‘మరొక వ్యక్తి భార్యతో శృంగార సంబంధం కలిగి ఉంటే తప్పా కాదా?’ ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తప్పొప్పులు అనేవి అభిప్రాయాలు! వీటికి ‘సామాజిక’ అనే పదం జోడించింది సర్వోన్నత న్యాయస్థానం. ఎటొచ్చీ ఇవి అభిప్రాయాలు మాత్రమే… ‘సామాజిక’మైనవి మాత్రమే గనుక.. సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత- ఇది తప్పు కాదు అనే వాళ్లూ మనలో ఉంటారు. అలాగే ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తప్పే’ అనే వాళ్లు, తొలినుంచీ ఉండనే ఉన్నారు. ‘తప్పు’ గోల వదిలేస్తే.. ఇది ‘నేరం’ కాదు అని సుప్రీం కోర్టు తేల్చింది. ఇలాంటి శృంగార సంబంధాలలో కొన్నింటిని నేరంగా గుర్తించే ఇండియన్ పీనల్ కోడ్ లోని 497 వ సెక్షన్ ను సుప్రీం కోర్టు రద్దు చేయడం, రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్వచించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇంతకూ ఆ సెక్షన్ ఏం చెబుతుంది? ‘‘మరొకవ్యక్తి భార్య అని తెలిసీ లేదా అలా అని భావిస్తూ, భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగార సంబంధం అనేది అత్యాచారం కిందికి రాదు. వివాహేతర సంబంధం కింద నేరం అవుతుంది’’ అని అందులో ఉంటుంది.
ఎందుకింత రాద్ధాంతం రేగింది?
వివాహేతర సంబంధాలు అన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుందని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ సదరు చట్టంలో ఒక మెలిక ఉంది. ‘ఆమె భర్త అనుమతించినా లేదా వారి శృంగారాన్ని పట్టించుకోకుండా ఉపేక్షించినా’ అది నేరం కాదు. జరిగిన రాద్ధాంతం, కోర్టులో వాద ప్రతివాదాలు మొత్తం ఈ మెలిక గురించి మాత్రమే. సుప్రీం కోర్టు అన్ని అంశాలను (?) సాకల్యంగా పరిశీలించిన మీదట.. ఏకంగా ఆ సెక్షన్ నే కొట్టివేసింది. పురాతన కాలం నాటి బూజుపట్టిన ఆలోచనకు ఇది నిదర్శనంగా సుప్రీం కోర్టు భావించింది. 158 ఏళ్ల కిందటి ఈ చట్టం రాజ్యాంగం ప్రసాదించే వ్యక్తి స్వేచ్ఛకు భంగకరం అని పేర్కొంది. ఈ చట్టాన్ని కొట్టివేయడం వలన ప్రస్తుతం ‘భర్త అనుమతి లేదా ఉపేక్ష’ అనే ఆధిపత్య ధోరణికి తెరదించేశారు. మహిళల వ్యక్తిగత ఆత్మగౌరవం, స్వేచ్ఛ నిలబడ్డాయి. ఇప్పుడిక పరస్పర అంగీకార యోగ్యం అయితే చాలు.. ఏ ఇద్దరు ఆడ-మగ అయినా శృంగారంలో పాల్గొనవచ్చు.
ఈ చట్టం మెలికల గురించి అవగాహన లేక, బహుశా చాలా మంది ఇలాంటి సంబంధాల విషయంలో గోప్యత పాటిస్తుండేవారు. ఇప్పుడు ఆ గోప్యత అవసరం లేదు. ఇష్టం ఒక్కటే కొలబద్ధ. ఒక భాగస్వామిని ఒప్పించగలిగితే.. ఎవరితోనైనా శృంగారం చేసుకుని, తద్వారా తమ స్వేచ్ఛ భంగపడలేదని సంతృప్తి చెందవచ్చు.
ఈ ‘అనుమతి’ అనే పదం వలన.. మహిళ పురుషుడి (ఈ సందర్భంలో భర్త) యొక్క ఆస్తిగా పరిగణింపబడుతుండడం.. అభ్యంతరాలకు మూలకారణం. అతడు అనుమతిస్తే నేరం కాకుండా పోవడం ఏమిటి? భార్యకు సొంతంగా వ్యక్తిత్వం ఉండదా? అనే కోణంలోంచి ఈ చట్టంపై పోరాటాలు జరిగాయి. నిజానికి భార్యను మరొకరితో సెక్స్ కు ‘అనుమతించడం’ మాత్రమే కాదు కదా… ‘ప్రోద్బలం చేయడం’ వంటి పోకడలు కూడా మన సమాజంలో విశృంఖలంగా ఉన్నాయి. అవి ఇప్పటికీ ‘నేరం’గానే పరిగణనలో ఉన్నాయి. మొత్తానికి ఈ ఐపీసీ సెక్షన్ 497 రద్దు అయింది.
అసలు చట్టం పట్ల మెజారిటీ అభ్యంతరాలకు హేతువైన ఈ అంశంపై న్యాయమూర్తులందరూ ఏకీభవించారు. ‘భర్తల నీడలో భార్యలు బతికే రోజులు పో’యాయని జస్టిస్ ఇందూ మల్హోత్ర, ‘భార్యను ఆస్తిగా పరిగణించడం లాగా ఉ’న్నదని జస్టిస్ నారీమన్, ‘లైంగిక స్వతంత్రత అనేది మహిళల స్వేచ్ఛ’ అని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, ‘ఇది వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం, మహిళలను అసమానంగా చూడడం’ అని జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ఖన్విల్కర్ లు తమ తమ తీర్పుల్లో పేర్కొన్నారు.
తీర్పుపై అభ్యంతరాల్లో అర్థముందా?
అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం.. ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఇచ్చిన తీర్పు ఇది. విడివిడిగా నాలుగు సెట్ల తీర్పులున్నప్పటికీ.. ఇంచుమించుగా అందరిదీ ఒకటే మాట. అయితే ఈ తీర్పు పట్ల సమాజంలో విపరీతంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారంతా ఛాందసులు, సమాన హక్కులకు, వ్యక్తిస్వేచ్ఛకు భంగం కలిగించే దుర్మార్గులు అని ఒక్కమాటతో తేల్చిపారేయడం చాలా తేలిక. కానీ.. కాస్త లోతుగా ఆ అభ్యంతరాలను పరిశీలించినంత మాత్రాన నష్టమేమీ ఉండకపోవచ్చు.
‘ఈ తీర్పు సంతోషకరమే కానీ, ఇది ఎలా ఉపయోగపడుతుందో అర్థం కావట్లేదు. న్యాయస్థానం స్పష్టత ఇవ్వాలి’ అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి లాంటి వాళ్లు అంటున్నారు. ఆమె చాలా సున్నితంగా చెప్పినట్లు లెక్క. పాతివ్రత్యాన్ని ఇది మంటగలిపేస్తుందనే ఛాందసులకు లెక్కేలేదు. అతిశయమైన ఇలాంటి అభిప్రాయాలను పక్కన పెడితే.. మహిళల వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛను గౌరవించడం అంటే లైంగికస్వేచ్ఛను ఆమోదించడం మాత్రమే కాదు- అని వాదించే వాళ్లూ అనేకులు ఉన్నారు. ఇది లైంగిక సంబంధాల పరంగా విచ్చలవిడితనానికి దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తన భాగస్వామి ఎవరితో శృంగారాన్ని కలిగిఉంటున్నా అభ్యంతరపెట్టే అవకాశం ఎవరికీ లేదు. కాకపోతే.. ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అవతలి వారిది నేరం అవుతుంది. అప్పటికీ.. ‘వారి లైంగిక స్వేచ్ఛ పర్యవసానంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు’ నిరూపణ కావాల్సి ఉంటుంది. ఇంత చట్టబద్ధంగా అందరూ స్వేచ్ఛను అనుభవించడం ప్రారంభిస్తే… ఆత్మహత్యలు జరగకుండా ఉంటాయనలేం. భాగస్వామి చర్యల పట్ల తిరస్కారంతో కాకపోవచ్చు, మరొకరితో శృంగారానికి ఇష్టపడుతున్నారంటే.. అది తమ వైఫల్యంగా భావించి ఆత్మహత్య చేసుకునే వారూ ఉంటారు. అలాంటి కారణాలపై ఆత్మహత్యలు ఎన్నో ఉంటాయి. కానీ.. ఎన్నింటిలో న్యాయపీఠం నిర్దేశించిన ఆధారాలను చూపించగలరు. చాలా సంక్లిష్టమైన అంశం ఇది.
ఏదో ఒకనాడు, ఎవరో ఒకరు- తన జీవిత భాగస్వామికి ఫోను చేసి.. ‘‘ఆఫీసు అయిపోగానే ఇంటికి వచ్చేయద్దు. రాత్రి పది తర్వాత రా’’ అని చెప్పే రోజు రాకుండా ఉంటుందా?
ఇలాగైతే ఎలా ఉండేది…?
వివాహిత, భర్త ఆస్తి అనే అంశం చుట్టూతానే వాదప్రతివాదాలు పరిభ్రమించడం వలన.. ‘ఆస్తి కాదు’ అని కోర్టు తేల్చేసి.. చట్టాన్ని కొట్టేసింది. అయితే భర్త అంగీకార తిరస్కారాలతో నిమిత్తం లేకుండా… ‘ఒక వివాహబంధంలో ఉన్న వారు (పురుషులైనా, స్త్రీలైనా) జీవితభాగస్వామి మినహా మరొకరితో శృంగార సంబంధం కలిగి ఉండడం నేరం’ అనే కోణంలోంచి న్యాయమూర్తులు ఈ కేసును పరిశీలించి ఉంటే గనుక.. మొత్తం వ్యవహారం మరొక తీరుగా ఉండేది.
అలాగే, దంపతుల్లో ఒక భాగస్వామి లైంగిక స్వేచ్ఛను కోరుకుని, మరొకరికి అలాంటి ఆసక్తి లేనప్పుడు పరిస్థితి ఏమిటి? ఒకరు తమ ఇష్టం మేరకు ఎవరితోనైనా లైంగిక సంబంధాలను కలిగి ఉంటూ.. జీవిత భాగస్వామి కి ఉండగల అవకాశాలను లుప్తం చేస్తే ఏం జరగాలి? ఆ కారణం మీద లైంగిక స్వేచ్ఛ కోరుకోని భాగస్వామి విడాకులు అడగగలరా? అలాంటి వెసులుబాటు గురించిన చర్చ ఈ తీర్పులో ఉన్నట్లుగా లేదు.
‘ఆస్తికాదు- అనుమతి అక్కర్లేదు’ అన్నంత వరకే తీర్పులు ఆలోచించాయి. అక్కడే ఆగిపోయాయి. అలా కాకుండా.. వివాహబంధం నుంచి మినహా.. మరే ఇతర శృంగార సంబంధం అయినా నేరమే.. అని ఉండాల్సింది. ఇలాంటి వాదన వలన… వ్యక్తుల ‘లైంగిక స్వతంత్రత’కు ఎలాంటి భంగమూ వాటిల్లదు. లైంగిక స్వేచ్ఛ కావాలనుకున్న వాళ్లు వివాహబంధంతో ముడిపడకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆ స్వతంత్రత గురించిన కోరిక లేని వయసులో వివాహబంధంలోకి ప్రవేశించిఉంటే గనుక.. కేవలం తన లైంగిక స్వేచ్ఛకు ప్రతిబంధకంగా ఉన్నది గనుక.. ఆ కారణం మీద, వివాహాన్ని రద్దు చేయాలని, విడాకుల కోసం దరఖాస్తు చేయగల వెసులుబాటు కల్పించి ఉంటే సరిపోయేది. ఇతరుల భార్యలతోను, భర్తలతోను శృంగారం చేసుకుంటూ దానిని స్వేచ్ఛగా పరిగణించే బదులు… బంధాల చట్రంలో లేని వారు తమ స్వేచ్ఛను పూర్తిగా అనుభవించగలుగుతారు.
ఇప్పుడు తీర్పుపట్ల వ్యక్తమయ్యే అభ్యంతరాలన్నీ కూడా తేలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి బయటకు కనిపిస్తున్న కొన్ని మెలికలు మాత్రమే. కాలగమనంలో ఇంకా అనేక అంశాలు, అనేకానేక కోణాలు వివాదాలుగా రూపుదాల్చి.. న్యాయస్థానం ఎదుటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ తీర్పు ఖచ్చితంగా మరోసారి సమీక్షకు నిలబడవలసి వస్తుంది.
సెక్షన్ 497 గురించే.. ‘‘సమాజంలోని మార్పులు గమనించి శాసన వ్యవస్థే సెక్షన్ 497 లో మార్పులు చేయాల్సి ఉంటుంది. కొట్టివేస్తే మంచిదన్న కారణంతో కొట్టివేయలేం’’ అని 1985లో జస్టిస్ వై.వి. చంద్రచూడ్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తీర్పు చెప్పారు. ఇప్పుడు ఆయన తనయుడు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన తీర్పులో ‘‘వివాహం కారణంగా మహిళ ఆధీనమయ్యే పరిస్థితిని కల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్పు ఇవ్వాలి. సెక్షన్ 497ను కొట్టివేయాలి’’ అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో మరికొన్నేళ్ల తర్వాత.. ఈ తీర్పు వలన రాగల పరిణామాలు, రేకెత్తగల కొత్త వివాదాల విచారణలో భాగంగా.. మరో సమీక్ష జరగవచ్చు. లైంగిక విచ్చలవిడితనం అంటూ కొందరు భావిస్తున్న పోకడలకు అప్పుడు తెర పడవచ్చు.
ఒక్క మాట మాత్రం నిజం. కాలానుగుణంగా ప్రతి చట్టమూ మారక తప్పదు. ఇవాళ నేరం కాకుండా పోయినది… రేపు నేరమే అయినా ఆశ్చర్యం లేదు. అలాంటి సమీక్షలు సవరణలకు ఈ తీర్పు గురయ్యే పరిస్థితి వస్తే.. అపరిపక్వ తీర్పుకిందే లెక్క.
… కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సీనియర్ పాత్రికేయుడు, న్యాయవాది
(మనం దినపత్రిక సంపాదకీయం పేజీలో ప్రచురితమైన వ్యాసం)