• 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
Wednesday, August 19, 2026
  • Login
  • 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
  • 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
No Result
View All Result

ఆ తరానికి గూగులమ్మ.. మాలతీ చందూర్

KA Muni Suresh Pillai by KA Muni Suresh Pillai
August 18, 2026
in Articles, Articles
0 0
0
ఆ తరానికి గూగులమ్మ.. మాలతీ చందూర్

(తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో, మాలతీ చందూర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగం. 20 ఆగస్టు 2025)

అందరికీ నమస్తే.

నా పేరు మునిసురేష్ పిళ్లె జర్నలిస్టుని, రచనలు కూడా చేస్తుంటాను. నా దైనందిన పాత్రికేయ, సాహిత్య రచన కార్యకలాపాలతో పాటు… కథావసుధ పేరుతో అనువాద సాహిత్యానికి ప్రత్యేకించిన ఒక వెబ్ మేగజైన్ కూడా నిర్వహిస్తున్నాను. ఇవాళ ఇంత మంచి కార్యక్రమంలో మాట్లాడడానికి ఈ అర్హతలే మీ ముందు నిలబెట్టాయని నమ్ముతున్నాను. 

సుప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ మాలతీచందూర్ గారి స్మారక ధర్మనిధి సదస్సులో ఆమె సాహితీ విశ్వరూపంలోని ఒక అంశ గురించి నా అనుభూతిని చెప్పగలగడం ఎంతో గౌరవప్రదం. అందుకు పద్మావతి విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖకు కృతజ్ఞతలు.

1928 లో జన్మించి 2013లో తుదిశ్వాస విడిచిన మాలతీ చందూర్ తెలుగు సాహిత్యంలో ఒక విశ్వరూపం. అగ్రగణ్యులుగా, సాహితీ గండరగండలుగా, తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులుగా రకరకాల కీర్తి కితాబులతో వెలుగొందే సాహితీ స్రష్టల కంటె మిన్నగా విభిన్న రంగాల సాహితీ ప్రక్రియలలో సేవలందించిన నిరుపమాన కృషికి నిదర్శనం మాలతీ చందూర్. ఇప్పటికి మాత్రమే కాదు, మరికొన్ని తరాలు గడిచిపోయినప్పటికీ కూడా.. మాలతీ చందూర్.. తెలుగునాట పరిచయం అవసరం లేని పేరు. కథలు, నవలలు, అనువాద నవలలు, వంటలు- అందాలు అలంకారాల గురించిన వ్యాసాలతో మహిళాలోకానికి ప్రియమైన రచనలు ఇలా అనేక విధాలుగా తనలోని రచనా తృష్ణను తీర్చుకుంటూ అసిధారావ్రతం సాగించిన రచయిత్రి మాలతీ చందూర్.

వీటన్నింటికంటె అదనంగా ఆమె చేసిన రెండు రకాల సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి- దాదాపు 300కు పైగా ఇంగ్లిషు నవలలను తెలుగులో పరిచయం చేయడం, రెండు- ప్రమదావనం, అడిగితే చెబుతా, నన్ను అడగండి వంటి రకరకాల శీర్షికలతో వివిధ పత్రికలలో ప్రశ్నలు- జవాబుల కార్యక్రమాలను నిర్వహించడం! ఈ రెండు పనులు లేకపోతే.. ఆమె మరిన్ని వందల కథలు, వందల నవలలు రాసిన ఒక తిరుగులేని రచయిత్రిగా మిగిలి ఉండేవారు. ఈ రెండు రకాల కృషి వలన ఆమెకు వ్యక్తిగతంగా దక్కినది తక్కువ. కానీ సాహిత్యాసక్తి కలిగిన ఆనాటి ప్రపంచానికి ఆమె అందించిన ఇంగ్లిషు నవలల పరిచయాలు ఎంతో గొప్ప మేలుచేశాయని చెప్పాలి. అలాగే ప్రశ్నలుజవాబులు వంటి ఫీచర్ నిర్వహించడం యావత్ సమాజానికీ తిరుగులేని మేలు చేసింది. బహుశా.. తన సమస్త సాహితీ సృజన కంటె కూడా ఈ రెండు ప్రక్రియలకోసం ఆమె ఎక్కువ శ్రమ తీసుకుని ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఇంగ్లిషునవలలను పూర్తిగా చదివి వాటిని తెలుగు పాఠకులకు పరిచయం చేయడం చాలా సమయాన్ని తీసుకునే వ్యవహారం. అలాగే.. ప్రశ్నలు జవాబులు కూడా. ఈ ఫీచర్ ప్రారంభిస్తున్నప్పుడు.. మహా అయితే వారానికి  ఇరవై ముప్పయి ఉత్తరాలు వస్తాయి.. వాటిని చదివి కొన్నింటికి సమాధానాలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారట. కానీ.. వారానికి 500 వరకు ఉత్తరాలు వచ్చిపడుతుండేవి. పత్రికల్లో స్థలాభావం వల్ల.. కొన్నింటికే సమాధానాలు ఇచ్చి ఉండవచ్చు. కానీ. అవి ఆనాటి సమాజానికి, ప్రత్యేకించి మహిళాలోకానికి చేసిన మేలు, కలిగించిన విశ్వాసం చాలా ఎక్కువ. 

కాలానికి నిలిచే మంచి రచన.. అంటే ఒక స్పష్టమైన నిర్వచనం ఉంది. ఎన్నికాలాలు గడిచిపోయినప్పటికీ కూడా.. చదివినవారిపై అది కలిగించగలిగే ప్రభావంలో మార్పు ఉండదు. బహుశా చదివేవారిలో ఆ సమయానికి ఉండే మనఃస్థితిని బట్టి, అన్వయంలో మార్పు ఉండొచ్చు. ఆ పుస్తకం తీసుకురాగలిగిన మార్పు ఒక వర్గంలో పాదుకొని ఉంటుంది గనుక.. కాలగమనంలో దాని వెలుగులు ప్రసరించే వర్గం మారవచ్చు. అంతే తప్ప.. దాని అవసరం లేకుండా పోదు. 

ఉదాహరణకు సూర్యుడి వెలుగు ఉంటుంది. వ్యవసాయానికి పచ్చటి మొక్కలు పెరగడానికి సూర్య రశ్మి చాలా అవసరం అని మనకు తెలుసు. కానీ ఆధునిక ధోరణుల్లో ఇన్‌డోర్ లో వ్యవసాయం చేస్తూ.. ఆర్టిఫిషియల్ లైటింగ్ తో అవసరమైన వేడిని మొక్కలకు అందిస్తూ సేద్యం విధానాలు వచ్చాయి. ఈ పోకడ మరింత పెరగవచ్చు గాక.. కానీ సూర్యుడి వెలుగు ఈ ప్రపంచానికి అనవసరం అని చెప్పే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. ఒక మంచి రచన కూడా అలాంటిదే. 

మాలతీచందూర్ గారి ప్రశ్నలు– జవాబులు లేదా ప్రమదావనం వంటి వ్యాసాలు ఫీచర్లు ఒక తరం నాటి మహిళల సమస్యలను ఉద్దేశించినవే కావొచ్చు. ఆధునిక మహిళా సమాజానికి వాటి అవసరం ఎంత? అనేది ముఖ్యమైన ప్రశ్నగా మారవచ్చు. కానీ.. వాటి అవసరం ఉన్న వర్గాలు తప్పకుండా ఉంటాయి. ఆధునిక మహిళా సమాజం మొత్తం పూర్తి ఏకరీతిగా ఇంకా వికాసం పొందలేదు అనేది మనం గమనించాలి. అందుకే ఆమె రచనలే కాదు.. ఆమె సమాధానాలు కూడా సమాజాన్ని ఎప్పటికీ ప్రభావితం చేయగలిగేవే. 1952 నుంచి దాదాపు 55 ఏళ్లపాటు ఒక ఫీచర్ ను వివిధ పత్రికలలో ఒక రచయిత్రి నిర్వహించడం అనేది అపురూపమైన రికార్డు

ఇవాళ్టి రోజుల్లో ‘అడిగి తెలుసుకునే తత్వం’ చాలా వరకు తగ్గింది. మనం కూడా క్లాసులో టీచరు చెప్పింది పూర్తిగా అర్థం కాకపోతే.. ఇంటికొచ్చి గూగుల్ లో చెక్ చేసుకుంటాం. జ్ఞానానికి ఇంగ్లిషులో ఒక నిర్వచనం ఉంటుంది. Knowledge is knowing of what we dont know అని అంటారు పెద్దలు. మనకు ఒక విషయం తెలియదు అనే స్పృహ కలిగి ఉండడమే జ్ఞానం. ఆ స్పృహ ఉన్నప్పుడే మనం మన ఎరికలో తెలిసిన వారిని అడిగి, తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తద్వారా మన జ్ఞానం విస్తరిస్తుంది. ఇవాళ్టి రోజుల్లో ‘ఈ విషయం నాకు తెలియదు’ అని అనుకుంటున్న వాళ్లు ఎవ్వరూ లేరు. చేతిలో మొబైల్ ఫోను ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికీ ప్రతి విషయమూ తెలిసినట్టే భ్రమిస్తున్నాం! కానీ మాలతీ చందూర్– తాను ప్రశ్నలకు జవాబులు చెప్పేనాటికి పరిస్థితి ఇది కాదు. 

ఇవాళ పత్రికలకు రాసి సమాధానాలు తెలుసుకునే వారు లేరు. ఆన్ లైన్ లో అయినా.. నిపుణులను అడిగి సమాధానాలు తెలుసుకునే వారు తక్కువ. అలాగే ఆన్ లైన్ లో జవాబులు చెప్పేవాళ్లలో ఎవరు నిపుణులో తెలుసుకోవడం కూడా కష్టం. వారైనా సరే.. గూగుల్ నుంచే సమాచారం సేకరించి మనకు చెబుతారేమో తెలియదు. అందుకే ఈ రోజుల్లో మనమే నేరుగా గూగుల్ నే అడిగి.. వచ్చే సమాధానాల్లో కొన్నింటితో తృప్తి పడుతుంటాం. ఇంతటి అవకాశం యాభయ్యేళ్ల కిందటి ప్రపంచానికి లేదు. కానీ.. వారు అడిగే సమస్త సందేహాలను మాలతీ చందూర్ నివృత్తి చేసేవారు. అందుకే ఆమె యాభయ్యేళ్ల కిందటి ప్రపంచానికి గూగులమ్మ. 

నేను ఈనాడు జర్నలిజం స్కూలులో జర్నలిజం డిప్లమో చదువుతున్న రోజుల్లో మాకు తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి అనే రిటైర్డు ప్రొఫెసరు పొలిటికల్ సైన్సు చెప్పేవాళ్లు. నేను ప్రత్యక్షంగా ఎరిగిన వారిలో.. ఇంతటి జ్ఞానసంపన్నులు ఉంటారా? అనుకునేలా నన్ను దిగ్భ్రమకు గురిచేసిన వ్యక్తి ఆయన. ఎవరికైనా మిత్రులకు ఆయన గురించి చెప్పాల్సి వస్తే.. నేనో మాట అనేవాడిని. మీరు గ్లోబును గిర్రున తిప్పి.. కళ్లు మూసుకుని మీ వేలుతో దానిని ఆపండి. మీ వేలు ఎక్కడ ఉందో ఆదేశం గురించి  చరిత్ర, రాజకీయాలు, సామాజిక స్థితిగతులు సమస్తం ఆయన చెబుతారు అంటుండేవాణ్ని. ఆ తరహాలో.. అప్పటి ప్రపంచానికి ఇదీ అదీ అనే వ్యత్యాసం లేకుండా.. ఎవ్వరికీ ఎలాంటి సహేతుక సందేహం వచ్చినా నివృత్తి చేశారు. 

ఇప్పుడు అసలు ప్రశ్న వేసుకుందాం.. 

ఇప్పటి ప్రపంచానికి మాలతీ చందూర్ చెప్పిన సమాధానాల అవసరం ఎంత? ప్రత్యేకంగా ఆమె చెప్పిన సమాధానాలనే తెలుసుకోవాల్సిన అవసరం లేదని, ఏ సందేహాలు వచ్చినా సమాధానాలు అనేక మార్గాల్లో దొరుకుతున్నాయని అందరూ అనుకోవచ్చు. అలా అని వర్తమాన ప్రపంచం అనుకుంటున్నట్టు రుజువులు మనకు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. మాలతీ చందూర్ రచనలు, కథలు, నవలలు అన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి. పునర్ముద్రణలకు వస్తున్నాయి. కానీ.. ఆమె ప్రశ్నలు జవాబులు శీర్షికలకు సంబంధించిన పుస్తకాలు రెండు మూడు సార్లు పుస్తకరూపంలో వచ్చినా అవి మార్కెట్లో అలభ్యం. అతికష్టమ్మీద తప్ప కనీసం పీడీఎఫ్ ల రూపంలోకూడా దొరకడం లేదు. 

ఆమె చెప్పిన జవాబులకు కొంత మేర కాలదోషం పట్టి ఉండవచ్చు. మరింత విస్తృతరూపాల్లో సమాధానాలు దొరుకుతుండవచ్చు. కానీ.. అడిగిన వారికి మాలతీచందూర్ ఎలా సమాధానాలు చెప్పారు.. అనే కోణంలో ఆ పుస్తకాల్ని మనం చదివితే.. అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలు మనకు కనిపిస్తాయి. 

జర్నలిజంలో మాకు తొలిపాఠంగా ఓ సంగతి  చెబుతారు. వార్త అంటే 5 డబ్ల్యులు 1 హెచ్ ఉండాలంటారు. What, where, when, who, why  అనే అంశాలతో పాటు How అనేది చాలా ముఖ్యం. రచయితగా కొంత మంది మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు.. మంచి కథలు రాసే టెక్నిక్ చెప్పండి సర్ అంటూ ఉంటారు. నాకు జర్నలిజం తప్ప మరేమీ తెలియదు అంటూ.. నేను వారితో ఇదే విషయం చెబుతుంటాను. కథలో కూడా ఈ 5 డబ్ల్యులు ఉండాలి. వాటితో పాటు ఎలా చెబుతున్నాం HOW అనేది ముఖ్యం అంటుంటాను. 

మహాభారతం ప్రారంభంలోనే  వ్యాసుడు తాను రాస్తున్న ఆ గ్రంథం గురించి ఒక మాట అంటాడు. ‘యదిహాస్తి తదన్యత్ర.. యన్నేహాస్తి నతత్ క్వచిత్’ అని! ప్రపంచంలో ఉన్న సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి.. ఇందులో లేనిది  మరెక్కడా లేదు అని చెప్పాడు. అంటే సమస్త మానవ భావోద్వేగాలు మహాభారతంలో ఉంటాయని ఆ రచయిత చెప్పుకున్నాడు. నేను ఆ విషయం మిత్రులైన రచయితలతో అంటుంటాను. మనం కొత్త సబ్జెక్టును కనిపెట్టి కథ రాయడం చాలా కష్టం. కానీ ఆ కథను ఎలా రాస్తున్నాం అనేది ముఖ్యం. How అనేది దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం అని చెబుతుంటాను. 

మాలతీ చందూర్ సమాధానాలు చెప్పడంలో ఏ విషయాల్లో, ఎవరికి, ఏ కాలంలో, ఎందుకు సమాధానాలు చెప్పారనేది మనకు కనిపిస్తుంది. ఇక ఆమె ఎలా చెప్పారు. HOW అనేది మన గమనించాలి. అందులోంచి మనం బోలెడు పాఠాలు నేర్చుకోవచ్చు. 

ఆమె సమాధానాలు చెప్పిన తీరులో ఎంత తవ్వుకుంటే అంత దొరుకుతుంది.

అన్నమయ్య తన కీర్తనలో తిరుమలేశుణ్ని స్తుతించినట్టుగా..

ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అన్నట్టుగా..

మాలతీ చందూర్ జవాబుల్లో.. మనం నేర్చుకోగలిగితే.. వ్యక్తిత్వ గుణవిశేషాలు, మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు అనేకం మనకు కనిపిస్తాయి. నేను గమనించినంత మేరకు అయిదింటిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.

ప్రకృతిలో పంచభూతాలు ఎలాగో, వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకం కాగల అయిదు లక్షణాలు అవి. 

 

  1. అధ్యయనశీలత– పరిశోధన
  2. నిర్మమో నిరహంకార
  3. నిష్పాక్షికత
  4. నిర్మొగమాటత్వం
  5. సార్వకాలీనత

1. అధ్యయనశీలత– పరిశోధన

ఒక ప్రశ్న ఒక జవాబు మనకు చాలా సింపుల్ గానే కనిపిస్తాయి. కానీ ఆ ప్రశ్నకు ఆ జవాబు చెప్పాలంటే ఎంతటి విస్తృత అధ్యయనం అవసరమో దిగితేనే తెలుస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులుగా మీకు ఆ సంగతి బాగా తెలుసు. ఒక పీహెచ్డీ పూర్తిచేయడానికి ఎన్ని పుస్తకాలను అధ్యయనం చేస్తారో మీకు తెలుసు. నిజానికి మాలతీ చందూర్ సమాధానాల్లో కొన్నింటిని గమనించినప్పుడు ఆమె ఎంతో పరిశోధన చేస్తే తప్ప– ఒక చిన్న ప్రశ్నకు ఆ సమాధానం చెప్పడం సాధ్యం కాదని మనకు అనిపిస్తుంది.

ఒక ప్రశ్నను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను

ఇరాన్ లో ముల్లా ఖొమైనీ– షా ఆఫ్ ఇరాన్ మధ్య అప్పట్లో శత్రుత్వం ఉంది. దాని పర్యవసానం ఒక సినిమా థియేటర్ లో లోపల ప్రేక్షకులు ఉండగా బయట గడియపెట్టి తగలబెట్టేశారు. ఆ దుర్ఘటన గురించి అడిగినప్పుడు.. మాలతీ చందూర్.. మొత్తం ఇరాన్ లోని అప్పటి వర్తమాన రాజకీయ చరిత్రను మొత్తం వివరిస్తూ సమాధానం చెప్పారు. 

ఈ సమాధానం ఈ రోజుల్లో చెప్పడం చాలా సులభం. గూగుల్ ను అడిగితే సమస్త వివరాలు చెప్పేస్తుంది. ఇంకా కావలిస్తే.. ఇలాంటి సినిమా థియేటర్ ప్రమాదంలో ప్రపంచంలో ఎన్ని, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ జరిగాయో కూడా చెబుతుంది. కానీ.. 1979 నాటికి ఈ సమాధానం ఇంత వివరంగా చెప్పడం అనూహ్యం. తెలుగులో వచ్చే పత్రికలు, అప్పటికి అందుబాటులో ఉన్న రేడియో వార్తలు విన్నంత మాత్రాన సరిపోదు. అంతర్జాతీయ విషయాలు కూడా వివరంగా ఇచ్చే ఇంగ్లిషు పత్రికలు చదివినాకూడా.. ఈ జవాబు ఇంత సంపూర్ణంగా రాదు. ఇంగ్లిషు పత్రికల్లోనూ అనేక ఎడిటోరియల్ వ్యాసాలు, ప్రత్యేక కథనాలు కూడా చదివితే తప్ప.. ఇలాంటి సమాధానం తయారు కాదు. మనం ఒక ప్రశ్నకు చిన్న సమాధానమే చెబుతుండవచ్చు.. కానీ చేసే పని సంపూర్ణంగా ఉండాలని అనుకునే తపనలోంచి, ఎంతటి లోతైన అధ్యయనానికైనా వెరవని, వెనుదీయని తత్వాన్ని ఈ ప్రశ్నద్వారా మనం మాలతీ చందూర్ ను చూసి నేర్చుకోవాలి. ఇతరులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడం ద్వారా.. ఆమె అనేక సంగతులు నేర్చుకునే వారని మనం గ్రహించాలి. 

మనిషిలో అధ్యయన శీలత ఉండాలి. కేవలం మన చదువులు, మన పీహెచ్డీలకు మాత్రమే కాదు. ఏ విషయంలోనైనా  మనలో నేర్చుకునే తత్వం, విద్యార్థి లక్షణం జీవితాంతం ఉండాలి. ఆ తత్వం మనల్ని ఎప్పటికప్పుడు ఉన్నతీకరిస్తుంటుంది. మనల్ని పరిపూర్ణులుగా తయారుచేస్తుంటుంది. ఆ తత్వాన్ని, వ్యక్తిత్వ లక్షణాన్ని  తనలో పదిలంగా కాపాడుకున్నారు గనుకనే.. మాలతీ చందూర్ తుదిశ్వాస విడిచిన పుష్కరం తర్వాత కూడా మనం ఆమె కృషిని గుర్తుచేసుకుంటున్నాం. 

‘ఇంతనేనంటే సంద్రమెంతో యనుకొంటి.. మనకీ సూరీడుకీ మద్దెనుండేదేనా..’ అన్నదట నండూరి వారి యెంకి. స్త్రీ హృదయానికీ సముద్రానికీ ఉండే తేడా చెప్పాల్సిందిగా చంద్రగిరి నుంచి ఎవ్వరో కోరితే మాలతీ చందూర్ కోట్ చేసిన మాట ఇది. 

ఆ రకంగా… మన బుద్ధికీ వికాసానికీ, ఉన్న జ్ఞానానికి– ఉండవలసిన అధ్యయనశీలతకీ మధ్యన ఉండే ప్రేరకశక్తి, స్ఫూర్తిదాయక వ్యక్తి మాలతీ చందూర్. 

2. నిర్మమో నిరహంకార

భగవద్గీతలో పరమాత్ముడు ఎవరిని ఇష్టపడతారనే లక్షణాల గురించి కృష్ణుడు చెప్పినట్టుగా మనకు ఒక శ్లోకం ఉంటుంది. 

నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ– అనేది శ్లోకపాదం.

ఈ శ్లోకపాదంలో తొలిసగం మనందరికీ చాలా ముఖ్యమైనది. మాలతీ చందూర్ జవాబులను జాగ్రత్తగా గమనిస్తే ఆమెలో ఆ లక్షణం పుష్కలంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మనం చేసిన పని మీద మనకు మమకారం ఉండకూడదు. మనం చేసిన పని గొప్పదని అనుకునే తత్వం మితిమీరితే వచ్చే మొదటి ఇబ్బంది ఇతరులు చేసే పనిలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోవడం. అందుకే మన పనుల పట్ల మనం మమకారం తగ్గించుకోవాలి. అలాగే నిరహంకారంగా ఉండాలి. మనం చేసే పనిలో లోపం ఎవరైనా గుర్తించి చెబితే.. దానిని స్వీకరించే పరిస్థితి ఉండాలి. లోపాల్ని స్వీకరించకపోతే.. మన ఎదుగుదల ఇక్కడితో ఆగిపోతుందని మనం తెలుసుకోవాలి. 

ఈ రెండు లక్షణాలు మనకు మాలతీ చందూర్ జవాబుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె చెప్పిన సమాధానాల్లో తప్పులున్నట్టుగా మరొకరు ఎవరైనా లేఖ రాస్తే.. తన తప్పులు ఒప్పుకుంటూ ఆమె ఆ లేఖలను కూడా ప్రచురించిన వైనం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నేనే కరెక్టు అనే అహంకారానికి పోకుండా, తన లోపాలు పాఠకులకు తెలిసిపోతాయనే భయం లేకుండా ఆమె వ్యవహరించడం మనం నేర్చుకోవాల్సిన లక్షణం. 

ఇందుకు మనకు ఆమె నిర్వహించిన ఫీచర్ లోనే అనేక ఉదాహరణలు దొరుకుతాయి. 

తన లోపాన్ని తెలియజెప్పిన వారి పట్ల కినుక వహించడం కాదు.. వారిని అభినందించడం మనం గమనించాలి. ఇలాంటివి అనేకం మనకు కనిపిస్తాయి. తన జవాబుల్లో లోపాలను, తప్పులను ఎవరు తెలియజెప్పినా.. ఆమె వాటిని గౌరవిస్తూ వచ్చారు. బహుశా చెప్పిన జవాబుల పట్ల మమకారం గానీ, తప్పులను ఒప్పుకోలేని అహంకారంగానీ లేకుండా ఉండే ఈ తత్వం బహుశా ఆమెలోని అధ్యయన శీలికి మరింత పదును పెట్టి ఉంటుంది. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి.

निंदक नियरे राखिए, ऑंगन कुटी छवाय।

बिन पानी, साबुन बिना, निर्मल करे सुभाय।।

కబీర్ దాస్ రాసిన దోహా ఇది. మనల్ని నిందించే వారికి, విమర్శించే వారికి మన వాకిట్లోనే ఒక గుడిసె ఇచ్చి మనతోనే ఉంచుకోవాలని, వాళ్ల విమర్శల వల్ల.. నీళ్లు, సబ్బు అవసరం లేకుండానే.. మనం నిర్మలంగా తయారవుతామని కబీర్ దాస్ అంటారు. 

బహుశా ఈ వ్యక్తిత్వ విశేషం మాలతీ చందూర్ కు సహజంగానే అలవాటై ఉండాలి. ఈ లక్షణం ఆమె సమాధానాలను మరింత పరిణతి రావడానికి, మరింత ఆదరణ పెరగడానికి ఆమెకు దోహదం చేసి ఉంటుంది. ఈ లక్షణాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి. 

3. నిష్పాక్షికత

మనం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల దగ్గరున్నాం. తిరుమల వెళితే.. దేవదేవుడిని వేవేల రకాలుగా స్తుతించే భక్తుల తీరును మనం గమనిస్తుంటాం. భగవన్నా స్మరణతో నినాదాలను సర్వత్రా చూస్తుంటాం. కానీ దేవుడిని స్తుతించే మాటలలో ఒక్కటి మాత్రం నాకు నచ్చదు. ఆశ్రితజన రక్షకా అనే పదం నాకు తిరుమలేశుని గురించి సరైన వ్యక్తీకరణ కాదనిపిస్తుంది. ఆశ్రితులను మాత్రమే ఆదరించడం, వారిని కాపు కాయడం ఫ్యాక్షనిస్టు లక్షణం కదా. ‘సర్వత్ర సమబుద్ధయః’ అని కృష్ణుడు చెప్పిన లక్షణం అది కాదు కదా.. అని అనిపిస్తుంది. మనలో ఎంతో కొంత నిష్పాక్షికత ఉండాలి. మన వర్గం, మన కులం, మన ప్రాంతం అనే భావనలతో తప్పుడు పనులను సమర్థించడం, ఒక సంఘటనను విశ్లేషించేప్పుడు అనుచితమైన మొగ్గు చూపించకుండా ఉండడం ముఖ్యం. 

ఈ నిష్పాక్షికత మనకు మాలతీచందూర్ జవాబుల్లో కనిపిస్తుంది. ఆమె మహిళ గనుక, ఆమె ఫీచర్ కు ప్రశ్నలు పంపేవాళ్లు, ఆదరించే వాళ్లు ఎక్కువగా మహిళలు గనుక.. మహిళా పక్షపాతంతో ఆమె సమాధానాలు ఉండవు. కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ప్రశ్న అడిగిన మహిళలోనే లోపం కనిపిస్తే, ఆమె చెప్పడానికి ఎన్నడూ సంకోచించలేదు. మహిళా పక్షపాతి అని ఎన్నడూ అనిపించుకోలేదు. తనకు ఏది న్యాయం అని తోచిందో అది మాత్రమే తన జవాబుల్లో చెబుతూ వచ్చారు. 

ఈ తత్వం ఉండాలి. సాధారణంగా మనం, మన ఫ్రెండ్స్ లో అయినా సరే.. ఎవరు వచ్చి మనతో సమస్య చెప్పుకుంటే వారు కరెక్టు అనే భావనతో ఉంటాం. ఈ తత్వం కరెక్టు కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు, కనీసం మనకు ఇతరులతో విభేదాలు వచ్చినప్పుడు.. కాస్త నింపాదిగా నిష్పాక్షికంగా ఆలోచించే అలవాటు చేసుకుంటే బహుశా మన వ్యక్తిత్వం ఎంతో శోభిస్తుంది. ఎదుటి వారిలో లోపం ఉంటే ఓకే.. కానీ మనలోనే లోపం ఉందని మనం గమనిస్తే.. పైన చెప్పుకున్నట్టు నిరహంకారంగా దానిని ఒప్పుకుంటే.. అది మనకే లాభిస్తుంది. 

4. నిర్మొగమాటత్వం

మనకు స్మృతులు ఒక విషయం చెబుతాయి. 

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం.. ప్రియం చ న అనృతం బ్రూయాత్
ఏతత్ ధర్మ సనాతనః

అంటారు. 

ఎదుటివారితో నిజమే చెప్పాలి. ఎదుటివారికి ప్రీతికరంగా ఉండేదే చెప్పాలి. ఎదుటివారు ఇష్టపడేది కాకపోతే నిజాన్ని చెప్పకపోవడం మంచిది. వారికి ఇష్టం కదా అని అబద్ధం చెప్పకుండా ఉండాలి.. అని చెబుతారు. స్మృతులు ఇదే ధర్మం అని బోధిస్తాయి గానీ.. మితిమీరిన లౌక్యాన్ని ఇది మనకు నేర్పుతుంది. నిజానికి మనలో కొంచెం నిర్మొగమాటత్వం ఉండాలి. ఆ లక్షణం మన వ్యక్తిత్వానికి గౌరవాన్ని అందిస్తుంది. నిర్మొగమాటంగా మాట్లాడితే.. తొలుత ఎవరైనా నొచ్చుకున్నా.. ఆ తర్వాతనైనా మిమ్మల్ని గౌరవిస్తారు. అది నేర్చుకోవాలి. 

కథలకు అవసరమైన పరిశీలనను నాకు నేర్పిన గురువు మధురాంతకం రాజారాం గారి మాట ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి. ‘నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తాను అని చెప్పుకునే వాళ్లను నేనెరుగుదును. కానీ.. వారి శ్రీమతి పరిస్థితి మొదటి తరగతి ఆడఖైదీ కంటె భిన్నంగా ఏమీ ఉండదు’ అని ఆయన ఓ బంగారుపొయ్యి అనే అద్భుతమైన కథలో రాస్తారు.

మనం సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. భార్య మీద ప్రేమ అనే ముసుగులో అశక్తురాలిగా, పరాధీనగా తయారుచేసే వర్గం ఒకరుంటారు. ‘మా ఆయన అపరిచితుడు’ అనే ఒక కథలో నేనో ఉదంతం రాశాను. ఒక స్నేహితురాలి జీవితంలో వాస్తవ సంఘటన అది. 

భర్త చనిపోయారు. ఆమెకు తన పదోతరగతి సర్టిఫికెట్ ఎక్కడ ఉన్నదో తెలియదు. కనీసం తను పదో తరగతి ఎప్పుడు చదివిందో కూడా తెలియదు. 

ఇలాంటి సంగతుల్ని నిష్కర్షగా చెప్పుకోవడం అవసరం. కొంతమందికి భార్యలను మైనపు ముద్దలుగా చేయాలని ఉంటుంది అని మాలతీ చందూర్ నిర్మొగమాటత్వానికి నిదర్శనం.

5. సార్వకాలీనత

ఒక వ్యక్తి ఆలోచనలో సార్వకాలీనత ఉండడం గొప్పవిషయం. ఇవాళ్టి ఆలోచన రేపటి తరానికి కూడా మార్పు అవసరం లేనిదిగా కనిపిస్తే.. వారి దృక్పథం గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి లక్షణాన్ని మనం కూడా నేర్చుకోవాలి. 

కొన్ని దశాబ్దాల కిందట మాలతీ చందూర్ చెప్పిన కొన్ని సమాధానాలు చదువుతున్నప్పుడు ఆమె టైమ్ మిషిన్ లో ప్రయాణించి ఇవాళ్టి పరిస్థితులను  చూసి అలా రాశారా? అని మనకు అనిపిస్తుంది. ఆ దార్శనిక, సార్వకాలీన దృక్కోణం మనల్ని అబ్బురపరుస్తుంది. 

తనకు ఎదురైన ప్రశ్నకు.. సుదీర్ఘమైన వివరాలతో గూగుల్ ను మించిన సంగతులు చెప్పి ఆమె ఒపీనియన్ కూడా జోడించి చెబుతారు. గూగుల్ మనకు ఒపీనియన్ చెప్పదు. ఇవాళ సోషల్ మీడియాకు బానిసలైన సమాజపు పరిస్థితిని ఆ రోజుల్లో ప్రస్తావించిన ఆమె గమనింపు గొప్పది. 

ఇవాళ మనం సోషల్ మీడియా ఉచ్చులో బతుకులీడుస్తున్న పరిస్థితికి ఇది దర్పణం. ఇవాళ మనం సమకాలీన పరిణామాలను స్వయంగా తెలుసుకునే, విశ్లేషించుకునే, నిర్ణయాలను తీసుకునే స్థితిలో లేం. సోషల్ మీడియాలో ఎవరో వమనం చేసుకునే అభిప్రాయాలను మన బుర్రలలోకి ఎక్కించుకుని దారితప్పుతూ ఉంటాం. దాదాపు నలభై అయిదేళ్ల కిందట కూడా ఇదే పరిస్థితి.. ఆమె విశ్లేషించిన తీరు గొప్పగా ఉంటుంది. 

మతమార్పిడుల గురించి, ప్రేమల గురించి రకరకాల ప్రశ్నలు వచ్చినప్పుడు.. అలాంటివన్నీ కూడా సమాజంలో అర్థన్యాయం, వర్గన్యాయం బట్టే ఉంటాయంటూ మాలతీచందూర్ సూత్రీకరించడం సార్వకాలీనతను స్ఫురింపజేస్తుంది. కులాలు, మతాలు, ప్రాంతాలు ప్రాతిపదికగా ఎన్ని గొడవలు మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ.. ఈ అంతాలు అన్నింటినీ మించి.. అర్థన్యాయం, వర్గన్యాయమే శాసిస్తుంటాయని మనం గమనించవచ్చు. ఆమె మాటల్లోని సార్వకాలీనత అపూర్వమైనది.  మనం నేర్చుకోదగినది. 

కొన్ని తరాలకు చైతన్యప్రదాత, తన జవాబుల ద్వారా తార్కికమైన ఆలోచనను, జ్ఞానాన్ని కొన్ని దశాబ్దాల పాటు మహిళల మేథోక్షేత్రాల్లో విత్తినటువంటి వ్యక్తి మాలతీ చందూర్.

మాలతీ చందూర్ ను చదవడం ద్వారా, ఆమె జవాబులను బిట్వీన్ ది లైన్స్ అధ్యయనం చేయడం ద్వారా..  ఆమెలోని ఈ అయిదు వ్యక్తిత్వ గుణ విశేషాల్లో సహస్రాంశం మనకు దక్కాలని కోరుకుందాం.

నలుగురిలో మార్పు తీసుకురావడం, వారి ఆలోచనల్లోను, వారి సంస్కారాల్లోను, బుద్ధిలోనూ గుణాత్మకమైన పురోగతిని నిర్దేశించడం అనేవే గనుక.. సంస్కర్తల యొక్క లక్షణాలు అయితే.. అస్తుత సంస్కర్త మాలతీ చందూర్.

ఆమె వర్ధంతి సందర్భంగా నా మనఃపూర్వక నివాళి

చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను

ప్రమదావనం శీర్షికకింద ప్రశ్నలు జవాబులు నిర్వహిస్తున్న రోజుల్లో బాపు గారు ఒక కార్టూన్ గీశారు. ఆ కార్టూన్ ను కూడా ఆ పేజీలోనే ప్రచురించారు. మామూలుగానే, అధికారం చెలాయించే లావుపాటి భార్య, భయభక్తులతో మెలిగే బక్కపలచటి  భర్తల కార్టూన్లకు బాపు ప్రసిద్ధి. ఆ కార్టూన్ ఇలా ఉంటుంది. 

భార్య హాల్లో కూర్చుని వచ్చిన ఉత్తరాలు చూస్తూ ఉంటుంది. అందులో ఓ ఉత్తరంలో సమాచారం ఇలా ఉంటుంది. ‘మాలతి గారూ.. మా ఇంటావిడతో వారానికి ఒక్కరోజైనా వంట చేయించేందుకు సలహా చెబుదురూ..’ అని! అంటే ఆ ఉత్తరాలు చదువుతున్న ఆవిడ మాలతీ చందూర్ అని మనం అనుకోవాలి. ‘మాలతి గారూ..’ అని సంబోధన సహా ఉత్తరంలో ఉంటుంది. కార్టూన్లో ఆమె దానిని చదువుతుండగా.. భర్త వంటింట్లోంచి నక్కి చూస్తుంటాడు. ఆ ఉత్తరం చూసి ఆమె దొంగచాటుగా చూస్తున్న భర్తనుద్దేశించి అంటుంది.. ‘కార్డు ముక్కకు డబ్బులెవరిచ్చారూ’ అని! అంటే పోస్టు కార్డు కు కూడా డబ్బులు లేనంత నియంత్రణలో ఆమె భర్తని అదుపాజ్ఞల్లో ఉంచుతున్నదన్నమాట.

తమాషా ఏంటంటే.. మాలతీ చందూర్ గారి ప్రమదావనం శీర్షిక మీద బాపు గారు వేసిన ఈ కార్టూన్ ను,  ఆమె పేజీలోనే ప్రచురించారు. ఆమె మీద సెటైర్ అయినప్పటికీ.. ఆమెకూడా సరదాగానే తీసుకున్నారు. ఈ కార్టూన్ లో ఇంతవరకే మనకు అర్థమవుతుంది. కానీ మాలతీ చందూర్ గారితో పరిచయం ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యే మరో పంచ్ కూడా ఇందులో ఉంది. మాలతీ చందూర్ ఇంట్లో వంట చేసేవారు కాదు. ఇంట్లో ఆమె అక్క కూడా ఉండేవారు. వంట పనులన్నీ ఆమె చేసేవారు. చందూర్ వంటల పుస్తకాలు కూడా రాశారు.. గొప్ప క్రేజీగా ఆ వంటల పుస్తకాలు ఆరోజుల్లో అమ్ముడయ్యేవి కానీ, ఆమె ఇంట్లో వంట చేసేవారు కాదు. ఈ లక్షణాన్ని కూడా హాస్యస్ఫోరకంగా స్ఫురింపజేసేలా బాపు తన కార్టూన్లో చెప్పడం విశేషం.  

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
99594 88088

 

Tags: పద్మావతి యూనివర్సిటీమాలతీ చందూర్మునిసురేష్ పిళ్లె
Previous Post

చింతపండు పచ్చడి లాంటి ఖదీర్ కథ ‘ఆపా’!

Please login to join discussion
  • Privacy Policy
  • Terms and Conditions

Developed by : www.10gminds.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Books
  • Books Sale
  • Cart
  • Checkout
  • My account
  • Privacy Policy
  • Profile
  • Shop
  • Stories
  • Terms and Conditions
  • 🏠

Developed by : www.10gminds.com