్ధతిగా, సరిగా జరిగితే దిగుబడి కూడా అంత ఫలవంతంగా ఉంటుంది.
రచయిత- తన రచనల ద్వారా అనుభూతులను, అనుభవాలను, భావోద్వేగాలను, జీవన విచిత్రాలను జనమూహంలో విత్తాలి. విత్తిన మరుక్షణం పంట చేతికి అందిరాదు. అలా విత్తిన వాటిలో కొన్ని మొలకెత్తకుండానే మురిగిపోయినట్లు ఆ కథలు కొందరు పాఠకుల్లో మొలకెత్తకపోవచ్చు. కానీ మిగిలిన వారిలో మొలకెత్తి ఎదిగి వెన్ను తొడిగి పంట పండుతాయి. వారి ఆలోచనల్లో మార్పును తీసుకు వస్తాయి. వారి ఉద్వేగాల్లో వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తాయి. అలా చేయగలిగితే ఆ రచనకు సార్థకత చేకూరినట్టే.
వంజారి రోహిణి కథా ప్రస్థానంలో.. తొలి సంపుటిగా వెలువడుతున్న ఈ కథలు ఆ సార్థకతను, ధన్యతను పొందగలిగేవేనా? కాదా? తేల్చవలసింది పాఠకదేవుళ్లు. సావధానంగా అవధరించండి.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె