‘‘ఒరేయ్ తమ్ముడూ…’’ అనో,
‘‘అన్నయ్యా…’’ అనో,
‘‘హలో…’’ అనో వచ్చే ఓ తీయని పలకరింపు మీ చేతికి ఓ బంధనాన్ని అలంకరించినప్పుడు – మీరు చిరునవ్వుతో ఓ థాంక్స్ విసిరి సరిపెట్టుకోబోకండి. మీ చేయి ఆమె చేతుల్లో ఉండగనే ఒక్కసారి గట్టిగా కళ్లు మూసుకుని, కొన్ని క్షణాలాగి, ఆమెకేసి చూడండి… మీకు తెలియకుండానే మీ కన్నుల్లో సన్నటి నీటిపొర కదలాడిన అనుభూతి కలుగుతుంది. అదే మీ హృదయం!
ఎదురుగా – మీ కళ్లకేసే చూస్తున్న ఆ కళ్లలో తటిల్మనే మెరుపు ఉంటుందే… అది ప్రేమ…!!
మనం కలిసి ఉన్నాం. కలిసే మన పయనం… అంటూ మౌనభాషలోనే మీకు చెప్పి, ‘ఎప్పటికీ ఒంటరి వాళ్లం కాదు సుమా’ అనే ప్రేరణకు ఆ ప్రేమ బీజం వేస్తుందే… అదే ‘రక్ష’!!
యంత్రంలా మారిన బతుకుల్లో, అనుభూతుల ఊసులేకుండా పోటీప్రపంచం ఎటు లాక్కెళితే అటు వెళ్లే మన జీవితాల పయనంలో… ఎక్కడో మీ గుండెలోతుల్లో మరుగున పడిపోయిన హృదయాన్ని ఏడాదికి ఓసారి తట్టిలేపి కళ్లలోకి తీసుకువస్తుందే… అది. ఆరోజు – ‘‘రక్షాబందన్’’!
ముంజేతికి కట్టుకునే ఓ చిన్న రంగుదారం ముక్కకి ఇంత బిల్డప్పా?!! అని ఒకింత ఆశ్చర్యం కలగవచ్చు కూడా!
అంతేనా…?
అక్క హుందాతనపు అందాల హంగులు పొదిగిన… విద్యుల్లతల్లా చమక్కులు కురిపించే చెల్లిలి చిరునవ్వులు చెమ్కీలు అద్దిన… అంతా మంచే జరగాలని నిండు మనసుతో స్నేహితురాలు పంచే శుభకామనల రంగులు దిద్దిన… ప్రేమ అది. కేవలం దారమేనా…?
కాదు. అది ‘ప్రేమ’
![]()
‘‘నాకు అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన, ఫన్నీ అండ్ సిల్లీ అయిడియాలు వస్తుంటాయోయ్’’
‘‘ఓ అయిదు నిమిషాలు నీతో గడిపితే చాలు ఆ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది’’ చెప్పాన్నేను. ఆ చురక వాడిని చురుక్కు మన్పించలేదని అర్థమయ్యాక ‘‘సర్లే ఎలాంటివో చెప్పు’’ అన్నాను మళ్లీ.
‘‘ఫరెగ్జాంపుల్ పండగలూ పబ్బాల్ని కాస్త వెరైటీగా జరుపుకోవాలనిపిస్తుంది. ఒక్కోసారి అంటే – దీపావళి అనుకో. నరకాసురుడి వర్ధంతి సభ పెట్టి, మేల్ ఈగోతో తన ప్రాణం మీదికి తెచ్చుకున్నందుకు థాంక్స్ చెబుతూ ఓ తీర్మానం ఆమోదించడం లాంటివన్నమాట…’’
‘‘అదేమిటి?’’
‘‘ఆ మేల్ ఈగోతోనే కదా, ఆడది మనల్ని చంపబోయేది ఏముందిలే అనుకుని వరాలు పొందిందీ… చివరకు సత్యభామ చేతిలో కడతేరింది…’’
‘‘భలే వెరైటీగా ఉండోయ్’’
‘‘థాంక్యూ ఫర్ ది కాంప్లిమెంట్స్ అలాగే ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ రక్షాబంధన్ అనుకో…’’
‘‘కొంపదీసి రాఖీని చేతికి కాకుండా మెడకు కట్టించుకోవాలన్న బుద్ధి పుట్ంటిందా ఏమిటి?’’
‘‘హ్హ హ్హ హ్హ. ఈ ఆలోచన కూడా బాగానే ఉందిరోయ్. అయితే నా బుర్రలో పుట్టిన ఊహకు కొంచెం పొలిటికల్ టచ్చుందిలే’’
‘‘ఏమిటో అది?’’
‘‘ఏముందీ – అవినీతి కుంభకోణాలూ గట్రా బయటపెట్టి ఆరోపణలు చేసే బ్యాచీ ఉంటుంది చూశావూ! శత్రుపక్షాలే అనుకో!! ఆ గ్రూపు ప్రముఖులందరికీ – ఆరోపణలకు గురయ్యేవారి భార్యలతో రాఖీలు కట్టిస్తే సరి…’’
‘‘కట్టిస్తే…’’
ఇంకా అర్థం కాలేదా అన్నట్లు నాకేసి జాలిగా చూశాడు. ‘‘ఏముందీ వాళ్లూ వాళ్లూ రిలేటివ్స్ అయిపోయి ఫ్రెండ్లీగా ఉండిపోతారు కదా…’’
‘‘అయితే ఒరిగేదేమిటోయ్?’’
‘‘ఈ ఆరోపించుకోవడాలూ, దుమ్మెత్తిపోసుకోవడాల, నిద్దర్లేస్తే న్యూస్ పేపర్లనిండా నానా కంగాళీగా యాగీ చేయడాలూ గట్రా గంద్రగోళాలేవీ ఉండవుకదా!’’
నాకు ఆవేశం తన్నుకొచ్చేసింది. ‘‘ఏమిటోయ్ అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు ! అంటే ఎవ్వరి తప్పుల్నీ ఎత్తి చూపాల్సిన అవసరం లేదనేగా నువ్వనేది. ఈ దేశాన్ని ఎవడుబడితే వాడు పట్టపగలే కొల్లగొడుతోంటే అందరూ చూస్తూ ఊరుకోవాలనేనా నీ వెధవాలోచన. దేశహితాన్ని మంటగలిపేసే నీలాంటి వాళ్లుండబట్టే మనం ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నాం. ఛీ… ఛీ…’’ రొప్పుతూ, వాడిమీద నిప్పులు చెరిగాను.
ఎన్నడూ ఎరగని నా కోపం చూసి వాడు ఒక్కసారి గాభరాపడిపోయి, నోరు వెళ్లబెట్టి అమాయకంగా అన్నాడు. ‘‘అదేంట్రోయ్. అలా మీదికొచ్చేస్తున్నావ్. ఇప్పుడు మాత్రం జరుగుతున్నదేమిటి? కొన్నాళ్లు గడిచాక అన్ని కుంభకోణాలూ మరుగున పడిపోవడంలేదూ…! మరి ఈ మధ్యలో వాటి ఆరోపణల గురించి వార్తలు చదువుకోవడంలో ప్రజల టైం వేస్టు తప్ప సాధిస్తున్నదేంటో చెప్పు?’’ అమాయకంగానే అయినా, సవాలు విసిరాడు.
నేను కాస్త సిగ్గుపడిపోయి ‘‘సారీరా, ఏదో ఆవేశం ఆపుకోలేకపోయాను’’ అన్నాను.
‘‘ఫర్వాలేదులే! చూడబోతే నీక్కూడా మా ఆవిడతో రాఖీ కట్టించడం ఒక్కటే మంచి మందు లాగుంది’’ అన్నాడు.
![]()
‘‘ఈ రాఖీకి అంతటి శక్తి ఉందని గ్యారంటీ ఇవ్వండి అన్నయ్యగారూ… నేను వెళ్లి ఏ ముషారఫ్ కో కట్టేస్తాను. ఈ జన్మవైరానికి జనగణమన పాడినట్లుంటుంది’’ టీ కప్పులతో వచ్చి చర్చలో సెటిలైంది మా ఆవిడ.
వాడు విరగబడి నవ్వి ‘‘ఇది ఇంకా బాగున్నట్లుందిరోయ్… మన నక్సలైట్లకు చనిపోయిన పోలీసుల భార్యల చేత, గుజరాత్ రాక్షసమూకలకు బాధిత కుటుంబాల అభాగినుల చేత, కాశ్మీరు తీవ్రవాదులకి అక్కడ అనాధలవుతున్న అనేకమంది చెల్లెళ్లచేత రాఖీలు కట్టిస్తే చాలు… ఇక దేశమంతా శాంతి సౌభాగ్యాలు తప్ప మరొకటి కనిపించదు… ఉత్తినే రాఖీలు కడితే చాలు…’’ అన్నాడు.
‘‘రాఖీ అంటే చేతికి కట్టేది మాత్రమే కాదురా! అది గుండె నిండుగా పొంగి వచ్చే ప్రేమ!! నిష్కల్మషంగా హృదయాన్ని పంచి ఇచ్చే ప్రేమ!!! ఇపుడు నువు చెప్పిన జాబితాలో ఎవ్వరైనా స్వచ్ఛంగా ఆ ప్రేమను రక్షాబంధన్ గా పంచి ఇవ్వనీ… నువ్వు పరిహసించిన కల నిజం కావడం కష్టమేమో గానీ, అసాధ్యం మాత్రం కాదు’’ అన్నాన్నేను.
![]()
రాఖీ…
ఏ వ్రతమో చేసుకుని దేవుడు రక్షిస్తాడని చేతికి కట్టుకునేది కాదు. మనిషికీ మనిషికీ మధ్య మానవత్వం ఉందని చాటిచెప్పేది. ఒకరి పట్ల మరొకరి ప్రేమే కలకాలం అందరికీ రక్ష అని నిరూపించేది.
అది ప్రేమకు చిహ్నం. మనం పూర్తిగా మరచిపోకపోయినా మరుగున పడిపోతున్న ప్రేమాస్పద మానవ విలువలకు ప్రతిరూపం. అది సర్వజనీనం, సర్వకాలీనం కావాలి…
ఆ ప్రేమే సర్వజగద్రక్ష!
![]()
‘ఈనాడు’ సంపాదకీయం పేజీలో ప్రచురితం
