Suresh Pillai

న వినుతి.. నా వినతి.. (ముందుమాట)

కూర్చుని తింటూ ఉంటే.. తన తర్వాతి తరాలు గూడా నిమ్మళంగా రోజులు గడిపేయడానికి వెసులుబాటు కల్పించగల ఒక ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని… యిచ్ఛాపూర్వకంగా పాత్రికేయ వ్రతంలోకి ప్రవేశించినవాడు ఎల్లయ్య.  మదరాసులో- పెద్దదిక్కు అయిన మిత్రుడి పత్రికా ప్రెస్సులో ఉద్యోగం, వేర్వేరు పత్రికల స్థాపనలు, మూసివేతలు తర్వాత 1970లో ఆయన స్థాపించిన వారపత్రిక ‘ఆదర్శిని’. రెండున్నరేళ్ల తర్వాత.. ఎల్లయ్య- భారతమ్మ దంపతులకు పుట్టిన ఒకే ఒక్క కొడుకు నేను. ఆ రకంగా తల్లిదండ్రుల ద్వారా నాకున్న ఏకైక తోబుట్టువు ‘ఆదర్శిని’. పత్రికతో బాటే పుట్టాను. అడుగులు వేశాను. పెరిగాను. అమ్మ నాకు అక్షరాలు నేర్పించినప్పుడే.. అవి కేసులో (లెటర్ ప్రెస్ ముద్రణల కాలంలో సీసపు అక్షరాలుండే చెక్కగడుల అరలు) ఎక్కడ ఉంటాయో నాన్న నుంచి తెలుసుకున్నాను. పదాలు రాయడం తెలుసుకున్న వయసునుంచీ.. వాటిని ‘హ్యాండ్ కంపోజింగ్’ చేయడం కూడా నేర్చుకున్నాను. పసితనంలో ఇంట్లో, మురిపెంగా భాష నేర్పినట్టే, ఆదర్శినికి సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ పనిని కూడా నేర్పారు. ఈ ఉపోద్ఘాతం మొత్తం.. నేను ‘జన్మతః జర్నలిస్టు’ను అని చెప్పడానికి!

అయిదారేళ్ల వయసులోనే నాన్ వర్కింగ్ జర్నలిస్టు ట్రెయినీగా నా అడుగులు మొదలైనాయి. ఆ తర్వాత వర్కింగ్ జర్నలిస్టుగా నా జీవితం రూపుదిద్దుకుంది. సీసపుముద్దల అక్షరాల్ని యిత్తడి ‘స్టిక్’లోకి పేర్చే పనిలోంచి.. కాగితమ్మీద నీలిసిరా అక్షరాల్ని కూర్చే పనిలోకి ఎప్పుడు పరిణామం చెందానో ఇదమిత్థంగా చెప్పలేను. గొంగళిపురుగు సీతాకోక చిలుక అయినట్లుగా- ప్రత్యేకంగా ఆ దశను గుర్తించకుండానే.. నా జీవితంలో ఆ పని జరిగిపోయింది. ఆదర్శిని పత్రిక పేజీలు ఒక్కటొక్కటీ పూర్తవుతున్నప్పుడు కాస్త మేటర్  తక్కువైతే అప్పటి అవసరానికి తగ్గట్టు ఏదోటి రాసి అందివ్వడంతో నా రచనల అడుగులు మొదలయ్యాయని మాత్రం చెప్పగలను. సింగిల్ కాలం అవసరమైనప్పుడు కవితలు, అంతకంటె ఎక్కువ అవసరమైనప్పుడు కథలు (గా అప్పటికి నేను భావించినవి) రాయడం అలవాటులా అయిపోయింది. జర్నలిజంతో పాటు కథా రచన కూడా ఎలాంటి ప్రత్యేకశిక్షణ, అభ్యాసమూ లేకుండా ఒక పసితనపు ముచ్చటలాగానే నా జీవితంలోకి చొచ్చుకు వచ్చేసింది. రెండూ నా బతుకుతో విడదీయలేనంతగా పెనవడిపోయాయి.

అక్షరం.. నా ఆసక్తి, యిష్టం! జీవిక, ఉపాధి! జీవితావేశాలనుంచి ఉపశమనం, ఊరట! అక్షరం రాయకుండా ఉండలేను. అదే తెరువు గనుక.. రాయకుండా బతకనూ లేను. కానీ… జర్నలిస్టుగా ఎంత.. రచయితగా ఎంత.. రాస్తున్నాను… అనే తూకంలో సమతుల్యత మాత్రం ఎన్నడో గాడితప్పింది. రచయితగా రాసినప్పుడు గుండెమంట చల్లారుతుంది. దానికి నాలుగంగుళాల కింద ఉండే కడుపులో మంట చల్లారాలంటే జర్నలిస్టుగా రాయాల్సిందే. ఆ వైపు తూకంలో బరువు అనివార్యంగా పెరిగిపోయింది. ఏదేమైనా పత్రికల్లో ముద్రణ అనేది రచనకు ఒక ప్రామాణిక తూకం రాయి! అయితే, ఇతర పత్రికలకు పంపాలనే ధ్యాస కూడా పుట్టకుండా నా తొలిరచనల వేదిక ఆదర్శిని అయింది గనుక.. తోబుట్టువు వంటి అందులో ప్రచురణ విశేషమేమీ కాదని పక్కన పెడితే… నా తొలికథ ‘సేవ బాధ్యత’ ఉదయం వారపత్రికలో 1990 ఫిబ్రవరి 16న ప్రచురితమైంది.

ఈ ముప్ఫయ్యేళ్ల ప్రస్థానంలో రాసిన కథలు యాభైకి మించకపోవడంలో నా తప్పు ఎంత ఉందో తెలియదు. కానీ, బీఎస్సీ చదువుతుండగా, 1991 ఫిబ్రవరి 4 నుంచి మెయిన్‌స్ట్రీమ్ జర్నలిజంలో పడిపోవడం తప్పకుండా ఒక కారణం అని మాత్రం చెప్పగలను. రచనల్లో ఆ మందగమనం నవలల విషయంలోనూ జరిగింది. 1999లో రాసిన మొదటి నవల ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ స్వాతి వారపత్రిక సీరియల్స్ పోటీలో నెగ్గి 2001లో ప్రచురణ అయింది. అదే ఏడాదిలో రెండో నవల ‘పుత్రికా శత్రుః’ కూడా సీరియల్ పోటీలో నెగ్గింది. తర్వాత ఇప్పటిదాకా మరొకటి రాయలేకపోవడానికి కూడా స్పష్టమైన కారణాలు లేవు.

1992లో ఆదర్శిని ప్రత్యేక సంచికలో నేను రాసిన కథను చదివి… ‘శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కథా రచయితలు లేని లోటు నీ వల్ల తీరుతుందని ఆశిస్తున్నా’నంటూ మధురాంతకం రాజారాం గారు అప్పట్లో నాకు రాసిన పోస్టు కార్డు, నా జీవితానికి లభించిన అత్యుత్తమ యోగ్యతాపత్రం. నేర్పడం యిష్టపడే ఆయన నుంచి ప్రత్యక్షంగా  నేర్చుకోగల అవకాశం నాకు దక్కింది. నేను రాసినవి, నేను చదవగా విని,  వాటిలో అక్షర దోషాలు సరిచేయడం దగ్గరినుంచి వస్తువు ఎంపిక, రాసే మెళకువల వరకు చెప్పి నన్ను దిద్దారు. ఆయనకు రుణపడి ఉంటాను.

జర్నలిజంలో పడి రోజూ పేజీల కొద్దీ రాసేస్తున్న రోజుల్లో కలిసినప్పుడు… ‘నాయనా ఏమైనా రాస్తున్నావా’ అని అడిగేవారు. నా జవాబు విని నవ్వి, ‘మీ జర్నలిస్టులు రచయితలుగా చచ్చిపోతారబ్బా’ అనే వారు. ‘మన పరిశీలనలో, ఏదైనా ఒక జీవితపు విచిత్రాన్ని, కథా వస్తువును గుర్తిస్తే దాని గురించి మనలో ఆవేశం పుట్టాల. మనలోనే అది బాగా నలగాల. దాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోవాల.. అప్పుడే కథో కవితో పుడతంది. మీ జర్నలిస్టులు ప్రతిరోజూ రాస్తుంటారబ్బా… మీ ఆవేశం ఆ రాతల్లో ఎక్కడో ఓ చోట బయటకు వచ్చేస్తుంటుంది… ఇక కథలు రాసేది చచ్చిపోతంది’ అనేవారు. ఆయన పరిశీలన, ఒక విధంగా అది నిజమే అనిపించేది. ‘సబ్జెక్టు’ అనిపించే చాలా సంగతులు వార్తా కథనాలకు ‘ఇంట్రో’లుగా బయటకు వచ్చేస్తుండేవి. కానీ జర్నలిజం ద్వారా వ్యక్తం చేయలేని భావాలు లోపల మెలిపెట్టేసినప్పుడు అవి కథలుగానే బయటకు వచ్చాయి. ఏదేమైనా అప్పట్లో రాసింది చాలా తక్కువ.

నా డిఎన్ఏలో జర్నలిజం ఉంది. బుద్ధెరిగిన దగ్గరినుంచీ ఇప్పటిదాకా నేను నేర్చుకుంటూనే ఉన్న సబ్జెక్టు అది. ‘నేర్చుకోవడం’ అనేది చచ్చిపోయేదాకా జీవిత లక్షణంగా ఉండాలని- జర్నలిజం నాకు తెలియజెప్పింది. నా రచనలకు కూడా అదే ఆలంబన. నాలోని జర్నలిస్టు లక్షణాలు, చాలావరకు రచయితను కూడా తీర్చిదిద్దాయి. జర్నలిజం చదివేప్పుడు నేర్చిన మౌలిక పాఠాలన్నీ.. నేను కథారచనకు కూడా, అందుకు తగిన రీతిలో అనువర్తింపజేసుకున్నాను. అందువలన రాత కొంత పరిపుష్టం అయిందని నమ్ముతున్నాను.

==

కథలు రాయడం ఎందుకు? ఏమొస్తుంది? అనే ప్రశ్నలు మిత్రులనుంచి అప్పుడప్పుడూ ఎదురవుతుంటాయి. ఆ సందర్భాల్లో నేను వ్యక్తం చేయలేకపోయినప్పటికీ.. ఆ ప్రశ్నలకు జవాబు నా ఇంగితంలో ఉంది.

నేను స్వార్థపరుణ్ని. కథలో నేనొక ప్రయోజనం గుర్తించాను. ఆ ప్రయోజనాన్ని నేను పొందడానికే  రాస్తున్నాను. ఆ ప్రయోజనం చేజారుతుందనే భయంతో కూడా రాస్తున్నాను. అసలు కథ రాయడం గానీ, చదవడం గానీ ఎందుకు..? అనే తరహా ప్రశ్నలకు ఇది కొంత వివరణ ఇస్తుంది.

ఇవాళ సాహిత్యం, సృజనాత్మకత బహుముఖ రూపంగా ఉంది. ఇదివరకటి కథల విషయానికి వస్తే.. శ్రీపాద వారి కథలు 70-80 పేజీలు ఉంటే, వాటిని చిన్న కథలనే పేర్కొన్నారు. మధురాంతకం రాజారాం గారి కథలు 10-20 పేజీలు ఉండేవి. ‘ఇవి పెద్దవి అయిపోయా’యనే జర్నలిస్టిక్ నిరంకుశత్వం వలన నా చిన్నతనంలోనే సింగిల్ పేజీ, సింగిల్ కాలమ్ కథలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ అన్ని రకాల కథా రూపాలకు ప్రచురణ అనేది ఒక ప్రమాణంగా ఉండిపోయింది. కానీ సాంకేతికత విరాడ్రూపం దాల్చిన తర్వాత రూపం-అనురూపం, వచనం-నిర్వచనం మారిపోయాయి. సృజన బహుముఖం, బహుసరళం అయింది. ప్రచురణ ప్రమాణంగా ఉన్నప్పుడు… మనం రాసినది కనీసం ఒక్కరికైనా (సంపాదకుడికి) నచ్చితేనే అది నలుగురి ఎదుటకు చేరేది. ఇవాళ అంత కష్టం లేదు. ఎవ్వరికీ నచ్చకపోయినా.. మన ఫేస్‌బుక్ వాల్ మీద పోస్టరుగా వేయవచ్చు. మనల్ని ఇముడ్చుకున్న వాట్సప్ గ్రూపులో.. సంధించేయవచ్చు. కొత్త సాంకేతిక విప్లవాలు జీవన మార్గంగా మారిన ఈ రోజుల్లో సృజనాత్మకత విచ్చలవిడి అయిపోయింది. ‘నాన్నా పులి’ కథ- అబద్ధం చెబితే నీ మాటకు విలువ ఉండదు- అనే నీతిని చెబుతుంది. కథను లుప్తం చేసి.. ఆ సందేశం ఇవాళ ‘స్ట్రెయిట్’గా వాట్సప్‌లో వొచ్చేస్తోంది. యిక కథ ఎందుకు?

సోషల్ మీడియా సర్వత్రా రాజ్యమేలుతున్న రోజుల్లో ఇంకా కథ రాయడం ఎందుకు? అనే సందేహం చాలా పెద్దది. ప్రతి ఉదయం వందల వేల మంచి మాటలు, ఉపదేశాలు క్లుప్తంగా మన ‘అరచేతి విధ్వంసం’లోకి వెల్లువెత్తుతుంటాయి. అవన్నీ తెలుసుకుని ఆచరిస్తే ప్రతి మనిషీ మహనీయుడు అయిపోతాడు. కానీ అలా జరగడం లేదు. ఎందుకు?

విలువలు.. విటమిన్ టేబ్లెట్లు కావు. వాట్సప్, ఫేస్‌బుక్‌లలో నీతులు, ఉపదేశాలు.. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించవు! జీవితాల్ని, జీవిత ఘట్టాల్ని మనం దగ్గరినుంచి చూడాలి. వాటితో కలిసి ప్రయాణించాలి. అక్కడి భావోద్వేగాలను ఆకళింపు చేసుకోవాలి. ఆ వేదనలకు స్పందించాలి. అప్పుడు మాత్రమే ఆ జీవితాలు తెలియజెప్పే విలువలు మనలోకి యింకుతాయి. పరిమితమైన మన జీవితంలో మనం పరిశీలించగలిగే జీవితాలు కొద్దిగానే ఉంటాయి. నేర్చుకోవడమూ అంతే కొద్దిగా ఉంటుంది. అయితే, యిలా, మన ఎరికలో లేని జీవితాలను కూడా మనకు పరిచయం చేసే భూమికను కథ నిర్వర్తిస్తుంది. మనం ఎరిగిన జీవితకోణాల్లోనే కథ చెప్పినప్పుడు కూడా మరో రకం సంతృప్తి కలుగుతుంది.

అబద్ధం చెప్పరాదు అనే ఉపదేశం వాట్సప్‌లో వస్తే మనం లైకు కొట్టేసి ఊరుకుంటాం. ఆ నీతిని కూడా అంతటితో కన్వీనియెంట్‌గా మరచిపోతాం. కానీ, ‘నాన్నా పులి’ కథను మనం చిన్నతనంలో వినిఉంటే అలా జరగదు. మన అబద్ధం మనల్నే కబళిస్తుందనే భయం, మన చిత్తంలో నిలిచిపోయి ఉంటుంది. అబద్ధం చెప్పడానికి పూనుకున్న చాలా సందర్భాల్లో అది మనల్ని హెచ్చరిస్తుంటుంది.

కథల్లో రచయిత ఒక ‘విషయం’ చెప్పడానికి  ప్రయత్నిస్తాడు. విషయం చెప్పడం కోసం దానిచుట్టూ చక్కెరపూతలాగా జీవితం అల్లుతాడు. ఆ జీవితంలోకి పాఠకుడిని తీసికెళ్తాడు. ఆ జీవితాల్లో పాఠకుడు తాను ఎరిగిన మనుషుల్ని, కొత్తవారిని కూడా గమనిస్తాడు. వారి భావోద్వేగాలతో మమేకం అయితేనే..  రచయిత చెప్పదలచుకున్న విషయం పాఠకుడి బుర్రలో స్థిరపడుతుంది. కానీ ప్రతి కథకు రచయితే తొలి పాఠకుడు. ఆ కథలోని విలువలకు సార్వజనీనత ఉంటేగనుక మొట్టమొదటగా యింకేది రచయిత లోనికే. కథలు రాయడం వెనుక కారణం, స్వార్థం అదే. గమనించిన, విన్న, చదివిన వాటికి అదనంగా… యిష్టపడిన, విలక్షణమైన విలువలను నాలోకి యింకింపజేసుకోవడానికి నేనెంచుకున్న తోవ రాయడం.

నన్ను నేను దారిలో పెట్టుకోడానికి, అపసవ్య ఆలోచనలు ఉంటే మార్చుకోవడానికి నా కథ నాకు ఉపయోగపడుతుంది. అదే నా స్వార్థం. మరొకరికి కూడా అలాంటి ఉపయోగం కలిగితే, నా స్వార్థానికి అది సార్థకత!

రాయడం అనేది act of ego అంటారు- అమెరికాలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి, రచయితగా కూడా ఖ్యాతిగడించిన విలియం జిన్సర్. ఇది చాలా లోతైన మాట. ఎంత తవ్వితే అంతగా అర్థమయ్యేమాట. నా అనుభవంలో రాయడం- act of self realization కూడా! నేను తెలుసుకుని, కథలో చెబుతున్న ప్రమాణాల నుంచి- నేను ఎంత దూరంలో ఉన్నానో చూసుకుని, నన్ను నేను దిద్దుకోవడం నా బాధ్యత. అది ఇంకా ఎవరినైనా దిద్దగలిగితే ధన్యత.

స్వార్థమూ, ఈగో అన్ని సందర్భాల్లోనూ నేరాలు కావు. కొన్ని సందర్భాల్లో స్వార్థం కోసం మొదలైనదే తర్వాత్తర్వాత సార్వజనీనమూ, సామాజికమూ అవుతుంటుంది. ఝాన్సీ యువరాజుగా తను తీసుకున్న దత్తతను అంగీకరించిఉంటే మణికర్ణిక సంగ్రామం జరిపి ఉండకపోవచ్చు.  మోహన్‌దాస్‌ను రైలుపెట్టెలోంచి గెంటేయకుండా ఉంటే మనమెరిగిన గాంధీ పుట్టిఉండకపోవచ్చు. అలా, నా ‘స్వార్థం, ఈగో’ మరొక్కరికైనా ఉపయోగపడాలని ఆశ.

సాధారణంగా.. ఎక్కడో రోడ్డు ప్రమాదంలో ఓ కుర్రాడు హెల్మెట్ లేనందువల్ల చనిపోతే మనం వార్త చదివి ఊరుకుంటాం. మన స్నేహితుల కుటుంబంలో ఆ దుర్ఘటన జరిగితే.. బాధపడతాం. జాగ్రత్త పడతాం. మన బిడ్డను హెల్మెట్ లేకుండా బయటకు పంపం! మనకు ‘దగ్గరైన’ జీవితాలు, ఘటనలు ప్రభావితం చేసినట్లుగా నీతులు, ఉపదేశాలు మనమీద పనిచేయవు. నా కథల్లోని పాత్రలు మీకు స్నేహితులై, మీ లోపలి వ్యక్తులను పలకరించాలి. ఆప్తమిత్రుల్లాగా మీరు వారిని పరిశీలించాలి. ఆ జీవన పార్శ్వాలు మీ ఆలోచనల్లో నిలవగలిగితే నాకు అంతకంటె ధన్యత మరొకటి లేదు.

==

ఒక జర్నలిస్టుగా నన్ను చూసుకున్నప్పుడు.. తల్లిదండ్రుల ద్వారా నాకు లభించిన తోబుట్టువుగా ప్రస్తావించిన ‘ఆదర్శిని’, ఈ విషయంలో నాకు అమ్మ. ‘ఈనాడు’ నాకు నాన్న. అమ్మ జన్మనిచ్చింది. నాన్న బతకడానికి సరిపడా పని నేర్పాడు. అమ్మ లాలనగా అక్షరాభ్యాసం చేయిస్తే.. నాన్న పరిణతిని తెచ్చిపెట్టి, దృఢంగా తీర్చిదిద్దాడు. దారి తప్పినప్పుడు దండిస్తూ సాన పెట్టాడు.

పాత్రికేయుడు కావడం వల్ల జీవితంలో చాలా చాలా అనుభూతులను, ఉద్వేగాలను, ఆవేదనలను, పరితాపాలను తెలుసుకోగల రుచిగ్రంథులను చంపేసుకునే, జడంగా మారే వేలాదిమందిలో నేనొకణ్ని. అయితే, knowledge is knowing of what we don’t know అన్నట్లుగా, మనకు ఏం లేదో తెలిస్తే, ఆమేర జాగ్రత్తగా ఉంటాం! ‘రుచిగ్రంథులు చచ్చిపోయా’యనే స్పృహ ఉండడం వల్ల.. ప్రతిసారీ, ప్రయత్నపూర్వకంగా పైవాటిని తెలుసుకుంటూ ఉంటాను. లేకపోతే కథలు రాయడం కాదు కదా.. చదవడం కూడా జరగదు.

జర్నలిస్టు కావడం వల్ల.. జీవితంలో పరిమితులు ఏమిటో తెలుసుకుని నడుచుకునే కొన్ని లక్షణాలు అలవడ్డాయి. మాధ్యమాన్ని బట్టి వర్తించే పరిమితుల్ని మనం గౌరవించినప్పుడే.. అది నలుగురి ఎదుటకు వెళ్తుంది. జర్నలిస్టులు తమకు తెలిసిన ప్రతి నిజం.. రాతలో చూపించలేరు. చూపించగలరని ఎవరైనా అనుకుంటే భ్రమ. ‘అధికారికంగా’ తెలిసినది మాత్రమే పత్రికల్లో రాయగలరు. అది నిజమై ఉండాలనే నిబంధన లేదు. బతుకుతెరువు కోసం పదేపదే అలా రాసిన తర్వాత, ఈ రాతబతుకు మీద విరక్తి పుడుతుంది. విరక్తులను ఉప్పు పాతరేసి రాసుకుంటూనే బతకాలి. అలా వైరుధ్యాల నడుమ కడుపు మండేటప్పుడు రాయడానికి ఇంకో మాధ్యమం కావాలనిపిస్తుంది. పదిలైన్లలో చల్లబడిపోయేదైతే కవిత, కాదనుకుంటే కథ. నాకు అలా అలవాటయ్యాయి.

కథ రాసే పద్ధతి తెలిసిన తర్వాత… మన మాధ్యమంలో రాయలేని విషయాలు మాత్రమే కాదు. ఇతర విషయాలు కూడా రాయడానికి వెసులుబాటు చిక్కింది. తొలిరోజుల్లో, రాయడం కోసం ఒక కథ అల్లుకుని రాశాను. విసుగేసి మానేశాను. తర్వాత.. ఏదో ఒక అంశం నలుగురికీ తెలిస్తే బాగుంటుందని అనిపించినప్పుడు.. దాని  చుట్టూ కథ అల్లుకున్నాను. ఆ తర్వాత.. చాలాకాలానికి కథలు ఎక్కడుంటాయో, వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా చెప్పాలో, ఎందుకు చెప్పాలో.. రవ్వంత బోధపడింది. వడి పెరిగింది.

ముప్ఫయ్యేళ్లనుంచి రాస్తుంటే పుస్తకం వేయకపోవడమేంటని చాలా మంది మిత్రులు.. చాలా కాలంగా మందలించిన తర్వాత.. ఇప్పుడీ ప్రయత్నం! సావధానంగా కథలను ఆస్వాదించగలరని ఆశిస్తున్నాను.

… ప్రేమతో..

సురేష్ పిళ్లె

8 డిసెంబరు 2019, హైదరాబాదు


Posted

in

, ,

by

Comments

Leave a Reply