దేహం లోపలి భాగంలో గాయం
త్వరగా మానుతుందంటుంది శాస్త్రం..
అలా మానని, మానే అవకాశం లేని
గాయాలను చూపుతుంది అనుభవం..
అవి-
చిరంతన, చిద్రూప అంతఃక్షతాలు!
* * *
మనకు ముందు..
మరొకరు అడుగు పెట్టనే లేదు!
మన తర్వాత..
మరొకరు ఆ ప్రయత్నం చేయలేదు!
‘మనం’ అని ప్లూరల్‌గా పలకడంలో…
‘సింగులర్’ కాంప్లెక్స్‌ను
పీక పిసికి చంపేయగలమనే…
ధైర్యం, పొగరు, దిలాసా..!
అయితే అవి-
ఆందోళన, భయం, వేదనా జనితాలు!!
* * *
ఆట కోసం ఓ తోడు-
తోడు కలవడానికి ఓ భుజం-
భుజం తట్టడానికి ఓ చేయి-
చేయి చేరుపులేని ఓ ఆట-
బతుకు!
లేమి గురించిన స్పృహ..
పొందమని ప్రేరేపిస్తుంటుంది!
దొరికే ప్రతి బంధంలో
దేవులాడుతుండమని అంటుంది…
ఈ దేవులాట- అజర, అవిరామ నిత్యకృత్యం..
ఎంత దేవులాడితే ఏం దొరుకుతుంది!
ఎలా సాధ్యం?
ఒక్కటే తరణోపాయం…
సొంతంగా ఏమీ లేనప్పుడు..
వెలితిలోని కలత కాటు వేస్తున్నప్పుడు..
దొరికిన ప్రతిదీ సొంతంగా
ఎంచుకునే, తెరువు ఒకటి ఉంటుంది!
కొన్ని కొంతలోనే తేలిపోతాయి,
కొన్ని పుట్టుక్కున విరిగిపోతాయి..
కొన్ని- బాధానందాల శిఖరాలు తాకుతూ
ఊయల ఊపులై ఊగిసలాడుతాయి..
కొన్ని చిక్కబడతాయి…
‘సొంత’మనే అగాథాలను నిండుగా కప్పేసి..
నిరతమై, నిత్యమై నిన్ను కమ్మేసి
నీలోనే, నీకోసమే నిలిచిపోతాయి..!
నీ భావోద్వేగాలను సదా స్పృశిస్తూ,
నీ బతుకులో భాగంగా మమేకమైపోతాయి!
* * *
అయినా…
సోషల్ సెలయేరుల్లో
‘సిబ్లింగ్ డే’ శుభాకాంక్షల వెల్లువలు
ఉపరితలాన్ని తడిపేస్తూ-
అంతఃకుహరంలో అగ్గి రాజేస్తుంటాయి!
‘జాతస్య హి ధ్రువో మృత్యుః..’
రాజుకున్న అగ్గి- ఆరిపోక తప్పదు!
అలా సమాధాన పడకుంటే..
దహనం పూర్తయి భస్మరాశి మిగులుతుంది!
అనిలస్పర్శ తగిలినా అంతర్ధానమౌతుంది..
ఇక ఏమీ మిగలదు.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
10 ఏప్రిల్ 2021,
(ప్రపంచ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా.. సెలబ్రేట్ చేసుకోలేని వారందరికీ శుభాకాంక్షలు. చేసుకుంటున్న వారందరికీ- అంకితం!)