ఒక వ్యవస్థలో కొత్త పాలకులు వచ్చినప్పుడు.. తమ ముద్ర కోసం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఆయా నిర్ణయాలకు ఎదురయ్యే ఫలితాలను బట్టి.. లోటుపాట్లు గుర్తించేకొద్దీ వాటిని దిద్దుకుంటారు. కొన్ని సార్లు చిత్రమైన పరిస్థితి ఉంటుంది. లోపాలు బయటపడే సరికి.. దిద్దలేని దుస్థితి ఏర్పడి ఉంటుంది. కొత్త విధానాలను కార్యరూపంలో పెట్టేప్పుడు, సుదూర పరిణామాలను అంచనావేయడంలో తేడాల వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో, పరిణామాల గురించిన కొన్ని భయాలు కలిగినప్పుడు.. వాటిపై చర్చ అవసరం. అవి సహేతుకమైనవి అయితే బాధ్యులలో ఆలోచన కలిగించడానికి చేసే ప్రయత్నం జరగాలి.
తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం.. డబ్బు దండిగా ఉన్న ప్రతి ఒక్కరినీ వీఐపీగా గుర్తించే సంస్కృతికి శ్రీకారం చుట్టింది. బహిరంగ విక్రయాల ద్వారా వీఐపీ హోదాను కట్టబెట్టే కొత్త పథకం ప్రకటించారు. తిరుమలేశుని ఆలయాలను దేశవ్యాప్తంగా నిర్మించడానికి ఉద్దేశించిన, టీటీడీ వారి శ్రీవాణి పథకానికి పదివేల రూపాయల విరాళం ఇస్తే చాలు.. ఏ వ్యక్తికైనా 500 రూపాయలకు వీఐపీ టికెట్ విక్రయించి, ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటుచేస్తారు.
తెల్లబజారులోకి ‘బ్లాక్‌టికెట్లు’
సంపన్నులకు తిరుమలేశుని అద్భుత దర్శనం ఎన్నడూ అందుబాటులో లేకుండా పోలేదు. కొందరు మంత్రులు, ఆ పైవారి నుంచి స్వయంగా ఉత్తరాలు తెచ్చుకుంటారు. ఎమ్మెల్యేల స్థాయి వారి ‘ఖాళీ’ ఉత్తరాలను హోటళ్లలోనో, ఇతర దళారీల వద్దనో కొనుక్కుని మరికొందరు సిఫారసు ఉత్తరాలు బనాయిస్తారు. మొత్తానికి ఒక ఎల్ 1 స్థాయి వీఐపీ దర్శనానికి 10-15 వేల రూపాయల చీకటిబజారు ధర నిన్నటి వరకు ఉండేది. తిరుమలలో మిక్కిలిగా దొరికే దళారీలకు ఆ మాత్రం సొమ్ము ముట్టజెబితే వారే కొండమీద గది ఏర్పాటుచేసి, టికెట్లు తెచ్చి చేతిలో పెడతారు. ధరకు పైన, తృణమో పణమో పుచ్చుకుంటారు. ఆ ధరలో అధికార, అనధికార వర్గాల్లో పలువురికి వాటాలున్నాయని చెప్పుకుంటూ ఉంటారు. తిరుమలేశుని నమ్ముకుని.. ఆయనను అమ్మకానికి పెట్టి అనేకానేకమంది తిరునామం పెట్టుకున్న భక్తులు, సభక్తికంగా సాగిస్తూ వచ్చిన దందా ఇది.
టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ బ్లాక్ మార్కెటింగ్… తెల్లబజారు విక్రయాలుగా మారింది. అలాగని దళారీల వ్యవస్థ ఆగిపోయే అవకాశం లేదు. పైగా వారిప్పుడు బేరాలకు అవకాశం లేకుండా రూ.పదివేల కనీసధరను ఫిక్స్ చేసేసుకున్నారు. సిఫారసు ఉత్తరాల ద్వారా కేటాయించే వీఐపీ దర్శనాల కోటాను కుదించకుండా అక్రమాలు ఎలా ఆగుతాయి?
కానీ, ఈ ఏర్పాటు వలన, సామాన్యభక్తుడికి ఒరిగిందేమీ లేదు. వాడికి దర్శనభాగ్యం దక్కే వ్యవధి పెరగలేదు. కొత్త ఏర్పాట్ల వల్ల అంతో ఇంతో సమయం మిగిలి.. దేవుడిని దగ్గరినుంచి చూసే భాగ్యం ఏర్పడలేదు. లఘు, మహాలఘు అనే పదాలను చేర్చి.. దేవుడు అల్లంత దూరంలో ఉండగానే.. భక్తులను లాగిపారేసే పోకడల్లో మార్పు రాలేదు.
పథకానికి విరాళాల వెల్లువ
శ్రీవాణి పథకం అంటే.. తిరుమల వేంకటేశ్వరుని ఆలయాలను దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిర్మించడానికి ఉద్దేశించిన పథకం. ఈ పథకానికి ఇచ్చేవాళ్లు ఇదివరకు కూడా ఇస్తూనే ఉన్నారు. కేటాయింపులూ ఉంటున్నాయి. పనులు జరుగుతున్నాయి. కానీ.. వీఐపీ టికెట్లు కొనడానికి ఇది అడ్డదోవగా మారడంతో, హఠాత్తుగా నిధుల వెల్లువ మొదలైంది. అక్టోబరు 21న పథకం ప్రారంభిస్తే… యాభై రోజుల్లో 3.21 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఈ పథకానికి కొత్తగా ఆన్‌లైన్ చెల్లింపు ఏర్పాటు వచ్చింది. యాప్ కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
శుక్రవారం నాడు 200 టికెట్లు, తతిమ్మా ఆరు రోజుల్లో 500 టికెట్ల వంతున విక్రయానికి ఉంచుతారు. అంటే నెలకు 12800 వంతున 153600 టికెట్లు ఏడాదిలో అమ్మకానికి ఉంటాయి. ఈ టికెట్లు మిగిలిపోయే అవకాశం తక్కువ. మొత్తం అన్ని టికెట్లనూ పదివేల వంతున విక్రయిస్తే ఏడాదికి అథమ పక్షం 153 కోట్ల రూపాయలు ఏడాదికి విరాళాలుగా వస్తాయి. ఇవన్నీ కేవలం ఆలయ నిర్మాణాలకు మాత్రమే వాడాలన్నది పథకం ఉద్దేశ్యం. ఇంత భారీ మొత్తాలతో దేశమంతా స్వామివారి ఆలయ నిర్మాణాలు చేపట్టడం అంటే ఎవరైనా శ్లాఘించవలసిందే.
ప్రతిఊరిలో గుడికి స్థలాలు స్థానికంగా విరాళంగా వస్తాయి గనుక, నిర్మించేవి చిన్న ఆలయాలే గనుక.. సగటున 50 లక్షల రూపాయలు వ్యయం అవుతుందని అనుకుంటే, ఒక ఏడాదిలో 300 ఆలయాలు నిర్మించవచ్చు. ‘భక్తకోటి విరాళాలను వెల్లువెత్తిస్తున్నప్పుడు భగవంతుడిని.. భక్తులకు మరింత చేరువ చేయడంలో ఇంతకంటె కావాల్సింది ఏముంటుంది?’.. అని అనుకుంటే.. ఇదంతా ఒక అద్భుతంగా కనిపిస్తుంది.
‘శ్రీవాణి’కే ఎందుకు?
చీకటి బజారులో దేవుడిని అమ్మకానికి పెట్టే దళారీల దురాగతాలకు మంగళం పాడడం అనే ముసుగులో.. ఇలా వ్యవస్థీకృతంగా పదివేలకు వీఐపీ టికెట్లు విక్రయించడాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టలేరు. కానీ, శ్రీవాణి పథకానికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి. టీటీడీ ఆధ్వర్యంలోని అనేకానేక ఇతర పథకాలకు అంతే మొత్తం విరాళంగా ఇచ్చినా.. వీఐపీ దర్శనభాగ్యం కల్పించవచ్చు కదా అనేది సామాన్యులకు కలిగే ప్రశ్న.
టీటీడీ పథకాల్లో మిక్కుటం అయిపోయిన విరాళాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పథకాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో నిత్యాన్నదానం ముఖ్యమైనది. విరాళాల మీద వస్తున్న వడ్డీ డబ్బుతోనే.. రోజూ మూడు పూటలా నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. భోజనశాలలోనే కాకుండా, సంచారశాలలతో శ్రీవారి ప్రసాదం పేరిట తిరుమల గిరుల్లోని అనేక ప్రాంతాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ ఆస్పత్రుల్లో కూడా ఇలాంటి భోజన ప్రసాద భాగ్యం దక్కుతుంది. అలాగే విద్యా వైద్య సేవలు, ధర్మ ప్రచారానికి సంబంధించి అనేక పథకాలూ ఉన్నాయి. అచ్చంగా వీటికి విడివిడిగా దక్కే విరాళాలు చాలినంత ఉండవు. అయితే టీటీడీ మొత్తం ఆదాయంలోంచి వీటికి కేటాయింపులు చేస్తుంటుంది. అన్ని వ్యవస్థలు సక్రమంగా నడిచేలా చూస్తుంటుంది.
ఇప్పుడు ఆ పద్ధతికి తిలోదకాలు ఇచ్చి.. శ్రీవాణి పథకానికి విరాళమిచ్చిన వారికి మాత్రమే వీఐపీ హోదా కట్టబెట్టడం చిత్రంగా కనిపిస్తుంది. దీనివలన తతిమ్మా అన్ని పథకాలకు పైసా రాల్చే భక్తుడు ఉండడు. ప్రతి ఒక్కరూ దీనికోసమే ఎగబడతారు. హుండీ ఆదాయానికి కూడా భారీగా కోత పడుతుంది. హుండీలో పదివేలు, ఆ పై మొత్తం వేయదలచుకున్న భక్తుడు.. (నల్లధనం వేసేవాళ్లు తప్ప) ఆ మొత్తం ఈ పథకానికే చెల్లించి.. వీఐపీ దర్శనాలు దక్కించుకుంటారు. హుండీ ఆదాయం కూడా తగ్గిందంటే… మిగిలిన పథకాలన్నీ ఈసురోమని పోతాయి. నిర్మాణ కార్యకలాపాల్లో నిధులు, కేటాయింపులు దారి మళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. విరాళాలు తగ్గి, హుండీ కానుకలు కూడా తగ్గడం వలన కేటాయింపులు కూడా తగ్గితే.. ఇతర పథకాలన్నీ కుదేలవుతాయి. టీటీడీ ద్వారా విద్య, వైద్యం, ధర్మ ప్రచారం తదితర రంగాల్లో అనల్పమైన సేవ జరుగుతోంది. ధర్మపరిరక్షణ విషయంలో వేర్వేరు మార్గాలను అనుసరిస్తూ.. ఒక సమగ్ర రూపంలో ఉన్న టీటీడీ వ్యవస్థ.. కొంత కాలానికి అనేకానేక కుదుపులకు గురై అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది.
శ్రీవాణితో నష్టమేంటి?
ముందే చెప్పుకున్నట్లు ఏడాదికి 300కు పైగా ఆలయాలు కట్టొచ్చు. ఏడాదిలోగా రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక వేంకటేశ్వరుని ఆలయం కట్టేయొచ్చు. ఆ దామాషాలో కొన్నేళ్లకు దేశం మొత్తం శ్రీవారి గుడులు వచ్చేస్తాయి. అప్పటికీ విరాళాల వెల్లువ ఆగదు. నెమ్మదిగా మండల కేంద్రాలనుంచి పంచాయతీలకు, తర్వాతి దశలో పంచాయతీలనుంచి చిన్న పల్లెలు, దళితవాడలకు విడివిడిగా శ్రీవారి ఆలయాలను నిర్మించడం జరుగుతూ పోతుంది. కొన్నాళ్లకు ప్రతి నాలుగైదు కిలోమీటర్లకు కనిపించే పెట్రోలు బంకుల్లాగా, వేంకటేశ్వరుని గుడులు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆధ్యాత్మిక చింతనతో చూసే వారికి ఇంతకంటె గొప్ప సంగతి ఏముంటుంది? ప్రతిచోటా గుడి ఉంటుంది! ప్రతి చోటా వేంకటేశ్వరుడే! సర్వం శ్రీనివాసం. పైపైన అలాగే అనిపిస్తుంది. కానీ.. అనూహ్యమైన, అవాంఛితమైన పరిణామాలు కూడా పొంచిఉన్నాయి.
ఎక్కడో తమిళనాడులో దక్షిణాన ఒక మూల కుగ్రామంలో ఉండే వేంకటేశ్వరుని నిరుపేద భక్తుడు ఏటా అలవాటుగా వేంకటేశ్వరుని దర్శించాలని అనుకుంటూ ఉంటాడు. కొంతకాలం శ్రమించి, తీరిక చేసుకుని కాలినడకన తిరుమల వచ్చి రోడ్లమీదే పడుకుని, మహాలఘుదర్శనంలో లిప్తపాటు స్వామినిచూసి, తలచినంత హుండీలో సమర్పించుకుని తృప్తిగా తిరిగి వెళ్తాడు. అలాంటి వాడు ఓ ఇరవయ్యేళ్ల తర్వాత ప్రతి ఏడాదీ తిరుమల వరకు రాడు. తమ పల్లెలోనే ఉన్న స్వామిని దర్శించుకుంటూ.. నాలుగైదేళ్లకు ఓసారి ‘కుదిరితే’, తిరుమలకు రావడం అలవాటుగా మార్చుకుంటాడు.
ఓ ఇరవయ్యేళ్ల తర్వాతి పరిస్థితిని ఊహిస్తే.. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గుతుంది. ఆదాయం ఇంకా తగ్గుతుంది. శ్రీవాణికి తప్ప.. అప్పటికి కూడా మరో పథకానికి విరాళంగా దక్కే రూపాయి ఉండదు. తిరుమల క్షేత్రానికి ప్రాధాన్యం తగ్గుతుంది. ఇప్పటికే వేంకటేశ్వరుడిని కోటీశ్వరులు ఎక్కడికక్కడ మార్కెట్ చేసుకుంటూ.. దేశంలో అనేకానేక ఆలయాలు తమవంతుగా కట్టేసుకుంటూ ఉన్నారు. మరి టీటీడీ స్వయంగా లడ్డూప్రసాదాలను.. దేశంలో ప్రతి సమాచారకేంద్రంలోనూ విక్రయించినట్లుగా దేవుడిని కూడా ప్రతి ఊరికీ పంచిపెట్టేస్తే ఇక తిరుమలకు ఎందుకు రావాలి? అప్పుడిక తిరుమల కూడా… మక్కా, జెరూసలెం లాగా.. జీవితకాలంలో ఒకసారి వెళితే చాలు అని హిందూ భక్తులు అనుకునే కేటగిరీలోకి వచ్చేస్తుంది.
ప్రపంచంలోనే ప్రతిరోజూ 70వేలనుంచి లక్ష మంది భక్తులు దర్శించుకునే అసమానమైన పుణ్యక్షేత్రంగా, ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల పైబడిన ఆదాయం ఉన్న అద్వితీయమైన దైవధామంగా కీర్తి గడించిన తిరుమల వెలుగులు మసకబారుతాయి. వాటికన్ సిటీని ఎప్పుడో అధిగమించిన తిరుమల, మళ్లీ రెండో స్థానానికి పడిపోయే రోజులు కూడా దాపురిస్తాయి. ఆదాయం, భక్తుల రాకడ రెండూ అథోముఖం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ.
‘శ్రీవాణి’కి మాత్రమే విరాళాలు అడగడంలో మరో దురాలోచనకు అవకాశం ఉంది. దీనివలన.. విచ్చలవిడిగా కాంట్రాక్టులు యిచ్చేసి నిర్మాణాలు ప్రారంభించవచ్చు సాధారణంగా కొత్త నిర్మాణాలు జరుగుతూ ఉంటే మాత్రమే.. పాలకులు వాటాలు పంచుకుని నిధులు స్వాహా చేసే ప్రమాదం పెరుగుతుంది. కేవలం గుడుల నిర్మాణాలు తప్ప టీటీడీ తతిమ్మా ధార్మిక కార్యక్రమాలను మందగింపజేస్తే.. ప్రజలకు ఇలాంటి అనుమానం కూడా కలుగుతుంది.
ఏం చేయొచ్చు?
ఊరూవాడా ప్రతిచోటా వేంకటేశ్వరస్వామి ఆలయాలు మాత్రమే ఎందుకు నిర్మించాలి. దేశం మొత్తాన్నీ వేంకటేశ్వరీకరించే ప్రయత్నం ఎందుకు? ఇందులో ఏమైనా కుట్ర ఉన్నదా? అని కూడా భయపడే పరిస్థితి ఎదురవుతోంది. నిధులు ఎక్కువైతే… ధర్మపరిరక్షణ అవశ్యం అని భావిస్తే.. అందుకు అనేకమార్గాలున్నాయి.
దేశంలో నిత్య దీపారాధనకు గతిలేని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. టీటీడీ వాటిని దత్తత తీసుకుని.. కొత్త వెలుగు ఇవ్వవచ్చు. శైవాలయాలకు తమ పూచీలేదని భావిస్తే గనుక.. కనీసం దేశవ్యాప్తంగా దీనస్థితిలో ఉండే వైష్ణవాలయాలనైనా బాగు చేయవచ్చు. తద్వారా.. హిందూ ధర్మాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని పరిరక్షించినట్లూ అవుతుంది. అదే సమయంలో తిరుమల ప్రాభవం అనేది సన్నగిల్లకుండా కాపాడినట్లూ ఉంటుంది. తిరుమల ప్రశస్తి గురించి ఆయా ఆలయాల ద్వారా మరింత ప్రచారం చేసుకోవడమూ కుదురుతుంది.
అన్నింటికీ మించి టీటీడీ పాలన చూస్తున్న పెద్దలు మరో అంశం పరిగణించాలి. ఆలయాలు నిర్మించే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇస్తే మాత్రమే వీఐపీ దర్శనం అనడం పెద్ద కుట్ర. ఆ కుట్రకోణాలను ప్రజలు మొత్తం అర్థం చేసుకోకముందే… టీటీడీ వారి ఏ పథకానికైనా పదివేల విరాళం ఇస్తే చాలు, ఆ భక్తుడికి వీఐపీ దర్శన భాగ్యం కల్పించాలి. గుడుల నిర్మాణాలమీద మోజుతో తతిమ్మా పథకాల ద్వారా జరిగే సామాజిక సేవలు, ధర్మ పరిరక్షణకు గండికొట్టడం విజ్ఞత అనిపించుకోదు.
… కె.ఎ. మునిసురేష్ పిళ్లె
(ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకీయం పేజీలో 8 డిసెంబరు 2019 నాడు ప్రచురితం)