అదంటే నాకు,
అదొక రకం అయిష్టం…
ఎందుకో.. ఏమో…
పసితనం నుంచీ
ఆ రకం క్లయిమాక్స్
నాకెన్నడూ రుచించలా…
పడటం కొత్త కాదు,
తిరిగి లేవటమూ పాతబళ్లేదు
పడిపోయే ఉండరాదనే, …బోమనే
నిర్వేదాంతక కుహనా తత్వం!
ఓటమి కొత్త కాదు
గెలిచినట్లు గురుతు లేదు
అయితే-
ఓటమి మళ్లీ ఎదురవకుండా,
యుద్ధానికి దిగకపోవడమే మేలనే
వంచనాత్మక ఆత్మ జ్ఞానం!!
‘తత్వ- జ్ఞానం’ బహు మెండు నాకు…
అదే లుప్తమై ఉంటే గనుక,
ఏనాడో దానిని వరించి ఉందును!
నిత్య పరాజితాశ్రితుణ్ని..
విహ్వల విలోల మనస్కుణ్ని…
భావప్రకటనే బతుకు తెరువు!
స్వభావహననమే బతుకు దరువు!!
ఇంతదనుకా పఠించని మంత్రం-
పరిపరి విధముల- ‘అది’ నే నేర్వని తంత్రం
‘పలాయనం’- అసహ్యమైన బ్రహ్మాస్త్రం
ఒకేసారి… అవశ్యం అయితే!
ఐతే, పునఃప్రయోగానికి లేదు అవకాశం!
అందుకే-
అదంటే నాకు
అ… యిష్టం!
ఖాళీలను పూరించేస్తూ
విరాట్రూపంలో విధి సంధిస్తే..
నేను, నన్ను వంచిస్తే…
అత్యంత యిష్టం!!
… కె.ఎ. మునిసురేష్ పిళ్లె
19.10.2019 … 1.04 ఉదయం