‘‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన
అంతమాత్రమే నీవు!
అంతరాంతరము లెంచి చూడ
పిండంతే నిప్పటి యన్నట్లు’’
…ఖరారే,
అన్నమయ్యకు దైవత్వం బోధపడే ఉంటుంది!
లేకుంటే,
నిన్ను చూడకుండా అలా ఎలా రాయగలడు?
త్యాగయ్యకు నీ పరిచయం ఉండే ఉంటే-
‘చాల సరళమయ హేల, సుగుణ గుణశీల, బుధ శిష్య లోల, విధృత శర
జాల, శుభకర కరుణాల వాల, ఘన జ్ఞాన భవ్య మన మాలికాభరణ’
అని నుతించకుండా ఎలా ఉండగలడు?
===
జ్ఞానాంబుధి ఎదుట ఉంటే
దక్కేదెంత? విడచేదెంత?
మీమాంస ఎంత అసంబద్ధం?
గ్రోలడం-
శక్తి సామర్థ్యాలకు పరీక్ష అయినప్పుడు
దక్కనిది యావత్తూ అశక్తతే!!
అనుభవాల గనిలోకి అడుగుపెట్టాక
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత
మోయగలిగినోడికి మోయగలిగినంత!
సంపద కురచైపోయిందనే చింత ఎంత అర్థరహితం?
వెంట తెచ్చుకోలేకపోతే బలహీనతే!
భిక్షువుగా-
నీ మేథో వాకిట్లో
జోలె పట్టి నిలుచున్నప్పుడు…
నువ్వు ప్రేమగా విదిలించిన కబళమే
అక్షయమై ఇవాళ్టికీ కడుపు నింపుతోంది!
సుక్షతమై పరాకును దూరం తరుముతోంది!!
భాషా సంస్కారాలూ
వ్యవహార జ్ఞాన మర్మాలూ
బతుకు ఎత్తు పల్లాల దెబ్బల్ని తట్టుకోవడంలో…
నీ మాట –
తలపుల్లోంచి, మేం చేదుకుంటున్న ఊటబావి!
నీ పాఠం-
నిత్యానుష్ఠానమై తీర్చిదిద్దుతున్న శిల్పి చేతిఉలి!
‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’- న్యూటన్‌లా
నీవు నేర్పిన వృత్తిగత సిద్ధాంతాన్ని
‘ప్రభువు మనసెరిగి నడుచు’కోవడమనే
ఆధునిక రూపానికి ఉన్నతీకరించుకుని…
ఆత్మహననం చేసుకోకుండా
ఏరోజు కొలువు చేస్తున్నాం మేం?
నీవొక జ్ఞాపకమా…
ఎపుడైనా మరచి ఉంటే కదా?
నీవొక పాఠమా-
వల్లె వేయకుండానే బుర్రల్లో ఇంకి ఉన్నావు కదా?
నీ సముఖంలో నేర్చిన దానికి –
నీ పరోక్షంలోనూ మెరుగులు దిద్దుకున్నాం!
సగం జీవితం చదివాకే
నీ చెంతకు వచ్చి చేరిన వాళ్లమే అంతా…
అయినా గురుస్మరణంలో
నీ ఒక్కడినే ఎందుకు తలచుకుంటున్నాం?
నేర్పినది కొంత
నేర్పకనే బోధపరిచినది కొండంత
చివరకు, నీ తుదిశ్వాస కూడా
మాకు బతుకు పాఠమే అయింది!
బహుపార్శ్వాల నిస్సంగత్వమైంది!!
=== ==
అక్షర భిక్ష
అక్షరమైన భిక్ష
అక్షరం- ప్రశ్నగా ఎదుట నిలిచిన,
ఏ క్షణం- నీ స్మృతిని తవ్వుకోకుండా ఉన్నాం మేం!
అందుకే,
వినా గురుదేవం ననాథో ననాథః
సదా గురుదేవం స్మరామి స్మరామి
అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ
ప్రణామేచ్ఛ యాగత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో బూదరాజా
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
1994 బ్యాచ్ విద్యార్థి
ఆదర్శిని, హైదరాబాద్