• 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
Thursday, July 30, 2026
  • Login
  • 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
  • 🏠
  • JOURNALIST
    • Editorials
    • Articles
  • WRITER
    • Stories
    • Poetry
    • Satires
    • Articles
    • Children Stories
    • Cartoons
    • Novels
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
No Result
View All Result

చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

KA Muni Suresh Pillai by KA Muni Suresh Pillai
July 30, 2026
in Articles
0 0
0
చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

(విశాలాంధ్ర సంపాదకీయం పేజీలో 30 జులై 2026 నాడు ప్రచురితమైన వ్యాసం.. పూర్తిపాఠం)

‘Marks are not the sparks of wisdom’ అని నేను చదువుకునే రోజుల్లో తరగతి గదిలో గోడల మీద అనేక నీతివాక్యాల్లో ఒకటిగా చూస్తూ పెరిగాను. బహుశా ఈ రోజుల్లో బడిలో అలాంటి మాటలు బహిరంగంగా వల్లిస్తే ఆ టీచర్లకే అరదండాలు వేయిస్తారేమో!? మార్కుల కోసం పరుగులు తీయడమే జీవనవేదంగా రేపటి తరాలను వెంటబడి తరుముతున్న వ్యవస్థే ఇప్పుడుంది. ఇది ఒక తరహా అత్యాచారం.

ఈ దుర్మార్గంలో తల్లిదండ్రులు, టీచర్లు, నాయకులు, ఇరుగుపొరుగు వ్యక్తులు అందరూ పాత్రధారులే. తాము ఎలాంటి అత్యాచారాలకు గురవుతున్నామో తెలియకుండానే పిల్లలు ఆ పరుగుపందేల్లో భాగమైపోతున్నారు. క్రమంగా.. అలాంటి అత్యాచారాలను ఆస్వాదిస్తున్నారు. అవి అత్యాచారాలనే స్పృహ ఎప్పటికీ కలగకుండానే.. జీవితం మొత్తం ఆనందంగా గడిపేస్తూ.. అలా అత్యాచారాలు చేసే దళాల్లో తాము కూడా ఒక భాగంగా మారిపోతుంటారు. ప్రభుత్వ విద్యారంగం వెలిగిపోతున్నదని అంతా అంటున్నారు. వారి మాటల వెనుక ఉన్న తూకంరాళ్లు- ‘నూరుశాతం ఫలితాలు’, ‘మార్కులు’ మాత్రమే. ఈ పరిణామాల్ని వెలుగుతుండడంగానే భావించాలా? లేదా, తగలబడుతుండడంగా చూడాలా?

కార్పొరేట్ విద్యారంగం మార్కెట్ వ్యూహాలు మనుషుల బుద్ధులను శాసించే రోజులు రానంత వరకు పదోతరగతిలో 500 మార్కులు రావడం అనేదే ఒక అద్భుతంగా ఉండేది. నేను పదోతరగతిలోకి ప్రవేశించినప్పటికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 531 మార్కులు! ‘ఈసారి నేను 532 తెచ్చుకుంటాను’ అనే బాల్యసహజమైన చాపల్యపు అతిశయ ప్రకటన (ఇంట్లోనే) చేసి ఆ ఏడాది చదువు ప్రారంభించాను. నా అతిశయాలు 496 దగ్గర ఆగిపోయాయి. అప్పటికీ అవి మంచి మార్కులుగానే గుర్తింపు పొందాయి. ఆ మార్కులకు ప్రోత్సాహకంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన మెరిట్ స్కాలర్‌షిప్ లు, ఆ తర్వాత అయిదేళ్లపాటు నా చదువులకు ఆలంబనగా నిలిచాయి. ఈరోజుల్లో అయితే.. ఆ మార్కులు వచ్చిన విద్యార్థి బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడి ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యం కలగదేమో!

95 శాతానికి పైగా మార్కులు ఈ రోజుల్లో సునాయాసంగా వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది వెలువడిన ఫలితాల్లో ఈ అద్భుతాన్ని సాధించిన వారు అక్షరాలా అరలక్ష మంది ఉన్నారు. 95 శాతం అనగా 600కు గాను 570 మార్కులు సాధించిన వారు సీబీఎస్ఈలో 2.39 శాతం ఉండగా.. ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నుంచి 7.92 శాతంగా ఉంది. సీబీఎస్ఈ బోర్డు విద్యార్థులకంటె రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఈ మాత్రం స్కోరు చేస్తున్న వారు మూడురెట్లు ఎక్కువగా ఉంటున్నారు. ఈ గణాంకాలు చూసి మురిసిపోవాలి కదా- అనిపించవచ్చు. సెంట్రల్ బోర్డు కంటె స్టేట్ బోర్డు ద్వారానే విద్యార్థులు గొప్పగా సాధిస్తున్నారు కదా అనిపించవచ్చు. గణాంకాలు చూస్తే ఇలాంటి భ్రమలు కలుగుతాయనేదే అసలు భయం, ఆవేదన. మార్కులు వెల్లువగా వస్తున్నాయి గానీ.. సర్వేలలో గానీ, ప్రవేశపరీక్షల సందర్భాల్లో గానీ ఈ విద్యార్థుల్లోని నైపుణ్యాలు, నేర్చుకోగల శక్తి పేలవంగా ఉన్నట్టు తేలుతున్నది. మొత్తంగా స్టేట్ బోర్డు పరీక్షల్లో విద్యార్థులకు ‘చాలా ఉదారంగా’ మార్కులు వేసేస్తున్నారు- అని తేలుతోంది. మార్కులపరంగా హీరోలుగా తేలుతున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లోనే ఉంటున్నది గానీ.. తదనుగుణంగా వారు పదో తరగతి తర్వాతి కోర్సులలోనూ, ప్రవేశ పరీక్షలలోనూ ప్రతిభ కనబరచలేక పోతున్నారనేది వాస్తవం. నాకు కొన్ని చేదు వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి!

ఒక సందర్భంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక బాలికతో కాసేపు ముచ్చటించాల్సి వచ్చింది. అమ్మాయి పల్లెటూరు నుంచి బస్సులో పట్టణానికి వెళ్లి అక్కడ ఒక ప్రైవేటు హైస్కూల్లో చదువుతోంది. చదువులెలా సాగుతున్నాయో చూద్దామని తెలుగు పుస్తకం తీసుకుని ఒకటి రెండు ప్రశ్నలు అడిగాను. సమాధానం రాలేదు. ఒక పాఠం చదవమని అడిగాను. గడగడా పేజీ మొత్తం చదివేసింది. నాకెందుకో సందేహం వచ్చి మధ్యలో ఒక వాక్యాన్ని వేలితో చూపించి- అది చదవమని అన్నాను. చదవలేకపోయింది. ‘ఇంతకుముందు చదివావు కదా’ అని అడిగితే మళ్లీ ప్రారంభం నుంచి చివరి వరకు పేజీలో ఉన్నది మొత్తం చెబుతోంది తప్ప- ఏదైనా ఒక వాక్యం చూపిస్తే చదవగల గ్రహింపు ఆ అమ్మాయిలో లేదు. గ్రామీణ పేదలు కూడా వేల రూపాయలు పోసి ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తోంటే (అమ్మ ఒడులు, తల్లికి వందనాలు మొదలుకాని రోజుల్లోని అనుభవం ఇది) కనీసం తెలుగు పాఠ్య పుస్తకం చదవడం కూడా నేర్పడం లేదా అని నాకు చాలా బాధేసింది. ఆ తర్వాతి కాలంలో ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ అద్భుతమైన మార్కులతో పాస్ అయి, ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. బీటెక్ లో కూడా చేరింది. 8వ తరగతి తరువాత ఆ అమ్మాయి చదువుల ప్రమాణాలు విపరీతంగా మెరుగుపడడం వల్ల కాదు. టెన్త్ లో బోలెడు మార్కులు వాటంతట అవే వచ్చి పడ్డాయి. ఇంటర్ లో అత్తెసరు మార్కులతో గట్టెక్కింది. ఎమ్‌సెట్ ర్యాంకు లక్షల్లో వచ్చింది. కానీ, ‘తెల్ల రేషన్ కార్డు’ మాత్రమే ఎడ్మిషన్ కు అతిపెద్ద అర్హత అని పరిగణించే ప్రెవేటు కాలేజీలు వర్ధిల్లుతున్న వ్యవస్థలో, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఇంజినీరింగ్ సీటు వచ్చింది. ఆ రకంగా ఆమె జీవితం ముందుకెళుతోంది.

గణాంకాలు సాక్ష్యంగా మనలో పుట్టే భయం ఒక్కటే. పిల్లల జ్ఞానం పెరగడం లేదు గాని, పదో తరగతిలో మార్కులు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి. తెలుగు సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు సాధించిన వారు రాష్ట్రంలో 20వేల మంది వరకు ఉండడం వింతే. 90కిపైగా మార్కులు వచ్చిన వాళ్లు ఏకంగా 1.86 లక్షల మంది! హిందీ, ఇంగ్లిషుల్లో ఈ స్థాయి మేధావి విద్యార్థుల సంఖ్య 1.11 లక్షలు, 74 వేలు! తెలుగులో ఒక్క అక్షర దోషం, అన్వయదోషం లేకుండా.. ముత్యాల్లాంటి చేతిరాతతో రాస్తే ఎవరికైనా అలా 100 మార్కులు వస్తాయేమో. సాధారణ పరిస్థితుల్లో అనూహ్యం. పదవ తరగతిలో అంతలేసి మార్కులు వస్తున్నాయంటే మూల్యాంకనం చేస్తున్న టీచర్లు మార్కుల దానకర్ణులా అనే అభిప్రాయం కలుగుతోంది. వారికైనా తెలుగు శుభ్రంగా తెలుసా అనే భయం పుడుతుంది! ‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సూపర్’ అనే అబద్ధాన్ని వ్యాప్తిలో పెట్టడానికి విచ్చలవిడిగా మార్కులు వేస్తున్నారా? అనేది అనుమానం. ఇలాంటి ఎత్తుగడలు.. ప్రభుత్వ రంగంలోని ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను సర్వనాశనం చేసేస్తున్నాయి.

‘ఇవాళ్టి పిల్లలకు చదువుకోవాలనే ఆలోచనే ఉండడం లేదు. బడికి రారు.. వస్తే పాఠం వినరు.. పరీక్షల్లో మేం జవాబులు డిక్టేట్ చేసినా శుభ్రంగా రాయరు. మేమే- బడికి రాకపోయినా ఎటెండెన్సు వేస్తాం, పరీక్షలో రాయకపోయినా మార్కులు వేస్తాం’ అని ఒక ఉపాధ్యాయ మిత్రుడు నవ్వుతూ చెప్పిన మాట కఠినమైన నిజం.

విద్యాప్రమాణాల వినాశనం దిశగా సాగుతున్న ఈ కృషిలో అధికారంలో ఉన్న నాయకులదే ప్రధాన పాత్ర! మేం పరిపాలిస్తుండగా.. ఉత్తీర్ణత శాతం ఇంత గొప్పగా ఉండేది- అని చాటుకోవడం వారికి కావాలి తప్ప.. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అక్షరజ్ఞానం ఉందా లేదా వారికి అక్కర్లేదు. నూరుశాతం ఫలితాలు సాధించాల్సిందే.. అని టీచర్లమీద వారు పెడుతున్న ఒత్తిడి సామాన్యమైనది కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంటేనే పేదవర్గాలకు చెందిన వారుంటారు. ఆ పేదరికం- అనేకరీతుల్లో వారు శ్రద్ధగా చదువుకోడానికి అవసరమైన వాతావారణాన్ని సహజంగానే దూరం చేస్తుంటుంది. ‘నూరుశాతం ఫలితాలు’ అనే అసంబద్ధ లక్ష్యాన్ని టీచర్ల ఎదుట పెట్టి, వారి మెడ మీద కత్తిపెట్టి.. ‘సాధించండి’ అని హుకుం జారీ చేస్తే ఏమవుతుంది? పరీక్షల్లో విచ్చలవిడి కాపీయింగ్ ను టీచర్లే ప్రోత్సహిస్తున్నారు. బిట్ పేపర్ కు, వీలైనంత వరకు ప్రశ్నలకు కూడా సమాధానాలు డిక్టేట్ చేసి రాయిస్తున్నారు. ఎగ్జామ్ హాల్లో ప్రతి గదికీ తిరుగుతూ.. ఉమ్మడిగా అందరికీ సరైన ఆన్సర్లను తామే చెప్పేస్తున్నారు. స్పాట్ లో మూల్యాంకనం చేస్తున్నప్పుడు.. తమ వంటి ఇతర టీచర్ల మీద సానుభూతితో.. వారికి నిందలురాకుండా.. ప్రతివిద్యార్థికీ ఇబ్బడిముబ్బడిగా మార్కులు వేసేస్తున్నారు. ఉత్తీర్ణత శాతాలు, మార్కుల షీట్లు మహాద్భుతాలుగా తయారవుతున్నాయి.

విద్యార్థులను సర్వనాశనం చేయడంలో రాజకీయ నాయకుల శ్రద్ధ, పాత్ర అక్కడితో ఆగడం లేదు. తమ వంతుగా ఇంకా పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు- తమ తమ నియోజకవర్గాల పరిధిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానాలు చేస్తున్నారు. వారి పేరిట ఇంటి నివాసస్థలాలను పట్టాలుగా ఇస్తున్నారు, వారికి విమానం టికెట్లు బుక్ చేయించి కొత్త ప్రదేశాలు చూపించడం రూపంలో అభినందిస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి, మిగిలిన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ఇలాంటి అభినందనలు అవసరమే. కానీ.. అబద్ధపు పనులు, మాయల మీద నిర్మాణమైన ర్యాంకుల చుట్టూ చేసే సన్మానాలు పిల్లల్ని మరింతగా పక్కదారి పట్టిస్తాయి కదా! ఇలాంటి అభినందనల బదులుగా వారి తర్వాతి చదువులకు నిర్దిష్టమైన చేయూత అందిస్తే బాగుంటుంది కదా! -ఇలా అందరికీ అనిపిస్తుంది. కానీ నాయకులకు కావాల్సింది ప్రచారం! తమ నియోజకవర్గంలో విద్యార్థులు ఇంత ఘనత సాధించారు, అంటే తమ పరిపాలనలో నియోజకవర్గంలో విద్యారంగం అద్భుతంగా వర్ధిల్లుతోంది, ఆ విద్యార్థులను తన సొంత ఖర్చుతో అద్భుతంగా అభినందించారు.. ఈతరహా ప్రచారం వారికి కావాలి! అందుకోసం వారు పడే తాపత్రయం విద్యారంగాన్ని, విద్యార్థుల్ని కూడా పక్కదారి పట్టిస్తోంది. వారి అత్యుత్సాహం ప్రతికూల పర్యవసానాలకు కారణమవుతోంది.

టీచర్లు తమ తమ స్కూళ్లలో మరింతగా కాపీయింగ్ ను ప్రోత్సహించాలని, నాయకుల గుడ్ లుక్స్ లో ఉండాలని తాపత్రయ పడుతున్నారు. నాయకులు కూడా మంచి ఫలితాలు వచ్చిన స్కూళ్లకు అభినందనలు, విద్యార్థులకు భూమి పట్టాలు కాకుండా.. మంచి ఫలితాలు సాధించే స్కూళ్లకు మంచి లాబొరేటరీ వంటి అదనపు సదుపాయాలు కల్పిస్తే విద్యార్థులకు నిజమైన అభ్యసనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ మనుగడ కోసం కొన్ని మాయలు అవసరం అని వారు అనుకున్నప్పటికీ.. ప్రతి బడికీ మంచి ల్యాబ్ వంటి సదుపాయాలుంటే.. ఖచ్చితంగా విద్యార్థుల స్థాయి మెరుగుపడుతుంది. మార్కులు దానం చేయడం అనేది తమ చేతిలో పని గనుక టీచర్లు ఔదార్యం ప్రదర్శిస్తున్నారు, మంచిదే. కానీ విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధించడం.. భిన్న వర్గాలకు చెందిన, గ్రహించే స్థాయిలో తేడాలతో ఉండే విద్యార్థులకు ప్రత్యేకశ్రద్ధతో బోధించడం కూడా తమ చేతిలో పనే అని వారు గుర్తించాలి. మార్కులను పప్పులు బెల్లాల్లా పంచిపెడుతూ, చదువు చెప్పేప్పుడు పిల్లలకు శ్రద్ధ లేదని ఊరుకోవడం సరికాదు.

ర్యాంకులు ఒకరిద్దరికి రావొచ్చు. పాఠశాలకు నూరుశాతం పాస్ ఫలితాలు రావొచ్చు. మురిసిపోవడానికి అవి ప్రధాన కారణాలు కాకూడదు. నూరుశాతం మంది విద్యార్థుల్లో చదువుపట్ల శ్రద్ధను పాదుగొల్ప గలగాలి. ఆ శ్రద్ధను, చదువుపట్ల గౌరవాన్ని అందరిలో విత్తితే.. కాలక్రమంలో వారి జీవితాలు గొప్పగా వికసించడం తథ్యం. ఆ పని చేయగలిగినప్పుడు ప్రతి టీచరు మురిసిపోవచ్చు. అలాంటి టీచర్ల పాదాలకు మనం ప్రణమిల్లవచ్చు!

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
పాత్రికేయుడు, 99594 88088

Tags: education in APka muni suresh pillaivisalandhra articlevisalandhra editorial pageకెఎ మునిసురేష్ పిళ్లె
Previous Post

ప్రేమే రక్షా బంధనం

Please login to join discussion
  • Privacy Policy
  • Terms and Conditions

Developed by : www.10gminds.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Books
  • Books Sale
  • Cart
  • Checkout
  • My account
  • Privacy Policy
  • Profile
  • Shop
  • Stories
  • Terms and Conditions
  • 🏠

Developed by : www.10gminds.com