Your cart is currently empty!

శీలా వీర్రాజు పురస్కార సభలో ధన్యవాద ప్రసంగం
పెద్దలందరికీ నమస్సులు.
ఎంతో గౌరవప్రదమైన శీలా వీర్రాజు కథానికా పురస్కారాన్ని అందుకుంటున్నందుకు శీలా సుభ్రదా దేవి గారికి, పెద్దలకు కృతజ్ఞతలు.
2023లో ప్రచురించిన నా మూడో కథా సంపుటి గారడీవాడుకు లభించిన నాలుగో అవార్డు ఇది. గతంలో లభించిన మూడు కూడా సంపుటులకు నిర్వహించిన పోటీలకు నేనుగా పంపితే దక్కినవి. కానీ.. ఇది ప్రత్యేకమైనది. నన్ను ఎంచుకుని, వరించిన అదృష్టం ఈ శీలావీ పురస్కారం.
==
ఇవాళ ఈ పురస్కారానికి అర్హుడిగా నన్ను నిలబెట్టిన… నా మూడో కథా సంపుటి టైటిల్ కథ ‘గారడీవాడు’ గురించి రెండు మాటలు చెబుతాను.
క్రీడార్థం సృజసి ప్రపంచం క్రీడా మృగా తే జనాః
యత్కర్మాచరితం మయా ప్రీత్యై భవత్యేవ తత్
శంకరాచార్యుల వారి శివానందలహరిలో ఈ శ్లోకం ఉంటుంది.
శంకరాచార్యుల వారి దృష్టికోణంలో.. మహాదేవుడు ఆడుకోవడం కోసం సృష్టించినదే ఈ ప్రపంచం. ఇక్కడి మనుషులందరూ కూడా- అంటే మనం అంతా- ఆయన ఆటబొమ్మలు. నేను ఏ పని చేసినా అది నీ వినోదం కోసం చేస్తున్నది కాబట్టి.. దానివల్ల రాగల పాప పుణ్యాలతో నాకు సంబంధం లేదు.. అనేది శంకరాచార్యుల వారి మాట.
ఈ శ్లోకాన్ని ఉచ్ఛరిస్తూ ‘‘నీ ఆట నాతో ఆడిస్తన్నావు.. నీ బరువు నాతో మోయిస్తన్నావు.. చిక్కులేమీ రాకుండా కాసుకో సామీ’’
..అనేది చంద్రసిద్ధార్థ గారి దర్శకత్వంలో వచ్చిన ఆటగదరా శివ అనే చిత్రం కోసం నేను రాసిన డైలాగు ఇది.
గారడీవాడంటే దేవుడే. మనుషుల్ని బొమ్మల్లా ఆడించేది ఆయనే. ఇది శంకరాచార్యుల కాలం నాటి పరిస్థితి.
దేవుడు మనుషుల్ని ఆడించే రోజులు పోయాయి. ఇప్పుడు దేవుణ్ని ఆడించే గారడీవాడుగా మనిషే కొత్త అవతారం ఎత్తుతున్నాడు.
ఎవడు పెద్ద దేవుడు? ఎవడు చిన్న దేవుడు? ఇవాళ్టి రోజుల్లో డిసైడ్ చేస్తున్నవాడే గారడీవాడు!
చిన్న దేవుడిని పెద్ద దేవుడిగా చేయడం ఎలా? అనే కనికట్టు విద్య తెలిసిన వాడే గారడీవాడు!
పెద్ద రేటుకు టికెటు పెడతాడు.. హఠాత్తుగా చిన్నదేవుడు పెద్దదేవుడైపోతాడు. లేదా సెలబ్రిటీలకు ఒక రెమ్యునరేషన్ ధర మాట్లాడి ఆ గుడికి తీసుకువచ్చి స్పెషల్ పూజలు చేయిస్తాడు. దెబ్బతో ఆ దేవుడు పెద్ద దేవుడైపోతాడు. అంతే కాదు. చిన్నదేవుడి చుట్టూతా.. ఓ వంద కోట్లు పెట్టి.. కళ్లు చెదిరే సెట్టింగుల్లాంటి పెద్ద గుడి కట్టించేస్తే కూడా పెద్దదేవుడిని తయారు చేయొచ్చునని నవతరం గారడీవాడుకు తెలుసు. అలాంటి వాడి గురించిన కథ ఇది.
ఈ కథతో నాకో భిన్నమైన అనుభవం ఉంది. ఒక చిన్నపత్రిక నిర్వహించిన పోటీకి పంపితే.. సాధారణ ప్రచురణకు కూడా సెలక్టు కాలేదు. అలాగే దాచుకున్నాను. ఆ తర్వాత రెండేళ్లకు అమెరికాలోని నాటా నిర్వహించిన మరో పోటీలకు పంపితే మొదటి బహుమతి వచ్చింది. ఈ గారడీవాడు చేసిన గారడీనే.. ఇవాళ నేను ఇలా మీ ముందు మాట్లాడగల స్థితిలో.. ఎంతో గౌరవప్రదంగా చెప్పుకోగలిగే శీలా వీర్రాజు కథానికా పురస్కారానికి నన్ను అర్హుడిగా తయారుచేసింది. కాబట్టి శంకరాచార్యుల వారి గారడీవాడుకు, ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన అమ్మ సుభద్రా దేవి గారికి నమస్సులు.
==
ఎవరైనా కథలను ఇష్టంగా చదివే పాఠకులు నన్ను గుర్తించగలిగే స్థాయి కథలు కొన్ని రాయగలిగాననే తృప్తి కన్నా.. నా కథా ప్రస్థానంలో గర్వకారణమైన అంశం మరొకటి ఉంది. నేను మధురాంతకం రాజారాం గారి శిష్యుడిని. కథల బాటలో ఆయన నన్ను దిద్దారు. నా గురువు రాజారాం గారికి శీలా వీర్రాజు గారు ఎంతో ఆత్మీయులు. సన్నిహితులు. రాజారాం గారి కథలతో పరిచయం ఉన్న వారికి.. ఆయన తాను ఎరిగిన, ఎదురుపడిన ప్రతి వ్యక్తినీ, ప్రతి సంఘటననీ కథగా తీర్చిదిద్దగల నిపుణులు అని అర్థమవుతుంది. అలా వందల జీవితాలను కథలుగా పదిలపరచిన రాజారాం గారు.. శీలా వీర్రాజు గారి ఒక జీవిత పార్శ్వం గురించి కూడా కథ రాశారు. 1983లో ఆంధ్రసచిత్రవారపత్రిక వజ్రోత్సవ సంచికలో వచ్చిందా కథ. దాని పేరు ‘ఆశ్రయం’. ఆ కథ శీలా వీర్రాజు గారి జీవిత భాగాన్ని చెప్పడం మాత్రమే కాదు.. ఆయన వ్యక్తిత్వాన్ని కూడా మనకు కళ్లకు కడుతుంది. అందులోని పాత్రల పేర్లు కూడా నిజజీవిత పాత్రలు స్ఫురించేలాగానే రాజారాం గారు నామకరణం చేసి ఆ కథను నడిపించారు.
ఒక చిన్న ప్రభుత్వోద్యోగంలో ఉంటూ.. ప్రవృత్తిరీత్యా చిత్రకారుడు గనుక.. పుస్తకాలకు ముఖచిత్రాలు చేసి యిస్తూ, లోగోలు, బొమ్మలు గీస్తూ ఉండే ఒక చిత్రకారుడి కథ ఇది. కథానాయకుడైన చిత్రకారుడి పేరు భవానీ శంకరం– అంటే వీర్రాజు గారు! ఆయన భార్య పేరు సుమిత్ర– అంటే సుభద్ర గారు. కథను చెబుతున్న వ్యక్తి పేరు రాజశేఖరం– అంటే రాజారాం గారు. కథప్రకారం.. సొంత ఇల్లు అనేది వీర్రాజు గారి కల. హైదరాబాదు నగరజీవితంలో దుర్భరమైన ఇరుకిళ్లలోనే ఉంటూ.. ఆప్తులకు ఆత్మీయమైన ఆతిథ్యం యిస్తూ బతుకుతుంటాడాయన. వీర్రాజు గారి గురించి ఇలా అంటారు.
ఆ కథలోంచి కొన్ని వాక్యాలు చదువుతాను.
‘‘చిత్రకారుడుగా అతనికి పేరుంది. కానీ ‘పేరు’ తిండి పెడుతుందా? అందుకోసం అతడొక ప్రభుత్వ కార్యాలయంలో యుడిసిగా పనిచేస్తున్నారు. కానీ అతడి ఆరోప్రాణం చిత్రకళ. అతడి దౌర్బల్యం ఎవరే ఆబ్లిగేషన్ తో వెళ్లినా ‘కాదు’ అనకపోవడం.’ ‘కుంచెతో అతడు చేయగల ఇంద్రజాలాలు చాలా ఉన్నాయి. చేసిన పనికి ఎవరైనా ఏదైనా ఇస్తే పుచ్చుకోడం తప్పితే నిక్కచ్చిగా అడిగి పుచ్చుకునే కూసువిద్య మాత్రం అతడికి ఒంటబట్టలేదు. ఫలితమేమిటంటారేమో.. ఇదిగో, హైద్రాబాదుకు వచ్చి చేరి పాతికేళ్లయినా యింకా అద్దె యింట్లోనే వుండడం’’
ఇది వీర్రాజు గారి గురించిన సత్యం. వీర్రాజు గారితో పరిచయం ఉన్న చాలా మంది పెద్దలకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇక్కడే మరో సంగతి చెబుతారు రచయిత
‘‘మనుషులతో అనుబంధాలు పెంచుకోడమంటే, కొందరి కదొక బెడదగా వుంటుంది. మరి కొందరు స్నేహాన్ని గొప్ప సంపదనుకుంటారు. భవానీ శంకరంది రెండో కేటగిరీ.’’
స్నేహితులకు ఆయన ఇచ్చే విలువ ఇది. అంతే కాదు. ఆ దంపతుల ఆతిథ్యం గురించి మరో మాట చెబుతాడు.
‘‘మృష్టాన్నం పెట్టడంతో సరిపెట్టుకోకుండా వచ్చిన వాళ్లకా దంపతులు పడకలు ఏర్పాటు చేయడముందే, అది చూచి తీరవలసిన దృశ్యం. అతిథుల అవసరాలన్నీ గమనించిన తర్వాత ఆ యింటి గృహిణి సిరిచాప పరచుకుని తన యిద్దరు పిల్లలతో బాటుగా వంటింట్లో నిద్రపోతుంది. చుట్టూరా పుస్తకాల బీరువాలున్న పెంకుటింటి గదిలో ఈజీచేర్ వేసుకుని, భవానీశంకరం అందులోనే నిద్రపోతాడు.’’
అలాంటి వ్యక్తి మోసానికి గురవుతాడు. ఆయన చిత్రకళతో వ్యాపారం చేద్దామనే ప్రతిపాదనతో వచ్చిన మిత్రుడు ఉద్యోగానికి సెలవు పెట్టించి మరీ అరవ చాకిరీ చేయిస్తాడు. చివరికి భాగస్వామ్య వ్యాపారం అనుకుంటే.. దినకూలీ కూడా గిట్టదు సరికదా.. బోనస్ గా ఆరోగ్యం చెడుతుంది. అంతటితో ఆ ప్రయత్నం వదిలించుకుని.. తిరిగి ఉద్యోగంలో చేరుతాడు ఆయన. పెరిగే అద్దెలను భరించలేక ఉన్న ఇల్లు కూడా ఖాళీ చేసి ఎక్కడో సుదూరంగా మరో అద్దె ఇంటికి మారుతాడు.
సొంత ఇంటికోసం ఆయన వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది.
‘‘నా భార్య దగ్గర పది సవరన్ల బంగారముంది. దాన్ని అమ్మేస్తే ఎంత లేదన్నా పన్నెండు వేలొస్తుంది..’’ అనే ఆ ప్లాన్ తో పాటు అప్పులు పుట్టించగల ఆలోచనలు కూడా ఉంటాయి. నిజానికి ఈ కథ వచ్చిన రెండేళ్ల తరువాత ఈ ప్రణాళిక ప్రకారమే నగలు తాకట్టు పెట్టడం, సుభద్రాదేవి గారు కూడా ఉద్యోగంలో చేరడం వల్ల సమకూరిన ఆధరవుతోనే ఆయన సొంత ఇంటి కల తీర్చుకున్నారు.
కథ ముగిసే సమయానికి అనుకోకుండా రవీంద్రభారతిలోనే ఆ ఇద్దరు మిత్రులూ తారసపడతారు. నగరంలో ఇళ్ల అద్దెలు భరించలేక దూరంగా చిన్న ఇల్లు తీసుకున్న వైనం ఆ చిత్రకారుడు.. రచయితకు వివరిస్తాడు. సొంత ఇంటి కల తీరలేకపోయిన దుర్బల స్థితి, వంచనకు గురైన వేదన అన్నీ చెప్పుకుంటాడు. ‘వేరే అద్దె ఇల్లు దొరికింది లెండి’ అంటూ, తన భారం మొత్తం పంచుకున్న తరువాత, తన కొత్త అద్దె ఇల్లు నగరానికి చాలా దూరం అని బాధపడుతూ శీలా వీర్రాజుగారి ఓ మాట అంటాడు. ‘ఏమండీ రాజశేఖరంగారూ.. మీరిక మా యింటికి రాలేరా?’
ఆ చిత్రకారుడి కళ్లు చెమ్మగిల్లినదీ లేనిదీ తాను చూడలేదని ఆ చిమ్మచీకట్లో తనకు కనిపించలేదని అంటాడు రచయిత.
==
శీలా వీర్రాజు గారు.. గొప్ప రచయిత, కవి, నవలాకారుడు, చిత్రకారుడు.. యివన్నీ ఒక ఎత్తు. తనే పుట్టెడు కష్టాలు అనుభవిస్తూ.. ఆత్మీయులకు అందుబాటులో ఉండి ఆతిథ్యం ఇవ్వగల చోటులో యిల్లు తీసుకోలేకపోతున్నానే.. అని బాధపడడం- రాజారాం గారి వ్యక్తీకరణలో- శీలా వీర్రాజు గారి వ్యక్తిత్వం.
సాహిత్యంలో, చిత్రకళా రంగంలో దక్కించుకున్న కీర్తిని మించిన సహృదయుడు, ఆప్తజన వత్సలుడు.. శీలా వీర్రాజు గారి పేరిట ఈ పురస్కారాన్ని అందుకోవడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. అందుకు సుభద్రాదేవి గారికి మరోమారు కృతజ్ఞతలు.
==
ఇంకొక విషయం చెప్పాలి.
అంగుష్ఠమాత్రుడు అయినా సరే.. ఆకాశంతో పోల్చుకునే తృప్తి పడుతుంటాడు.
అలా ఈ ప్రత్యేకమైన సందర్భంలో శీలా వీర్రాజు గారితో నాకు కొన్ని పోలికలు ఉన్నాయని కూడా చెప్పుకోవాలని ముచ్చటగా ఉంది.
కథలు, కవిత్వం, నవలలు సార్ అంత విస్తృతంగా కాకపోయినా నేను కూడా ఈ మూడు ప్రక్రియలు కూడా రాశాను. జర్నలిస్టును కాబట్టి.. సంపాదకీయ కథనాలు కూడా మునివాక్యం అనే సంపుటిగా వచ్చింది. పొలిటికల్ సెటైర్లు కూడా ఓ సంపుటిగా తేవాల్సి ఉంది.
కాకపోతే.. వీర్రాజు గారితో పోల్చుకోవడానికి ఇవి మాత్రమే నా అర్హతలు కాదు. నేను బొమ్మలు కూడా గీస్తాను. బొమ్మలు గీయడం నాకు మోజు తప్ప పరిణతి లేదు. ప్రావీణ్యం కాదు కదా.. ప్రవేశం కూడా చెప్పుకోదగ్గంత లేదు. కానీ బొమ్మలు గీయాలనే మోజు. నా రెండో నవలకు కవర్ పేజీ బొమ్మ నేనే గీసుకున్నాను. నా కవిత్వ సంపుటిలో.. మొత్తం 42 కవితలకు బొమ్మలు నేనే వేసుకున్నాను. కొందరు ఇతర రచయితల పుస్తకాలకు కూడా కవర్ బొమ్మలు గీశాను. ఈ విద్య నాకు పూర్తిగా అబ్బలేదు గనుక.. నేను బొమ్మలు గీస్తానని.. చూశారా ఈ పుస్తకంలో బొమ్మలు నేనే గీశానని పదేపదే చెప్పుకుంటూ ఉంటాను. కానీ శీలా వీర్రాజు గారితో పోల్చుకోవడానికి ఇది కూడా కారణం కాదు. ఈ మాత్రం అన్నీ నేర్చిన వాళ్లు చాలా మందే ఉంటారు.
కానీ లోగోలు, శీర్షికలు ఇండియన్ ఇంకుతో రాసి.. వాటిని బ్లాకులుగా తయారు చేయించే కాలం నుంచి వీర్రాజుగారు ప్రఖ్యాత చిత్రకారులు ఆ పనిచేసేవారు. నేను కూడా ప్రింటింగ్ ఇండస్ట్రీ బ్లాకులతో ముద్రణ జరిగే రోజుల్లో లోగోలు, శీర్షికలు డిజైన్ చేసేవాడిని. వాటిని బ్లాకులు చేయించి ప్రింటింగ్ లో వాడే వాళ్లం. బ్లాకులు అంటేనే తెలియని ఇవాళ్టి ప్రపంచంలో.. ఆ విద్యలో కూడా ప్రవేశం ఉన్న వాడిగా.. వీర్రాజు గారితో పోల్చుకోవడానికి సాహసిస్తున్నాను. ఆయన పేరిట అవార్డు దక్కిన తీరులోనే.. ఆయన స్నేహశీలత, వ్యక్తిత్వంలో సహస్రాంశమైనా దక్కాలని కూడా కోరుకుంటున్నాను.
==
నేను రాసిన వితండం మామ కథలోంచి రెండు వాక్యాలు ప్రస్తావించి ముగిస్తాను.
యేం కావాలని ఆసె పడాల
యేం బావుకున్నామని మిడిసిపడాల
యేం వుండాదని జాగర్త పడాల
యేం పోతందని బయపడాల
యింతటి నిమ్మళమైన జీవితం చచ్చిపోయేలోగా కొన్నాళ్లయినా బతకాలనేది నా కల.
థాంక్యూ.
Leave a Reply
You must be logged in to post a comment.