నగరంలో పాడె కట్టేవాడికి చాలా డిమాండు. ఏడెనిమిది అడుగులుండే నిలువు వెదురు బొంగులు రెండు, వాటికి అడ్డలుగా వేయాల్సిన వెదురు బద్దలు డజనున్నర, పురికోసు దారాల కట్టలు రెండు, రెండు పిడికిళ్ల ఎండుగడ్డి, నాలుగైదు టెంకాయలు, పంచె, తువ్వాలు.. శవం మీద కప్పడానికి, బద్ది చేసుకోడానికి ఓ తెల్ల గుడ్డ, రెండుకుండలు, రెండు పూలమాలలు, కాసిని విడిపూలు, పూలరేకులు, బొరుగులు, బొగ్గులు, సాంబ్రాణి, అగరొత్తులు ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇవన్నీ కలిపి టోకుగా ముప్పయ్యారు వేలవుతుందని లెక్కచెప్పాడు వాడు. పదివేలకంటె ఎక్కువ కాదన్నాడు బావ. వాడు అదో మాదిరిగా నవ్వి… ‘నిజమే సార్.. రోజూ నాకు బేరం ఇస్తారా చెప్పండి… మీరన్నట్లు పదివేలకే చేస్తా’ అన్నాడు. ఈ బేరం కోసం- ప్రతిరోజూ ఎవరు చావగలం ఈ ఇంట్లో… అని సరిపెట్టుకుని ఒప్పేసుకున్నారు.
పోయింది… బావకు పెదమేనత్త. ముందూవెనుకా ఎవరూ లేకపోవడం వలన అన్నీ బావే చేశాడు. తీరా పాడె లేపాల్సిన వేళకి ఓ భుజం తక్కువపడింది. అటూ ఇటూ తేరిచూసి.. బావ, పాడె కాంట్రాక్టరునే ఓ చెయ్యి వేయమన్నాడు. వాడు చిత్రంగా ఓ నవ్వు నవ్వి.. ‘నా పని ఇంత వరకే సార్.. కావాలంటే చెప్పండి…’ అంటూ, మరో కాంట్రాక్టుకు సంకేతం ఇచ్చాడు. ఈలోగా ‘గోవిందా అంటూ ఎత్తండ్రా’ అనే పొలికేకతో పాడె ముందువైపు బొంగు పట్టుకుని నిల్చున్నాడు.. ఎప్పుడొచ్చాడో గానీ.. వీరామామ!
ఆమె ఆఖరి యాత్ర మొదలైంది.
స్మశానంలోకి వెళ్లాక.. దింపుడుకళ్లెం అంటూ.. పాడె దించారు.. అలవాటు కొద్దీ పేరుపెట్టి మూడుసార్లు అత్త చెవిలో పిలిచాడు బావ. ఆనక తీసుకెళ్లి కాష్టం మీద పడుకోబెట్టారు. భుజాన నీళ్లకుండ ఎలా పట్టుకోవాలో కూడా తెలియకుండా.. జారిపోతున్న పంచెని ఓ చేత్తో సర్దుకుంటూ.. బావ కాష్టం చుట్టూ తిరుగుతున్నాడు.
దూరంగా ఓ చెట్టుకింద సమాధి మీద కూర్చుని ఉన్నాడు వీరామామ. నేను దగ్గరికెళ్లేసరికి… ఓ కొబ్బరి ముక్క అందించాడు. చేయిచాచబోయి ఉలిక్కిపడ్డా న్నేను. దింపుడుకళ్లేనికి దించినప్పుడు పాడె దగ్గర కొట్టిన టెంకాయ అది. ఓ చిప్ప తెచ్చుకుని సమాధిమీద గచ్చుపై కొట్టుకుని.. తింటున్నాడు మామ. వీరామామను మా వాళ్లలో కొందరు ‘వితండం గాడు’ అని ముద్దుగా ఎందుకంటారో అప్పుడు అర్థమైంది నాకు.