Your cart is currently empty!

చూపున్న కర్ర!
నేను అంధుడినని ప్రపంచానికి చాటింపు వేస్తూ..
‘వైట్ కేన్’ లాగా నిన్ను చెంత ఉంచుకునే కదా..
ఇన్నాళ్లూ ప్రతి అడుగూ వేశాను!
కుదిరినంత ప్రపంచం తిరిగాను!!
నా దారి
కంటకావృతమో.. గోతుల మయమో..
దుర్గమమో.. దుస్సహమో..
విషసర్ప భూషితమో.. కించిత్ సాహసోపేతమో..
నువ్వందించే హెచ్చరికలను బట్టే కదా..
నువ్వు సంకేతించే జాగరూకతలను అనుసరించే కదా..
నేను ప్రతిసారీ, ప్రతి ప్రస్థానంలోనూ..
మనగలుగుతూ, నెగ్గుతూ వచ్చాను!
నువ్వు నా వైట్ కేన్ వి!
నా చూపువి. నా నేర్పువి.
నా అంధత్వానికి, నా అజ్ఞానానికి,
జమిలిగా తొడిగిన రక్షణ కవచానివి!
నాలోని ధిక్కారాల్ని
నియంత్రిస్తూ వచ్చిన విరుగుడు మంత్రానివి!
నాలోని దుర్మార్గాల్ని
లుప్తం చేస్తూ పెంచిన విలోమ సూత్రానివి!
నన్ను, నా దౌర్బల్యాల నుంచి
సదా కాచుకున్న, నా ‘చూపున్న కర్ర’ వి!
==
అంధుడికి దారిచూపించడమే
అపాయాల నుంచి కాపాడడమే
ఆ యొక్క పరమలక్ష్యం అయినప్పుడు..
‘వైట్ కేన్’ విశ్రాంతి తీసుకుంటుందా.. ఎక్కడైనా?
ఇంత నిర్దయాత్మకమైన నిర్ణయానికి ఎలా వచ్చావు?
నా గుడ్డి నడకను నిలకడగా తీర్చిన
వెలిగించని కాంతిరేఖ..
లిప్తపాటులో ఎలా మలిగింది?
‘వైట్ కేన్’ నన్ను విడచిపెట్టినంత మాత్రాన
అంధత్వం మారిపోతుందా? పారిపోతుందా?
యిప్పుడిప్పుడే కదా..
చివరి అంకంలో.. తడబడడం నేర్చుకుంటున్నాను!
ప్రతి తడబాటులోనూ నిన్ను తలచుకుంటున్నాను!
తలపుల తోడుగానే నిలబడుతున్నాను!
‘నేను పోగొట్టుకున్నా’ అనుకుంటున్న చూపున్న కర్ర..
వెన్నంటి ఉందనే నమ్మకమే కదా నిలబెడుతున్నది!
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
09 సెప్టెంబరు 2025
(వైట్ కేన్ : అంధులు వాడే ఎరుపు, తెలుపుల మడతల చేతికర్ర.)
(అమ్మ నామీద కోపం చేసుకుని ఇవాళ్టికి ఏడాది)
Posted
in
by
Leave a Reply
You must be logged in to post a comment.