సీన్ 1 ఏ:
‘‘మామా ఏంది మందల. మొన్నే గద, ఫోన్జేసి ఊళ్లోవాళ్ల కతలన్నీ గంటసేపు జెప్పినావు. మళ్లీ జేశావేంది’’
‘‘ఈపొద్దు పనిబడి చేసినాన్లేబ్బా’’
‘‘ఏందిరా? మనోళ్లదేమైనా శుభకార్యమా’’
‘‘మన చుక్కలనిడిగల్లు శీనుగాడు గుర్తుండాడా.. అయిస్కూల్లో దినామ్మూ మనకి వోళ్ల తోటలోంచి జాంపండ్లు తెచ్చిచ్చే వోడు.’’
‘‘ఎందుకు గుర్తులేడ్రా నాయనా! అయి మామూలు జాంపండ్లా. రాయిబెట్టి పగలగొడితే, రంగుజూస్తే రోజా పూలు, రుచి జూస్తే చక్కెర గుండ్లు’’
‘‘వోడికి నిండా జబ్బు చేసిందిరా.. రుయాకిబోతే మా వల్లగాదు మదరాసు బొమ్మన్నారు.’’
‘‘ఆహా’’
‘‘అపోలోలో యేసినాం. యేందో మన ఖర్మజాలక నా నోరుదిరగని ఆపరేషనేందో జెయ్యాలంట. పదిలచ్చలవతాదన్నారంట’’
‘‘వూ’’
‘‘తలా కొంచిం యేసుకుందాం అనుకున్నాం. నిన్న మన స్కూలు గ్రూపులో పెట్టినాం.. కొందరు అప్పుడే యేస్తన్నారు గూడా.. నువ్వు గ్రూపులో జూడవు గదా అని ఫోన్ చేస్తాండా.’’
‘‘యే మాత్తరం’’
‘‘మనోళ్లేమాత్తరం లే. బుద్ది పుట్టినోళ్లు వెయ్యో రెండు వేలో. మహా అయితే అయిదు. దుబాయిలో మాబూబాసా మాత్తరం ఓ లచ్చ పంపిస్తాడంట’’
‘‘వోడితో మనకి సాపత్యం యేందిలేరా నాయినా. వోడు షేకుల దుడ్లు దండిగానే దొబ్బతాండాడు. నేనుగూడా ఓ అయిదిస్తాలే గానీ..’’
‘‘ఓర్నీ.. నీ రేంజికి బాగుండదు మామా. లచ్చ గాపోతే దానెమ్మాబడవా, ఓ యాబయ్యయినా’’
‘‘నువ్వు ఆపరా నాయినా.. అయిద్రాబాదులో రియలెస్టేటు, చిల్లరమల్లర యాపారాలూ అంటే, నేనేమైనా కోట్లు కుమ్మేస్తండాననుకున్నావేమో. అంత సన్నివేశం లేదమ్మా.’’
‘‘అట్టంటే ఎట్టమావా.. తలా ఒక బుజమిస్తేనే పాడె లేస్తాది. తలా ఒక చెయ్యేస్తేనే బతుకు నిలస్తాది’’
‘‘రేయ్.. రేప్పొద్దున్నే స్కూలు గ్రూపులో బెట్టుకో. అందురూ లైకులు కొడతారు. పన్లేనోళ్లు షేర్లు గూడా గొడతారు. వేరే కాల్ వొస్తండాది నువ్వు పెట్టేయ్’’
ప్రతివాడికీ వెటకారం అయిపోయింది, అయ్యో పాపం.. కొంచెం సానుభూతి చూపించు అంటూ డబ్బు అడగడం. అయితే ఆస్పత్రి కాకపోతే స్కూలు ఫీజులు, కారణాలు సవాలక్ష ఉంటాయి వీళ్ల దగ్గర! యింకోసారి వీడిది రిపీట్ చేశాడంటే.. వీడి నెంబరు కూడా కాంటాక్ట్స్ లోంచి డిలీట్ చేసేయాలి!
సీన్ 1 బి:
‘‘సార్’’
‘‘చెప్పు బ్రదర్’’
‘‘లాస్ట్ టైం మీరు మిస్సయ్యారు. నెక్ట్స్ మంత్ సెకండ్ వీకెండ్ మిస్ చేయద్దు ప్లీజ్’’
‘‘నీ పిలుపే ఒక ఆర్డర్ బ్రదర్, ప్లీజ్ కూడానా! ఏమైనా స్పెషలా’’
‘‘మరీ మీబోటి వాళ్లకు స్పెషల్ కాదనుకోండి. మనోళ్లు తక్కువేగానీ, ఫామ్ హౌస్ మొత్తం తీసుకున్నా వేరే డిస్టర్బెన్స్ లేకుండా. దిసీజ్ బ్లూ పార్టీ..’’
‘‘ఆ?’’
‘‘ఓన్లీ బ్లూ.. బ్లూ లేబుల్’’
‘‘రేటెక్కువేమోనే..’’
‘‘ఫుల్లు పాతిక’’
‘‘లీటరు బాటిలేనా?’’
‘‘పన్నెండు పెగ్గుల్దే’’
‘‘ఎన్ని పెడుతున్నావు బ్రదర్?’’