‘లూప్’

38

ఇరులు మురిపిస్తాయి!

కనులు బరువౌతాయి!

వెనక, అంతర్ కుహరాల్లో

జలసంద్రాలు పోటెత్తకుండానే ఆవిరైపోతుంటాయి!!

తట్టుకోగలిగే గట్టు లేదు మరి!!

 

దొంతరల్లోంచి ఒళ్లు విరుచుకుంటూ

గమనాల కత్తులు పదును సరిజూసుకుంటాయి

 

ఆ అగాథాల్లోకి తొంగిచూసినప్పుడెల్లా

వికృతమైన అందం కనిపిస్తుంది-

దాచుకోలేని పాత మొహంలో!

 

మోహం ఎంత పని చేసింది చెప్మా?

ప్రతిరోజూ ఆత్మహననం!

 

నడిపగలే, తెల్లార్చడం…

బండి నడవడం కోసమే బతకడం…

సంజె గుంకగానే మళ్లీ చావడం…

ఆత్మని గూటిలో దాచేసి అడుగులు వేయడం…

అనల్పంగా శ్రమించి, అక్షరంగా రమించి,

ఆకలి తీర్చుకోవడం!

 

ఆత్మహననాలకీ, పరాశ్రయ స్తోత్రాలకీ,

ఆత్మౌద్ధత్యానికీ, అథమాదేశ పరాభవాలకీ,

గతిలేని నవ్వులు తగిలించుకున్న వదనాల్తో

అలజ్జగా అలవాటు పడిపోవడం!

 

కనుల ముందున్న ప్రతిదీ

బుర్రలోకి జుర్రుకోవాలనే పేరాశ!

కొమ్ములు మొలవనంత వరకూ కూలీకి…

చేతులెన్ని పుట్టుకొచ్చినా.. లాభమే!

అవతలి ధీమా దయపెట్టే అనుమతుల దిలాసా!

 

వెలుగుకు వెలి తప్పదు!

వెలకట్టలేనంత వెలయాలి బతుకు!

అంతా తుడిచేయాలనే…

వెలుగులోంచి వెలుగులోకే పరుగెత్తాలనే దురాశ!

ఈలోగా-

జీవితం ‘లూప్’లో ప్లే అవుతుంటుంది…

అయిపోయిందనుకుంటే మళ్లీ మొదలవుతుంది!

 

ఇరులు మురిపిస్తాయి…

కనులు బరువౌతాయి…

 

… కె.ఎ. మునిసురేష్ పిళ్లె

16-8-2019
(పాతికేళ్లు పూర్తయ్యాయని గుర్తు చేసిన ఆప్తుడు బెహరా శ్రీనివాసరావుకు)