దేవీప్రసాద్ ఒబ్బు కథా సంపుటి ‘సాగరం సాక్షిగా..’కు ముందుమాట
కథల సంకలనానికి ఇది ముందుమాట కాదు. ఒక గుత్తిగా అమరుతున్న కథా సుమాలను ఆఘ్రాణించి.. ఆలోచించి, ఆగ్రహించి ఆ పరిమళాలలను నిశ్వసించకుండా నాలోనే దాచుకోగల వాడిని మాత్రమే నేను. అంతేతప్ప, కథల గుణవిశేషాలను పుటం వేసి వాటి సందేశాలను, లాక్షణిక సౌందర్యాన్ని ప్రశంసించగల, అధిక్షేపించగల ప్రజ్ఞ, విజ్ఞత నాకు లేవు. నా అనర్హతల గురించి నాకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. కానీ, తరాలుగా పెనవడిన బంధాల వలన ‘నాకు నువ్వు రాస్తే చాలు’ అంటూ కథకుడు, తననదైన నవ్వుతో నిర్దేశించడం వలన ఈ పరిచయ సాహసానికి పూనుకుంటున్నాను.
పసితనం నుంచి ప్రసాద్‌ను ఎరిగిన వాడిగా.. వేసే ప్రతి అడుగునూ చూస్తున్న వాడిగా, ఇవాళ ఒక స్థాయి వరకు రూపుదిద్దుకున్న కథా రచయితగా ఒబ్బు దేవీప్రసాద్‌ను పాఠక ప్రపంచానికి పరిచయం చేయగల తాహతు మాత్రం నాకుంది.
వడ్డించేవాళ్ల మనఃస్థితి, ప్రవర్తన, తీరులను బట్టి.. తినే తిండి రుచి మారుతుందని కొందరంటారు. అనుభూతి వయక్తికం అయినప్పుడు.. కొన్నిటిని క్రోడీకరించి.. సిద్ధాంతీకరించిన సంగతిని అసత్యం అనలేం. అందుకే, ఆప్తుల్లో కొందరు వడ్డిస్తుండగా.. పచ్చడి మెతుకులు కూడా పంచభక్ష్యాలుగా రుచిస్తాయి. ఈ సిద్ధాంతాన్ని అన్వయించినప్పుడు ఒబ్బు దేవీ ప్రసాద్ రెండేళ్ల కాలంలో రాసిన కథలన్నీ గొప్పవిగా అనిపిస్తాయి. పాఠకుడికి ఒక మంచి విషయం చెప్పాలి… మంచి ఆలోచన కలిగించాలి అనే లక్ష్యం నిండుగా ఉన్న కథలివి. ఈ కథలు చదువుతున్నప్పుడు, వాటి వెనుక కథకుడిలో ఉన్న తహతహ, చెప్పదలచుకున్న సత్యం పట్ల సుదీర్ఘకాల అన్వేషణ, ప్రస్తావించదలచుకున్న మానవ బంధాల పట్ల తనకున్న నమ్మిక అన్నీ మన కళ్లకు కడతాయి.
ఉపాధ్యాయ వృత్తిలో ఒక అద్భుతమైన లక్షణం ఉంది. వారు పిల్లలకు ‘చెప్పే’ పనిలో ఉంటారు. తాము బోధించే సబ్జెక్టు కాకుండా.. మరే ఇతర మాట చెప్పినా కూడా.. పిల్లలకు ఏదో ఒక రీతిగా ఉపయోగపడేది, మంచిది అయిన సంగతినే చెప్పడానికి ప్రయత్నిస్తారు. కేవలం మంచి విషయం మాత్రమే చెప్పి, దాని వ్యాప్తికి వాహకంగా ఉండగల విలక్షణత ఆ వృత్తిలో ఉంది. అలాగే, ఎదుటివాడు గ్రహించగల సామర్థ్యాన్ని ఆకళింపు చేసుకుని, తాను చెప్పేది అవతలి వాడికి స్పష్టంగా బోధపడగల విధంగా వ్యక్తీకరించడం కూడా.. వృత్తిగతంగా వారికి అలవడుతుంది. సబ్జెక్టులోని విషయం చెప్పడానికి, విషయాంతరమైన ఒక ప్రస్తావనతోనో, కథతోనో మొదలెట్టి.. క్రమంగా ఎదుటివాడిని అందులో లీనం చేసి… ఆ ట్రాన్స్‌లోకి తీసుకువెళ్లి.. ఆ తర్వాత దానితో చెప్పవలసిన పాఠాన్ని ముడిపెట్టి.. వివరించి.. ఎలాంటి విసుగూ కలిగించకుండా పిల్లలకు బోధపరచడం ఉపాధ్యాయులకు ఉండగల ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞా పాటవాన్ని వృత్తిగతంగా సాధన చేస్తున్న ప్రసాద్.. ప్రవృత్తిలోనూ అదే శైలిని అనుసరిస్తున్నారు. ఈ కథలు మనల్ని ముందుగా.. అవి నడుస్తున్న వాతావరణంలోకి తీసుకువెళతాయి. అలవాటు పడేలా చేస్తాయి. అవి చెప్పదలచుకున్న సంగతేంటో చెప్పి, తర్వాత మనల్ని విడిచిపెడతాయి.
రచయితను పాఠకుడు కథాగవాక్షంలోంచి మాత్రమే చూడగలడు. తెలుసుకోగలడు. అతను రాసే కథలను అవలోకిస్తూ.. రచయిత వ్యక్తిత్వాన్ని తన మస్తిష్కంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, కథల ద్వారా ఎలాంటి విలువలను ప్రతిష్టిస్తుంటామో.. వాటన్నింటికీ రచయిత ‘స్వయంగా’ ప్రతినిధి అయి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు రచయిత ఒక మాధ్యం మాత్రమే. ఒక వాహకం లాంటివాడు. తాను ఒక్కడుగా గ్రహించిన సంగతులను పదిమందికీ పంచడం కర్తవ్యంగా ఎంచేవాడు. ఈ కృషిలో ‘గ్రహించిన విషయం’ అతని ఆసక్తికి దగ్గరగా ఉండేదే అయినప్పుడు.. వ్యక్తిత్వం కూడా అదే అవుతుంది. అలా కాకుండా.. తన వయక్తిక ఆసక్తితో నిమిత్తం లేకుండా.. ఇది నలుగురికీ తెలిస్తే చాలు అని అనుకున్నప్పటికీ.. అది మంచి కథే అవుతుంది. ఈ రెండో రకం సందర్భాల్లో.. పాఠకుడి ఊహాచిత్రానికి రచయిత భిన్నంగా ఉంటాడు. పాఠకుడు, ఆ ‘కథా గవాక్షం’లోంచి చూసిన పరిధికి వెలుపల రచయిత వ్యక్తిత్వం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు మనకు అనేకం తారసిల్లుతుంటాయి. మనం అభిమానించే రచయితలతో పరిచయం ఏర్పడి, వారి నడవడిని దగ్గరినుంచి చూసినప్పుడు.. అన్నాళ్లూ వారి రచనల్లో ఆరాధించిన జీవనవిలువలకు భిన్నమైన సరళి నివ్వెర పరుస్తుంది.
ఒబ్బు ప్రసాద్, తను కథల్లో ప్రస్తావించే విలువలకు తాను స్వయంగా ప్రతినిధే. ఒక కథలో పేర్కొన్నట్టు… తను నిమిత్తమాత్రుడు. విషయవాసన అంటకుండా జీవిత పథాన్ని నిర్దేశించుకోవడం అందరికీ సాధ్యం కాదు. తామరాకుపై నీటిబొట్టులా ప్రతి విషయంలోనూ నిశ్చింతతో ఉండడమూ అందరికీ వీలు కాదు. ఒబ్బు ప్రసాద్ అలాంటి తత్వాన్ని సాధనతో ఉన్నతీకరించుకున్నాడంతే. బాల్యంనుంచి అదే తత్వం ఉంది. స్కూలు వయసులో మేం చేసే అల్లరికి, తనలోని నిమ్మళమైన వైఖరికి చాలా తేడా ఉండేది. నిమిత్తమాత్రంగా ఉండే ఆ వైఖరి.. వయసు పెరుగుతున్న కొద్దీ చిక్కబడుతూ వచ్చింది. మాకున్న మిత్రుల్లో ఎలాంటి విషయాన్నైనా తామరాకుపై నీటిబొట్టులా తీసుకోగల వైఖరి.. విపరీతస్పందనలకు లోనుకాకుండా ఉండగల తీరు ప్రసాద్‌కు ఉంది. ఈ సంకలనంలోని నిమిత్తమాత్రుడు తానే అని కూడా అనిపిస్తుంది.
సృజన ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. సాహిత్యం కేవలం అందులో ఒక భాగం. తమకు ఏవైతే స్ఫూర్తినిస్తాయో.. అచ్చంగా అదే బాటలో మరొకటి సృజించడానికి ఎవ్వరికీ ఉత్సాహం ఉండదు. ప్రతి ఒక్కరూ, ప్రతి సృజనలోనూ తమ సొంత ‘ముద్ర’ను అభిలషిస్తారు. అలాంటి ప్రయత్నాల వల్లనే సాహిత్యం నిత్యం కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటుంది. కొత్త ప్రయోగాలకు గురవుతూనే ఉంటుంది. అలా విస్తరించే పోకడల్లో కొన్నింటిని కొందరు పెడపోకడలుగా కూడా అనుకుంటూ ఉంటారు. నిజానికి పెడపోకడలు అంటూ విడిగా ఏం ఉండవు. అలా భావించే వారి దృష్టికోణానికి, అది భిన్నంగా ఉంటుందని మాత్రమే అర్థం చేసుకోవాలి.
ప్రసాద్ రచనలో ప్రయోగాలు తక్కువ. విషయం సూటిగా స్పష్టంగా మీ చెంతకు వచ్చేస్తుంది. ఏ సందేశాన్నయితే తన, కథ ద్వారా చదువరులకు చేర్చదలచుకున్నాడో దానిని సూటిగా చేర్చేస్తాడు. అంతే తప్ప.. కథాగమనంలో, శైలీ విన్యాసాలలో అనూహ్యమైన మెరుపులు, దిగ్భ్రమకు గురిచేసే రాకడపోకడలూ ఇందులో మీకు కనిపించవు. మీరు కూర్చుని చదువుతూ ఉంటే.. మీ అంతరంగాన్ని పరుగులు పెట్టిస్తూ.. మీ ఉద్వేగాలను బరబరా ఈడ్చుకెళుతూ ఉండే కథలు కావివి. సరళంగా, స్పష్టంగా మాత్రమే విషయనివేదన చేస్తాయి. ప్రసాద్ రచనల్లో స్పష్టత ఉంటుంది. కౌమారంలో ఉండే పిల్లలకు బోధించే వృత్తిలో ఉన్నవాడు తను. పాఠకులను కూడా పిల్లలుగా ఎంచి చెప్పాలనుకోవడం, సులభగ్రాహ్యంగా రాయదలచుకోవడం దుష్కృతి కాదు.
శిష్యాధిచ్ఛేత్ పరాజయం… పుత్రాధిచ్ఛేత్ పరాజయం అని అంటుంటారు. కొన్ని సార్లు పరాజయం కూడా ఒక గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక తండ్రికి అలాంటి భావన కలిగించే కథ ‘స్ఫూర్తి’. ఎలాంటి జీవనవిలువలను ప్రతిష్ఠించుకుంటే.. ప్రతి కుటుంబమూ చీకూచింతా లేని వాతావరణంలో నడుస్తుందో తెలియజెప్పే కథ ‘జీవనమాధుర్యం’… తనను, తన జీవితాన్ని తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన జీవితాలను, పండువయసులో అంతే కృతజ్ఞతతో చూసుకోవడం అనేది ఎంత ముఖ్యమో, అందుకోసం ఏం త్యాగం చేయడానికైనా ఎందుకు వెనకాడకూడదో మనకు ‘వెళ్లవలసిన స్కూలు’ చెబుతుంది. ఇది పుస్తక సమీక్ష కాదు. నేను ప్రతికథను సాకల్యంగా పరిచయం చేయదలచుకోలేదు. మీ అనుభూతులకు నా కళ్లజోడు తగిలించాలని అనుకోవడం లేదు.
ఉపాధ్యాయుల్లో రచయితలు ఉంటే వారి నీడలో ఎదిగే భవిష్యత్తరంలో సాహితీచింతన సలక్షణంగా ఉంటుందనే అభిప్రాయం నాకుంది. చిన్నతనంలో మేమిద్దరమూ కలిసి బడిలో చదువుకుంటున్నప్పుడు అలాంటి వారు ఎవరూ లేరు. ఉన్నట్లయితే.. ప్రస్థానం మరో తీరుగా ఉండేది. ఉదాహరణకు టీచరు ఛందస్సు చెబుతున్న రోజుల్లో, భరనభభరవ మనల్ని ఎట్రాక్టు చేస్తున్నప్పుడు.. ఆ గణాల్లోకి కొన్ని పదాల్ని కూర్చి, నాలుగు పంక్తులు రాసిన తర్వాత.. అది పద్యం అని భ్రమించి.. ఉత్సాహంగా అయ్యవారికి చూపిస్తే.. దానిని దిద్ది… ఇలా కాదు ఇలా.. అని చెబితే.. రాయడం పట్ల మక్కువ బహుశా పిల్లల్లో పెరుగుతుంది. అలాగే ఉపాధ్యాయులు రచయితలై ఉంటే వారి స్ఫూర్తి, ప్రేరణ మనల్ని ఏదో ఒకటి రాస్తూ ఉండడానికి పురికొల్పుతుంది. అలాంటి వాతావరణం మాకు బడిలో లేదు.
చదువుకునే పాఠాలు తప్ప.. ఏ కొంచెం సాహిత్యస్పృహ ఏర్పడాలన్నా సరే.. అది మనలోని సొంత జిజ్ఞాస అయి ఉండాలి. ఒబ్బు ప్రసాద్ అలాంటి జిజ్ఞాసను కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల పాటు తనలోనే పదిలంగా దాచుకున్నాడు. ఇప్పుడు అర్థమవుతున్నదేంటంటే.. అండర్‌గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఉగ్రవాదులు రెండో కంటికి తెలియకుండా ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకునే తరహాలో… ఇన్నాళ్లుగా తన అంతర్లోకంలో దానికి పదును పెట్టుకుంటూనే ఉన్నాడు. చాలా ఆలస్యంగా అస్త్రసంధానం చేస్తున్నాడు. కానీ, చాలా వేగంగా చేస్తున్నాడు. రెండేళ్లలో రెండు డజన్లకు పైగా కథలు రాయడం.. ఎలా చూసినా అంత ఈజీ కాదు. ‘ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?’ అనే డైలాగుకు మా ప్రసాద్ కథారూపం. ఎంత ఆలస్యంగా మొదలెట్టాడనేది కాదు. ఎంత చురుగ్గా, ఎంత శ్రద్ధగా రాస్తున్నాడనేది ముఖ్యం.
సాధారణంగా.. జీవితం గానుగ బాటలోకి ప్రవేశించిన తర్వాత… వైవిధ్యాన్ని కోల్పోతుంది. రొటీన్ మనకు అలవాటు అయిపోతుంది. మనలో వైవిధ్యం, విలక్షణత లేకుండా.. సమాజాన్ని ఎంత లోతుగా గమనిస్తున్నప్పటికీ.. వైవిధ్యాంశాలను మనం గ్రహించగలడం కూడా కష్టం అవుతుంది. అంతఃచైతన్యంలో ఏదైతే యింకుతుందో.. అది మాత్రమే బహిర్ వ్యక్తీకరణగా రూపు దిద్దుకుంటుంది. అందుకే ఎక్కువమంది సృజనశీలుల్లో వారి కృషి.. గానుగబాటలోకి పడడానికి ముందే శ్రీకారం దిద్దుకుని ఉంటుంది. కానీ.. ఒబ్బు ప్రసాద్ ఈ సిద్ధాంతానికి అతీతుడు! ఆలస్యంగా కథారచన మొదలెట్టినప్పటికీ… తన పరిసరాల్లోని ప్రతి వైవిధ్యాన్నీ ఒడిసిపట్టుకుంటున్నాడు. వాటిని కథలుగా తీర్చి అందించే ప్రయత్నం చేస్తున్నాడు. తన రచన మూసగా మారిపోకుండా, రొటీన్ కాకుండా నిత్య విలక్షణంగా అలరారే ప్రయత్నాలు చేస్తున్నాడు. కథారచనలోకి ప్రవేశించడానికి తాను చేసిన జాగును, తన వేగంతో దిద్దుకుంటున్నాడు. ఒకసారి రివాల్వర్ ఎక్కు పెట్టాక, మేగజైన్ మొత్తం దించేస్తున్నాడు.
‘ఇష్ట కామ్యార్థ సిద్ధి’ అనే దానిని మరోరకంగా నిర్వచించాలనిపిస్తోంది. ‘ఇష్టపడి చేసే పనికి తగిన ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది’ అని! ఒబ్బు ప్రసాద్.. రచనాకృషిలో అలాంటి ఇష్టం ఉంది. చేసే పనిలో చిత్తశుద్ధి ఉంది. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పాలనే తహతహ ఉంది. ఇష్టంగా చేస్తున్న పని గనుక… ఫలితం దక్కి తీరవలసిందే. అందుకే యథోక్తిగాగానీ, భిన్నోక్తిగా గానీ.. ఇష్టకామ్యార్థం సిద్ధించే విషయంలో ‘అస్తు’ అని దీవించాలని సర్వాంతర్యామిని కోరుకుంటున్నాను. ప్రసాద్ చేసే ప్రతి ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తున్నాను.
ఇక, పుస్తకంలో పడండి. ఈ అతీతుడి ప్రయత్నాన్ని ఆదరించండి. ప్రసాద్ ప్రపంచంలో తిరుగాడే ఉదాత్తమైన పాత్రలను మీరు కూడా పరిచయం చేసుకోండి. వారిని మీ స్నేహితులుగా తీర్చుకోండి. చదివి పూర్తిచేసిన తర్వాత కూడా.. జీవితగమనంలో ఏదో ఒకసారి.. ఎక్కడో ఒక చోట… ఏదో ఒక పాత్ర మీకు జ్ఞప్తికి వస్తూనే ఉంటుంది. తారసపడుతూ ఉంటుంది. చాలు.. అలా జరిగితే… నా మామ.. ఒబ్బు ప్రసాద్ ధన్యమైనట్టే!
… కె.ఎ. మునిసురేష్ పిళ్లె