• 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
Sunday, August 16, 2026
  • Login
  • 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
  • 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
No Result
View All Result

చింతపండు పచ్చడి లాంటి ఖదీర్ కథ ‘ఆపా’!

KA Muni Suresh Pillai by KA Muni Suresh Pillai
August 16, 2026
in Articles
0 0
0
చింతపండు పచ్చడి లాంటి ఖదీర్ కథ ‘ఆపా’!

(ఖమ్మం ఈస్థటిక్స్ వారు 2025 డిసెంబరులో నిర్వహించిన ‘కథాంతరంగం’ కార్యక్రమంలో.. ఖదీర్ బాబు రాసిన ‘ఆపా’ కథ గురించి కెఎ మునిసురేష్ పిళ్లె ప్రసంగం)

 

ఖదీర్ కథ గురించి మాట్లాడడం చాలా సుఖం.

తిరుగులేని క్రాఫ్ట్‌తో, ఇప్పుడు రాస్తున్న వాళ్లలో నేను చాలా ఇష్టంగా, ఒక మోహంతో చదివే వాళ్లు సుమారుగా పదిమంది ఉంటారనుకుంటే వారిలో ఖదీర్ ఒకడు. ‘దేహగీతి’ లాంటి కథ గురించి అయితే.. నేను కనీసం ఒక గంట మాట్లాడతానని బతిమాలే వాణ్ని.. ఇప్పుడు ‘ఆపా’ గురించి మాట్లాడుకుందాం.

 

నేను జర్నలిస్టుని. ఖమ్మంలో కూడా నా ఉద్యోగ కెరీర్ అవసానదశలో పనిచేశాను. ఫ్రెండ్స్ తో నేను అంటూ ఉంటాను. నాకు జర్నలిజం తప్ప మరొకటి తెలియదు అని. నా ఫేస్‌బుక్ ఇంట్రోలో కూడా జర్నలిస్ట్ అనే ఉంటుంది. ‘ఒకవేళ నేను అడపాదడపా కథలు రాసినాకూడా, అవి జర్నలిజం వృత్తిలో పరిమితుల కారణంగా రాయలేకపోయిన అంశాలు మాత్రమే’ అంటుంటాను. కథను తూకం వేయాలన్నా, రాయాలన్నా కూడా నాకు తెలిసింది జర్నలిజం ప్రమాణాలు మాత్రమే. 5 డబ్ల్యులు ఒక హెచ్ అనేది. మేం నేర్చుకునే ప్రాథమిక సూత్రం. కథ అయినా సరే.. ఇవి ఉండాలనేది నా ఆలోచన. What Where When Why Who అనేవి ఖచ్చితంగా కథలో ఉండాలి. మిత్రుడు జి.ఉమామహేశ్వర్ అన్నట్లు ‘కథలో unit of time and place ఉండాలి కదా’ అని. ఇవన్నీ ఉండాలి. అయితే.. ఆ కథ గొప్ప కథా.. మామూలు కథా అనేది H నిర్ణయిస్తుంది. HOW నిర్ణయిస్తుంది. ఎలా చెబుతున్నాం మనం కథని. ఒక పాచిపోయిన సబ్జెక్టు అయినా సరే.. చెప్పడం గొప్పగా ఉంటే కనీసం మంచి కథగా మిగులుతుంది.

ఇది నా సిద్ధాంతం. ఇలా HOW.. అనే చెప్పడంలో అసాధారణమైన శ్రద్ధ ఉన్నవాడు ఖదీర్. వాక్యాల్ని చెక్కినట్టుగా రాసుకుంటూ వెళతాడు. 

 

కాబట్టి ఖదీర్ కథ గురించి చెప్పడం చాలా సుఖం. పొగుడుకుంటూ వెళ్లిపోవచ్చు. ఆపా కథ గురించి నా పరిశీలన మూడున్నర భాగాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను

 

ఆపా అంటే పెద్దక్క అని అర్థం వస్తుందట. ఆ ఆపా, కథ చెప్పే పిల్లాడి తల్లిని అక్కా అని పిలుస్తుంటుంది గానీ.. ఆ పిల్లాడికి మాత్రం ఆమె అక్కే. ఇది సాధారణంగా మావైపు అలవాటు. ఇరుగు పొరుగు వాళ్లని అక్కా అన్నా అని పిలవడం.. వరుసలు పెట్టి పిలవడంలో ఎక్కువగా అక్కా, అన్నా అనే పదాలే ఉండడం అలవాటు. ఆపా పిల్లాడి తల్లిని అకా అని పిలుస్తుంది. ఆమె మాత్రం ఆపా తల్లిని అత్తా అని పిలుస్తుంది. వరసలు పట్టించుకోని ఆ ప్రాంతపు పిలుపులు అవి.

 

చిన్నతనంలో నాకు కూడా మా ఎదురింట్లో ఒక అక్క ఉండేది. ముస్లిం కుటుంబం. బూబమ్మవ్వ, తాత ఉండేవాళ్లు. వాళ్ల కొడుకుల్ని మామూ అనేవాణ్ని. కూతురుని బూ అని పిలిచేవాణ్ని. బూ అనే పదానికి అర్థం తెలియదు గానీ.. అక్క అనే అర్థంలోనే అలవాటు చేసుకున్నట్టున్నాను. అలా ‘ఆపా’ అనే టైటిల్ అంటే పెద్దక్క, అక్క అని తెలియగానే నాకు ముచ్చటగా అనిపించింది.

1. రచయితల అహంకారం

సాధారణంగా రచయితల్లో సూచ్యంగా ఒకరకమైన అహంకారం ఉంటుంది. తామేదైనా మార్మికంగా రాయడం.. ‘నేను రాసినది పాఠకుడికి అర్థం కాదు’ అనుకోవడం అలాంటి అహంకారానికి ఒక ప్రతీక. పాఠకుడు మనకంటె తెలివైన వాడు.. మనం చెప్పేదేదో పాఠకుడు సవ్యంగా అర్థం చేసుకోగలడు- అనే విశ్వాసం వారికి ఉండదు. కానీ ఖదీర్ అలా కాదు. తన పాఠకుడంటే ఖదీర్ కు కొంత మేరకు గౌరవం, విశ్వాసం. అందుకే మార్మికమైన  తన వాక్యాలను పేజీలకు పేజీలు వివరించాలని అనుకోడు. 

మొదటి వాక్యంలోనే.. ‘అమ్మ బాదం చెట్టు కాడికి పొయ్యింది. నాన్న అన్నానికొచ్చాడు’ అమ్మ వెళ్లడం అనేది అప్పటికే ఎప్పటినుంచో జరుగుతున్న, గోరీ అనే ఆ పాపకు అలవాటైన పనిలాగా చెబుతుంది.  ఆ భావం పాఠకుడి బుర్రలోకి వెళుతుంది. 

పాఠకుడిని కేవలం చదువుకుంటూ వెళ్లనివ్వకుండా అలా ఆలోచనలోకి నెట్టి, ఆతర్వాత ముందుకు కదలనిచ్చే వాక్యాలు అనేకం ఉన్నాయి ఈ కథలో. 

2. బిరోల్ షాట్స్

సినిమాల్లో బి రోల్ షాట్స్ అని ఉంటాయి. 

ఒక ఆఫీసరు దగ్గరకు ఓ రాజకీయ నాయకుడు వచ్చి ఒత్తిడి చేస్తున్నాడు. ఆ ఆఫీసర్ కు ఇష్టం లేదు. ఈ మధ్యలో ఆఫీసరు టేబుల్ మీద పేపర్ వెయిట్ ను గుండ్రంగా తిప్పుతున్నాడు. ఈ ఇద్దరి సంభాషణ మధ్యలో దాన్ని తిప్పడం ఒక క్లోజప్ షాట్ ఉంటుంది. ఆ ఆఫీసర్ చికాకు పడుతున్నాడు. అన్యమనస్కంగా వింటున్నాడు. లాంటి ఏదో ఒక మూడ్ ను ఆ క్లోజప్ షాట్.. వాయిస్ ఓవర్ అవసరం లేకుండా మన బుర్రలోకి పంపుతుంది. నిజానికి అది ఒక ఇంద్రజాల విద్య. సినిమాల్లో కెమెరా వంకరగా పెట్టే డచ్ యాంగిల్ లాంటి షాట్స్ కు ఒక పరమార్థం ఉంటుంది. కానీ వంకరగా పెట్టడం వెరైటీ అని భ్రష్టు పట్టిపోతున్నట్టుగా ఈ బిరోల్ షాట్స్ కూడా ఈరోజుల్లో భ్రష్టుపట్టిపోతుంటాయి. 

అయితే.. బి-రోల్ వాక్యాలద్వారా.. పాత్రల మూడ్ ను మనలోకి యింకేలా చేయడం కథకుడు నేర్వవలసిన ఇంద్రజాలం. ఖదీర్ కు విద్య వచ్చు. ఇందులో ఒక మామూలు రచయిత ఒక పేజీ, లేదా, కనీసం ఒక పేరా రాసి వివరించి చెప్పే పాత్రల మనఃస్థితిని ఖదీర్ ఒక్క వాక్యంలో, సగం వాక్యంలో చెప్పగలడు. 

‘పువ్వాకు తీసింది గానీ బుగ్గన పెట్టుకోలేదు’- ‘అరచేతిలో కట్టిన ముద్దను అట్టాగే పట్టుకుని..’- ఒక మాట వినగానే,  ఎంత క్రియారహితంగా అయిపోయారో ఈ వాక్యాలు చెబుతాయి. 

‘ఇంట్లో చీకటిగా ఉంది. అమ్మ లైటేసింది’ ఇది ప్రతీకగా చెప్పే ప్రయత్నం.

3. శుద్ధ కళావాదం- నైతిక కళావాదం 

సినిమా స్క్రిప్టు రాసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది నేను ఎక్కడో చదివాను. ఒకడొచ్చి తలుపు కొడతాడు. స్క్రిప్టు ప్రకారం లోపల గృహిణి స్నానం చేస్తుంటుంది. ‘ఒక్క నిమిషం ఆగండి స్నానం చేస్తున్నా’ అనేది డైలాగు. ఈ డైలాగును దర్శకుడు మార్పించేశారట.  లోపలినుంచి మహిళ పాత్ర ఆ డైలాగు పలికితే.. సినిమా చూస్తున్న వ్యక్తి ఊహలో ఆమె స్నానం చేసే సన్నివేశం మెదలుతుంది కదా.. అలాంటి అసభ్యమైన ఊహకు వెళతాడనే ఉద్దేశంతో ఆ డైలాగు మార్పించారట. బహుశా.. ‘ ఒక్క నిమిషం ఆగండి.. పూజ చేసుకుంటున్నా’ లాంటి డైలాగు పెట్టి ఉంటారేమో.

ఆపా కథలో ఏం జరుగుతోంది. 

కాళ్ల మధ్య కొరివంటుకున్నట్టుగా ఉన్న వేదన గురించి మాత్రమే ఉంది. ఖదీర్ ఎక్కడా.. ఆ వేదనని శుద్ధీకరించాలి.. పవిత్రీకరించాలి అనుకోలేదు. ఇలాంటి వాక్యాలు ఇంకా ఉన్నాయి. చాలా సూటిగా.. ‘పంచెల్లో ఉన్నది అదిమిపెట్టుకోని బతకడం నేర్చుకోరు’, ‘గుడ్డ తప్పించి ఎట్టా చూపించాలి..’ లాంటి వాక్యాలు.

ఇవన్నీ శుద్ధ కళావాదం- నైతిక కళావాదం అనే వర్గీకరణ కోణాల్లోంచి చూడాల్సిన విషయాలు. పరమ బూతు లేదా పరమ ఫ్యాక్షన్ సినిమా తీసినప్పటికీ.. చివర్లో ఇదంతా తప్పు అని ఒక సందేశం చెప్పేసి.. వాటిని వ్యతిరేకించే ఉదాత్తమైన సినిమా అని వాళ్లు ప్రచారం చేసుకుంటారు. కానీ ఆ బూతు, ఆ సందేశం ఎంతెంత పాళ్లలో ఉన్నాయనేది గమనించాలి. 

ఆపా కథలో చూసినప్పుడు.. కథలో నూటికి డెబ్భయి పాళ్లు.. సూటిగా ఆమె కాళ్ల మధ్య కొరివంటుకునే బాధనే చెప్పాడు.

అయిదేళ్ల కిందటే  ఈ కథ చదివినప్పుడు.. నా ఫ్రెండ్స్ రచయితలతో చిన్న చర్చలు కూడా నడిచాయి. నైతిక కళావాదపు విమర్శలు అవి. ఇంత ఘాటుగా చెప్పాలా? అనే వాదన వచ్చినప్పుడు.. నంగినంగిగా చెబితే.. ఆపా బాధ ప్రపంచానికి ఎలా అర్థమవుతుంది అనే నాకు అనిపించింది. 

అదే సమయంలో మిత్రులు పంచె, గుడ్డ తప్పించడం గురించి చెప్పినప్పుడు.. అందులో ధ్వనించే బూతు భావనని కాస్త తగ్గించవచ్చునేమో అని నాకు కూడా అనిపించింది. 

కానీ రచనల్లో ఉండాలని కోరుకునే ఈ నైతిక విలువలు రెలటివ్ పదాలే. సాపేక్షికాలే. అయిదేళ్ల కిందట ఇవి బూతు అనిపించాయి కానీ.. ఇవాళ అదే వాక్యాలు అత్యంత గౌరవప్రదంగా చెప్పిన వాక్యాలుగా అనిపిస్తున్నాయి. పచ్చిబూతులనే కథలో రాసేస్తూ.. సహజమైన సంభాషణలు రాయడం కింద మన్నన దక్కించుకుంటున్న రోజులివి. కాబట్టి ఖదీర్ చాలా గౌరవప్రదంగానే చెప్పినట్టు నాకు నమ్మకం కలుగుతోంది.

రెండు విషయాలు

ఆపా వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నప్పుడు.. పోయే  ముందు పిల్లాడి చేతిలో ఆమె బలవంతంగా ఓ రూపాయి బిళ్ల ఉంచి వెళుతుంది. 

గొప్ప గమనింపు అది. ఎదురింటి ముస్లిం కుటుంబంతో నాకున్న అనుబంధం చెప్పాను కద. నేను ప్రతి బర్త్ డేకు ఇంట్లో అయ్యాక.. ఎదురింటికి వెళ్లి బూబమ్మవ్వకి, ఫకీరు సాయిబు తాతకి చాక్లెటులిచ్చి దండం పెట్టుకునే వాడిని. అవ్వ నా చేతిలో ఓ రూపాయి పెట్టేది. ఆ రోజుల్లో చెప్పలేనంత ప్రేమని, తనని ఆదుకున్న అమ్మ కుటుంబం పట్ల కృతజ్ఞతని చెల్లించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆ రూపాయి బిళ్ల.

రెండోదేంటంటే.. అమ్మ, ఆపా కథంతా గుర్తు చేసుకుని ఈ శుక్రవారం ముడుపు చెల్లిస్తాను అంటుంది. ఆమె ముడుపు తీర్చుకోవడానికి సిద్ధం కావడంలోని లోతు ఆ ముందు పేరాలో ఉంటుంది. మూడు నెలలు గడిచిపోయాయి. అంటే.. తన శక్తికి మించి పది బాసన్ల బియ్యం అన్నం వండి సంతర్పణ చేయడానికి, తగినంత కూడబెట్టడానికి ఆ అమ్మకు మూడునెలలు అవసరం అయ్యాయి. 

నాకు ఒకే ఒక్కటి అసహజంగా అనిపించింది.

‘నేను ఇష్టంగా వెళ్లి అమ్మ ఒళ్లో కూచున్నాను’ అనే వాక్యంతో కథను ముగించాడు ఖదీర్. 

ఆ సీను అన్నాల దగ్గర జరుగుతోంది. అంటే ముగ్గురూ తినడానికి కూర్చున్నారు. అప్పుడు మళ్లీ వెళ్లి అమ్మ ఒళ్లో కూచోవడం- సహజంగా లేదనిపించింది. 

మొక్కు తీర్చుకోవడం గురించి కూడా తెలిసిన తర్వాత.. నేనైతే ఇలా రాసేవాణ్ని.. 

నాకు గోరీ గుర్తొచ్చింది. ఇప్పుడాయమ్మి మొకంలో నవ్వుగూడా కనిపిస్తా వుంటాదేమో!

అని. 

ముగింపు

ప్రతివాడికీ కథకు అందరికంటె ఎక్కువగా కనెక్ట్ కావడానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ కథలో తనను చూసుకునే ఎలిమెంట్. అలాంటిది. ఈ కథలో నాకు ఒకటి ఉంది. 

కథా ప్రారంభంలో.. అమ్మ మసాలా బండ మీద చింతపండు పచ్చడి నూరుతోంది. ఒలిచిన ఎర్రగెడ్డని రాయికింద నలగ్గొట్టి అందులో వేసింది. 

ఈ పచ్చడి నాకు మహా రుచించింది. మేం సినిమా చేసినప్పుడు.. 30 రోజులు బీజాపూర్ షెడ్యూల్లో ఉన్నాం. రోజూ అయిదారు రకాల టిఫిన్లు బీభత్పంగా ఉండేవి. అక్కడినుంచి తిరిగొచ్చాక.. నేను అమీర్ పేటలో బస్సు దిగి ఆటో ఎక్కగానే  మా అమ్మకు ఫోన్చేసి.. అమ్మా నోరు చచ్చిపోయింది. ఉప్పుడుబియ్యం సద్దికూడా వండి, చింతపండు పచ్చడి చెయ్యి అన్నాను. ఇంటికి వచ్చేలోగా వేడివేడి సద్దెన్నం, చింతపండు పచ్చడి రెడీ. మహదానందంగా అనిపించింది. ఈ కథ కూడా అలాంటి మహదానందాన్ని చదివినవారికి కలిగిస్తుంది. 

థాంక్యూ.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

నోట్ : ఈ కింది లింక్ క్లిక్ చేయడం ద్వారా.. కథానిలయం వెబ్ సైట్ నుంచి ‘ఆపా’ కథను చదవవచ్చు.

https://kathanilayam.com/story/pdf/91878

Previous Post

చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

Please login to join discussion
  • Privacy Policy
  • Terms and Conditions

Developed by : www.10gminds.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Books
  • Books Sale
  • Cart
  • Checkout
  • My account
  • Privacy Policy
  • Profile
  • Shop
  • Stories
  • Terms and Conditions
  • 🏠

Developed by : www.10gminds.com