‘లిప్ కిస్’
అందులో అంత రొమాంటిక్ ఫీల్ ఉంటుందని నాకు తెలీదు.
గాఢంగా హత్తుకున్నాడు. వంటిమీద, ఆ క్షణంలో, నూలుపోగైనా లేని నన్ను! అలాగని నాలుగు పెదవుల్నీ ఒక్కటిగా చేసేసి.. ఇహం మరచిపోయేంత అహంగా చుంబించనూ లేదు! నా పెదవిని తన పంటితో దొరకబుచ్చుకుని బలంగా అల్లరిపెట్టనూ లేదు. చెప్పాకదా.. ఆల్రెడీ నన్ను హత్తుకునే ఉన్నాడు. ఎలా..? ఓ నిండైన పూలగుత్తి చేజారుతోంటే పొదవుకున్నట్టుగా. కాసింత గట్టిగా పట్టుకుంటే పూలు ఎక్కడ నలిగిపోతాయో అని బెంగ పడేంతగా.. సుతారంగా పొదవుకున్నాడు. రాతిరంతా పుష్ప పరాగాలతో సరాగాలలో రమించి.. చీకటి పారిపోయే వేళకి.. ముచ్చట జారిపోయే వేళకి.. నీటిబిందువుగా ఘనీభవించి సేదతీరుతూండే మంచు ముత్యాన్ని.. స్పృశించడానికి మొగమాటపడే తొలి లేత కిరణంలా ఆ ముద్దు పెట్టాడు. పెదవులూ పెదవులూ అంటనట్టుగా అంటి! ముద్దు పెట్టడంలోని ఆ మధురిమను ఇతర ఇంద్రియాలేవీ దారిమళ్లించకుండా.. మైమరపుకు అడ్డం రాకుండా.. వీనులకు అదృశ్య తెరలు దించేసి, కనుల రెప్పలను అడుగంటా వాల్చేసి, జిహ్వను లుప్తం చేసి, శ్వాసను బిగదీసి.. యావత్ దేహంలోని స్పర్శనాడులన్నింటినీ అధరాలలోనే కూరినట్టు.. మోహమే ముంచెత్తినట్టు సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. ప్రతిసారీ అలాగే పెడతాడు. అలౌకికమైన తన్మయత్వంలోకి జారిపోతున్నట్టు.. మౌనంగా కొన్ని లిప్తల సుషుప్తిలో మిగిలిపోతాడు. తనలో తనను, నాలో తనను దేవులాడుతుంటాడు!
బిగిగా హత్తుకున్న చేతులు నెమ్మదిగా విడివడి.. నన్ను ఒడిలోనే కూర్చుండబెడతాయి. నేనలా చేతులు రెండూ మా ఎదురుగా కొలువుదీరిన పియానో మెట్ల మీద, అవి బరువుకు కిందకు దిగి రాగాలాపన చేయనంత సుతారంగా, ఆన్చి, విలాసంగా కూర్చుంటాను. అతను నా వెనుకనుంచి.. విశాలమైన తన బాహువులను చాచి.. నే చేతులు ఆన్చిన వరకూ వదిలేసి.. మిగిలిన పియానో మెట్లను, నేను డిస్టర్బ్ కానంత సుతారంగా సవరిస్తూ.. వీనులవిందైన రస ధారలను ఉరకలెత్తిస్తుంటాడు!
ప్రవాహం.. ప్రవాహం.. ప్రవాహం..
రమ్య సంగీత మోహంలో మునగంగ.. అతని మునివేళ్ల మెరుపులలో పుట్టి మా ఇద్దరి ఏకాంతాన్ని గాఢంగా చుట్టు ముట్టేస్తూన్న ప్రవాహం..
భవ్య తాదాత్మ్య భావనలో తడవంగ.. అతని హృదయపు లోతులలో పుట్టి, నన్ను పూర్తిగా అతని ప్రపంచంగా మార్చేస్తూన్న ప్రేమ ప్రవాహం..
మా ఇద్దరి నడుమ.. అవ్యక్త రస గంగ..
మా ఇద్దరి ఎదుట.. అద్భుత ఘన తరంగ..
ప్రవాహం! ప్రవాహం!!
‘‘టీనా డార్లింగ్’’ ముద్దుగా అంటాడు అతను.
చెవిలో గుసగుసగా! రతికేళీ సుఖాసక్త, శృంగారాభిషిక్త ఘడియలలో.. చెలి చెవిలో.. గిలిగింతలు పెట్టినట్టు! ఆ పిలుపు తెలిసి, నేను ఒడిలోంచి నెమ్మదిగా దిగిపోతాను.
వియోగంగా మమ్మల్ని చూస్తున్న ఆ పియానో సాక్షిగా.. అంతసేపు సాగించిన సంగీతాంబుధి మధనం, సమస్తం, నన్ను హాయిపుచ్చడానికే అన్నట్టుగా.. అతను కూడా అక్కడినుంచి లేచిపోతాడు.
ఆ గదిలో మా ఇద్దరి పరిమళం.. మాకొరకే అయి పల్లవించిన సారస్య పరవశం నెమ్మదిగా పలచబడుతుంటాయి! ఆ జోడు భావనల వివశత్వంలోంచి తేరుకుని, పరిసరాలు నెమ్మదిగా ప్రకృతిలో పడుతుంటాయి!!